విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం
- పదోన్నతుల కౌన్సెలింగ్ సాయంత్రం 6గంటలకు ప్రారంభం
- ఖాళీపోస్టుల లెక్కతేలక ఆలస్యం
- తమ పోస్టులు తమకే కేటాయించాలని దళిత ఉపాధ్యాయ సంఘాల నిరసన
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉదయం 9గంటలకు ప్రారంభం కావాల్సిన పదోన్నతుల కౌన్సెలింగ్ సాయంత్రం 6గంటలకు ప్రారంభమైంది. బుధవారం నిర్వహించిన జీహెచ్‌ఎంల బదిలీల కౌన్సెలింగ్‌లో నాట్‌విల్లింగ్ ఇచ్చిన వారు మళ్లీ వచ్చి పోస్టింగ్ తీసుకోవడం, కోరుకున్న పోస్టులను,ఖాళీ పోస్టులను గుర్తించడంలో డీఈఓ కార్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ సమస్య తలెత్తింది.
మొత్తం 53మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు అధికారులు కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేశారు. తీరా ప్రారంభించే ముందు 6పోస్టులు తక్కువగా లెక్క తేలుతున్నాయి. మొత్తం 53పోస్టులకు గాను 47మాత్రమే ఖాళీలు కనిపించాయి. మిగతా ఆరు పోస్టులు ఎక్కడ పోయాయనేది గుర్తించేందుకు విద్యాశాఖాధికారులకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సమయం పట్టింది.
దళిత ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
సాయంత్రం 6గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వచ్చిన జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డీఈఓ ఎన్.రాజేష్, రాష్ట్ర పరిశీలకుడు నజీముద్దీన్‌తో ఉపాధ్యాయల సంఘాల నాయకులు జెట్టి రామస్వామి, జంగయ్య, బాలపీరు, సుదర్శన్, సతీష్‌కుమార్, ఎన్.వెంకటేష్, హన్మంతరావు ఆందోళనకు దిగారు. 484 జీహెచ్‌ఎం పోస్టులకుగాను జీఓ ప్రకారం 15శాతం అంటే 73పోస్టులు ఎస్సీలకు ఉండాలి. కానీ 62మంది మాత్రమే జీహెచ్‌ఎంలు ఉన్నారని, ఇంకా 11మందికి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుత కౌన్సెలింగ్‌లో రోస్టర్ ప్రకారం 9మంది ఎస్సీలకు మాత్రమే జీహెచ్‌ఎంల పదోన్నతి ఇస్తామని చెప్పడం సరికాదని పేర్కొన్నారు.
గతంలో 2009 నుంచి 2014 వరకు ఎస్సీ అడక్వేసి దాటిందని 27పోస్టులు ఇతరులకు కేటాయించారని తెలిపారు. ఎస్సీలకు సంబంధించిన పోస్టులను ఇతర వర్గాలకు కేటాయించడం వల్ల ఎస్సీలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. తమకు రావల్సిన పోస్టులు ఇచ్చిన తర్వాతనే కౌన్సెలింగ్ నిర్వహించాలని అన్నారు. దీంతో సాయంత్రం జేసీ రాంకిషన్ కౌన్సిలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడారు. రోస్టర్ పాయింట్స్ లేనందును 9 పోస్టులను ప్రస్తుతం ఇస్తామని, తర్వాతా వచ్చే రోస్టర్‌లో కేటాయిస్తామని ఇప్పటి నుంచి రూల్స్ ఖచ్చితంగా పాటిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రారంభమయ్యింది. రాత్రి 9.30కు 35వరకు పదోన్నతులు నిర్వహించారు. రాత్రి 11గంటలకు వరకు కౌన్సెలింగ్ జరగొచ్చని అధికారులు తెలిపారు.