‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌’..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! | New pension scheme to benefit central govt staff | Sakshi
Sakshi News home page

‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌’..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

Published Sun, Aug 25 2024 10:05 AM | Last Updated on Sun, Aug 25 2024 2:24 PM

New pension scheme to benefit central govt staff

కేంద్ర ఉద్యోగులకు అష్యూర్డ్‌ పెన్షన్‌ పథకం

పాతికేళ్ల సర్వీస్‌ పెన్షన్‌గా సగం వేతనం 

పదేళ్ల సర్వీసుంటే కనీసం రూ.10 వేలు 

రిటైర్మెంట్‌ సమయంలో వేతనంలో

పదోవంతు ఏకమొత్తంగా చెల్లింపు 

పెన్షనర్‌ మరణానంతరం కుటుంబీకులకు 60% 

ప్రభుత్వోద్యోగులకు సామాజిక భద్రత: కేంద్రం 

23 లక్షల మందికి లబ్ధి: అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం మోదీ సర్కారు తాజాగా ఏకీకృత పెన్షన్‌ విధానాన్ని (యూపీఎస్‌) తీసుకొచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హరియాణా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం పాతికేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్‌ పెన్షన్‌గా అందిస్తారు. దీనికి అదనంగా రిటైర్మెంట్‌ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏకమొత్త ప్రయోజనంగా కూడా అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం యూపీఎస్‌కు ఆమోదముద్ర వేసింది. 

దీనితో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వారికి సామాజిక భద్రత లభిస్తుందన్నారు. కేబినెట్‌ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నూతన జాతీయ పెన్షన్‌ విధానం (ఎన్‌పీఎస్‌)లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారవచ్చని చెప్పారు. 2004 జనవరి 1 తర్వాత సర్వీసుల్లో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది. సైనికోద్యోగులను మినహాయించి 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వోద్యోగాల్లో చేరిన వారందరికీ ఎన్‌పీఎస్‌ను అమలు చేయడం తెలిసిందే. 

సోమనాథన్‌ కమిటీ సూచనలతో..
మోదీ సర్కారు తీసుకొచ్చిన ఎన్‌పీఎస్‌పై ప్రభుత్వోద్యోగుల్లో వ్యతిరేకత రావడం తెలిసిందే. డీఏ ఆధారిత పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) కోసం వాళ్లు పట్టుబడుతున్నారు. పలు రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పారీ్టల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్‌ వైపు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్‌ను తెరపైకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ సారథ్యంలో గతేడాది ఒక కమిటీ వేసింది. ప్రభుత్వోద్యోగుల పెన్షన్‌ పథకాన్ని సమీక్షించి, దానికి చేయాల్సిన మార్పుచేర్పులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కమిటీ 100కు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్‌ విధి విధానాలను రూపొందించినట్టు వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్‌ 1) నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్‌ తెలిపారు. 

ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రత: మోదీ 
యూపీఎస్‌తో ప్రభుత్వోద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. ‘‘జాతి ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వోద్యోగులు మనకు గర్వకారణం. వారి సంక్షేమానికి, భావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది’’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. 

బాక్సు యూపీఎస్‌ విశేషాలివీ... 
👉 అష్యూర్డ్‌ పెన్షన్‌: ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్‌ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం పాతికేళ్ల సరీ్వసు పూర్తి చేసుకుని ఉండాలి. అంతకంటే తక్కువైతే సరీ్వసు కాలాన్ని బట్టి పెన్షన్‌ మొత్తం నిర్ధారణ అవుతుంది. 

👉అష్యూర్డ్‌ మినిమం పెన్షన్‌: కనీసం పదేళ్ల సరీ్వసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్‌ అనంతరం నెలకు రూ.10 వేల కనీస పెన్షన్‌ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలుండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కలి్పస్తుంది. 

👉 అష్యూర్డ్‌ ఫ్యామిలీ పెన్షన్‌: పెన్షనర్‌ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్‌లో 60 శాతాన్ని అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది. 
కొత్తగా ఏకమొత్త ప్రయోజనం 

👉 ప్రతి ఆర్నెల్ల సర్వీసుకూ నెలవారీ వేతనం (జీతం+డీఏ)లో పదోవంతు చొప్పున రిటైర్మెంట్‌ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. గ్రాట్యుటీ తదితర బెనిఫిట్లకు ఇది అదనం. 

👉 సర్వీసులో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్‌ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక, డీఆర్‌ ప్రయోజనాలను వర్తింపజేస్తారు. 

👉ఇప్పటికే ఎన్‌పీఎస్‌ కింద రిటైరైన వారితో పాటు 2025 మార్చి 31 నాటికి రిటైరయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్‌ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్‌ వడ్డీరేటుతో చెల్లిస్తారు. 

👉 ఉద్యోగులు ఎన్‌పీఎస్, యూపీఎస్‌ల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు. 

👉 యూపీఎస్‌ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారమేమీ పడబోదు. పెన్షన్‌ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10 శాతంగానే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14 శాతం నుంచి 18.5 శాతానికి పెరగనుంది. దీనివల్ల కేంద్రంపై రూ.6,250 కోట్ల దాకా భారం పడనుందని సోమనాథన్‌ వెల్లడించారు. బకాయిల రూపేణా మరో రూ.800 కోట్ల భారం పడుతుందన్నారు. 

👉 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్‌ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. 

బాక్సు కేబినెట్‌ ఇతర నిర్ణయాలు 
బయో ఈ–3, విజ్ఞాన్‌ధారతో పాటు 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ పథకాలకు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. విజ్ఞాన్‌ధారలో భాగంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నొవేషన్లకు సంబంధించి మూడు ప్రస్తుత పథకాలను ఒకే గొడుగు కిందకు తెచి్చంది. ఇందులో భాగంగా ప్రభుత్వం, విద్యా, పరిశ్రమల రంగాల మధ్య పరస్పర సహకారాన్ని మరింతగా పెంచేలా ప్రోత్సహిస్తారు. ఈ పథకానికి రూ.10,579 కోట్లు కేటాయించారు. బయో ఈ–3 కింద ఆర్థిక, పర్యావరణ, ఉపాధి రంగాల్లో బయో టెక్నాలజీకి మరింత ప్రోత్సహమందిస్తారు. దీన్ని ఒక చరిత్రాత్మక ముందడుగుగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. విజ్ఞాన్‌ధార పథకం యువతను శాస్త్రీయ పరిశోధనల వైపు మరింతగా మళ్లించి ఆ రంగంలో భారత్‌ను ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుపుతుందని అభిప్రాయపడ్డారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement