పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
- ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు
- తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన15 వేల మంది ఉపాధ్యాయులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారుు. ఈ ధర్నాలో 20 రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్)కు చెందిన సుమారు 15 వేల మంది ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్‌ఐ జనరల్ సెక్రటరీ సీఎన్. భారతి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఎఫ్‌ఆర్‌డీఏను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్ నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, వై. శ్రీనివాసులు రెడ్డి, డా.ఎం.గేయానంద్, ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు పాల్గొని సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ. వెంకటేశ్వరరావు, పి. బాబురెడ్డి ప్రసంగిస్తూ.. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
పాత పెన్షన్ విధానం ప్రకారం ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఎంత జీతం ఉందో.. అందులో సగం ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్‌గా వచ్చేదన్నారు. అరుుతే సీపీఎస్ అమలు వల్ల ఆ పెన్షన్ రాకుండా పోతోందన్నారు. 12 ఏళ్లుగా అమలవుతున్న ఈ విధానం.. దేశంలో 40 లక్షల మంది ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిందని యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. రవి పేర్కొన్నారు. ఈ ధర్నాలో ఎస్టీఎఫ్‌ఐ అధ్యక్షుడు అబిజిత్ ముఖర్జీ, సంఘం నేతలు ఎన్.నారాయణ, కేసీ. హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.