‘ప్రైవేటుకే’ పట్టాభిషేకం ! | The lack of transparency in the selection of talent awards | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటుకే’ పట్టాభిషేకం !

Published Fri, Feb 27 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

The lack of transparency in the selection of talent awards

ప్రతిభ అవార్డుల ఎంపికలో లోపించిన పారదర్శకత
{పైవేటు విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
అవార్డుల ప్రదానం ఒకేచోట కావడంతో విద్యార్థులకు తప్పని తిప్పలు

 
సర్కారు విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామంటూ పదేపదే చెప్పే విద్యాశాఖ పెద్దలు విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహకరంగా అందించే ప్రతిభ అవార్డుల ఎంపికలో పారదర్శకతను గాలికి వదిలేశారు. విద్యార్థుల సంఖ్య పతనావస్థకు చేరుకుని ప్రభుత్వ పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న తరుణంలో ప్రైవేటు పాఠశాలలనే ప్రోత్సహించే దిశగా ప్రతిభ అవార్డుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
 
చిత్తూరు(ఎడ్యుకేషన్): శుక్రవారం తిరుపతిలో జరగనున్న ప్రతి భ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి, ప్రధానంగా ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి ఎంపికైన విద్యార్థులను ఒకేచోటుకు పిలవడంతో వారు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తిరుపతికి చేరుకున్న విద్యార్థులకు మూడు జిల్లాల వారికి ఒక చోట బస ఏర్పాటు చేయడంతో వారు అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది 10వ తరగతికి సంబంధించి ఉత్తమ ఫలితాలు సాధించిన 3,965 మంది విద్యార్థులను, ఇంట ర్మీడియెట్‌లో 504 మందిని ప్రతిభ అవార్డులకు ఎంపిక చేశారు. వీరందరికీ శుక్రవా రం తిరుపతి తారకరామ స్టేడియంలో అవార్డుల ప్రదా న కార్యక్రమం జరగనుంది. చిత్తూరు జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 395 మంది విద్యార్థులను ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఆరుగురు విద్యార్థుల(జనరల్-2, ఎస్సీ-1,ఎస్టీ-1,బీసీ-1,బాలిక-1)ను అవార్డులకు ఎంపిక చేశారు. వీరికి ఒక్కొక్కరికి రూ.20వేలు చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందిస్తారు.  అయితే ఈ ఎంపికలో ప్రధానంగా గ్రామీణ విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రత్యేక  ప్రాధాన్యం  లేకపోవడంతో వారు నష్టపోతున్నారు. పరోక్షంగా ప్రభుత్వ విద్యాసంస్థల మనుగడను మరింత దిగజార్చే చర్యలకు ప్రభుత్వం పూనుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి.

ఇంటర్మీడియట్‌లో జీరో :  ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ-ఎంఈసీ విభాగాలకు సంబంధించి జిల్లాలో ప్రకటించిన ప్రతిభ పురస్కారాల జాబితాలో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ కళాశాల విద్యార్థి పేరు కూడా లేకపోవడం విస్మయానికి గురిచేసే అంశం. ప్రతి జిల్లాకు 39చొప్పున 13 జిల్లాలకు 504 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపికచేశారు. ఇక జిల్లాలో 10వ తరగతికి సంబంధించి 230 మంది ప్రభుత్వ హైస్కూళ్ల విద్యార్థులను, 165మంది ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులను ఎంపిక చేశారు. మండల స్థాయిలో అవార్డుల ఎంపికకు సంబంధించి కనీసం ఎంఈవోలకు కూడా సమాచారం లేకుండానే జాబితాను సిద్ధం చేశారు. 10వ తరగతికి సంబంధించి మండలాలవారీగా ఎంపిక జరగడం వల్ల ప్రైవేటు స్కూళ్లు లేని మారుమూల మండలాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల పేర్లు కనిపించాయి. కొన్ని మండలాల్లో, ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఇచ్చిన ఆరు అవార్డులకు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులనే ఎంపిక చేశారు.

ఎంపికలో ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రత్యేక కోటా : అవార్డుల ఎంపికలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక కోటాను కేటాయించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించలేని విద్యార్థులే ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనిపిస్తారు. వీరికి రూ.20వేలు ప్రోత్సాహం అంటే ఉన్నత చదువులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యానికి దోహదం చేస్తుంది.
 
ప్రాక్టికల్స్ ప్రాబ్లం

గత విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి అవార్డులు సాధించిన విద్యార్థుల్లో కొంతమంది ప్రస్తుత విద్యాసంవత్సరంలో డిగ్రీ చదువుతున్న వారికి ప్రాక్టికల్ పరీక్షలు జరగుతుండటంతో అవార్డుల కార్యక్రమానికి హాజరుకావడం సమస్యగా పరిణమించింది. ప్రాక్టికల్ పరీక్షను వదులుకుంటేగానీ తిరుపతికి హాజరుకాలేని పరిస్థితి.  పైగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందినవారందరినీ తిరుపతికి ఆహ్వానించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వారికి తిరుపతిలో బస సౌకర్యాలు కూడా సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నెలకు ముందే జరిపి ఉంటే కొంత సౌకర్యంగా ఉండేది.  
 
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రాధాన్యమివ్వాలి


ప్రతిభ అవార్డులకు ఎంపికైన విద్యార్థులందరికీ శుభాభినందనలు. ప్రతిభ ఆధారంగా ప్రభుత్వం అందించే పురస్కారాలకు ప్రధానంగా గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రాధాన్యతను పెంచాలి. ఈ విద్యా సంవత్సరం నుంచైనా ప్రత్యేక కోటాను ఏర్పాటుచేసి అవార్డుల ఎంపిక చేపట్టాలి. ప్రాక్టికల్ పరీక్షలకు ముందుగానే అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించి ఉంటే బాగుండేది.
 -యండపల్లి శ్రీనివాసులురెడ్డి, పట్టభద్రుల శాసనమండలి సభ్యులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement