సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ కొందరికి చిక్కులు తెచ్చింది. ఆన్‌లైన్ బదిలీల్లో భాగంగా కోరిన చోట పోస్టింగ్ వచ్చినప్పటికీ విధానపరమైన అంశాలతో అక్కడ పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. పోస్టింగ్ వచ్చిన చోట కాకుండా ఉపాధ్యాయులు లేరంటూ ఖాళీగా ఉన్న పాఠశాలల్లో పనిచేయాలని విద్యాశాఖ ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 442 మంది టీచర్లు కేటాయించిన చోట కాకుండా కొత్త స్థానాల్లో విధులు నిర్వహించాల్సి వస్తోంది.
ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 74,734 మంది టీచర్లు బదిలీలకోసం దరఖాస్తు చేసుకోగా, వీరిలో 44,361 మందికి స్థాన చలనం కలిగింది. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు టీచర్లు బదిలీ అయ్యారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని స్కూళ్లలో పూర్తిస్థాయి టీచర్లకు స్థానచలనం కలగడంతో అవి ఖాళీ అయ్యాయి. దీంతో అక్కడ బోధన అయోమయంలో పడింది.
ఈక్రమంలో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి సంతృప్తికర స్థాయికంటే ఎక్కువ ఉన్న పాఠశాలల్లోని ఒకరిద్దరు ఉపాధ్యాయులను ఖాళీగా ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించారు. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయా టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోరిన చోట్ల పోస్టింగ్ వచ్చినప్పటికీ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో దూర ప్రయాణం తప్పడం లేదంటూ వారినుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
జూనియారిటీ తెచ్చిన తంటా...
ఉపాధ్యాయుల డిప్యుటేషన్లలో విద్యాశాఖ సీనియార్టీపై దయచూపింది. పాఠశాలలో జూనియర్‌గా ఉన్న టీచర్‌ను సమీప పాఠశాలలో డిప్యూట్ చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 442 పాఠశాలల్లో ఒక్కో టీచర్ చొప్పున డిప్యుటేషన్‌పై పంపింది. అక్కడ రెగ్యులర్ టీచర్ లేదా మంజూరైన విద్యావలంటీర్లు వచ్చేవరకు అక్కడ పనిచేయాలని స్పష్టం చేసింది. తాజాగా బదిలీల ప్రక్రియలో పలువురు టీచర్లు కొత్త స్థానాల్లో చేరారు. టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట నుంచి టీచర్లను డిప్యుటేషన్‌పై పంపారు. ఈక్రమంలో జూనియర్‌గా ఉన్న వారినే ఎంపిక చేశారు.
ఈ నేపథ్యంలో కొత్తగా బదిలీ అయిన వారినే డిప్యుటేషన్‌పై పంపడంతో వారంతా ఉసూరుమంటున్నారు. దీర్ఘకాలంగా ఎక్కువ దూరం ప్రయాణం చేసిన తమను మళ్లీ డిప్యుటేషన్‌పై పంపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా 15వేల విద్యావలంటీర్లను ప్రభుత్వం మంజూరు చేయగా, దరఖాస్తులు స్వీకరించిన అధికారులు 14వేల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆమోదించాల్సి ఉంది. కానీ ఎస్‌ఎంసీ సమావేశాలు నిర్వహించడంలో జాప్యం జరగడంతో వీవీల నియామక ప్రక్రియ పూర్తికాలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే కొందరికైనా ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment