ఉపాధ్యాయుడి దుర్గేష్‌ను పట్టుకుని రోదిస్తున్న విద్యార్థినులు
సాక్షి, బెంగళూరు : అక్షరాభ్యాసం నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పాఠం చెప్పిన ప్రతి ఒక్కరూ మనకు గురువులే. పోటీ ప్రపచంలో ఉన్నస్థానానికి ఎదగాలంటే మన వెన్నంటి ఉండి తీర్చిదిద్ది ఉత్తమ పౌరునిగా ఎదగడానికి దోహదపడే శక్తియుక్తుల్ని నేర్పేవారే ఆచార్యులు. అటువంటి గురువు మరోచోటకి బదిలీపై వెళ్తుండటంపై అక్కడి విద్యార్థులు వెళ్లొద్దంటూ రోదించిన ఘటన ఇటీవల చిక్కమగళూరు కైమార ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలు... కైమార పాఠశాలలో దుర్గేశ్ అనే ఉపాధ్యాయుడు 12 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో దుర్గేశ్ సార్ అంటే ప్రతి ఒక్క విద్యార్థికి అభిమానం. వ్యక్తిగత శ్రద్ద, పాఠశాల అభివృద్ధి తదితర విషయాలు విద్యార్థులు, దుర్గేశ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో శనివారం దుర్గేశ్‌ను మరో చోటకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు బోరుమంటూ రోదించారు. మిమ్మల్ని వెళ్లనీయమని ఆయనను అడ్డుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థి రోదించారు. అవసరమైతే బీఈఓతోనే మాట్లాడుతామని, మీరు ఇక్కడే ఉండాల్సిందేనని పట్టుబట్టారు. వారి అభిమానం చూసి దుర్గేశ్ సైతం కళ్లనీరు పెట్టుకున్నారు.
బదిలీ విషయం గోప్యంగా దాచినా
ఉపాధ్యాయుడి బదిలీ విషయం గోప్యంగా ఉంచినా ఎలాగో విషయం తెలుసుకున్న విద్యార్థులు దుర్గేశ్‌ను చుట్టుముట్టి కన్నీరు మున్నీరయ్యారు. సార్ వెళ్లొద్దంటూ అంటూ విన్నవించారు. విద్యార్థులు చూపుతున్న అభిమానం చూసి ఉపాధ్యాయుడు సైతం తీవ్రంగా రోదించారు. ఈ దృశ్యాన్ని చూసిన సహచర ఉపాధ్యాయులు కూడా కంటనీరు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment