
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ పాఠశాలల్లో పనిచేసేం దుకు మైదాన, ఏజెన్సీ ప్రాంతాల టీచర్లు ఒప్పుకున్న తర్వాతే ఏజెన్సీల్లోని ఉపాధ్యాయులను బదిలీ చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రెండు ప్రాంతాల టీచర్లను ఏ ప్రాంతానికైనా బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో కౌన్సెలింగ్ కొనసాగింపునకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవిల ధర్మాసనం అనుమతిచ్చింది.
గిరిజన, మైదాన ప్రాంతాల్లో పని చేసే టీచర్లు ఎక్కడివారక్కడే పనిచేసేలా ఉన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను మంగళవారం ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. గిరిజన ప్రాంతంలో టీచర్ల హాజరు తక్కువగా ఉందని, విద్యార్థుల ఉత్తీర్ణత 10% లోపే ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లోని టీచర్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు.
ఇతర వ్యాజ్యాలపై నేడు విచారణ
ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను ధర్మాసనం బుధ వారానికి వాయిదా వేసింది. కొత్త జిల్లాల ప్రకారం బదిలీలు చేపట్టాలని, కొత్త జిల్లాలకు విద్యాధికారులు లేకుండా బదిలీ చేయాలనడం చెల్లదంటూ దాఖలైన పరస్పర విరుద్ధ వ్యాజ్యాలపై ఈ నెల 26లోగా నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment