ప-పైరవీ... బ-బదిలీ | transfars to the local govt schools teachers | Sakshi
Sakshi News home page

ప-పైరవీ... బ-బదిలీ

Published Wed, Aug 13 2014 2:00 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM

ప-పైరవీ... బ-బదిలీ - Sakshi

ప-పైరవీ... బ-బదిలీ

స్థాన చలనం కోసం ఉపాధ్యాయుల అడ్డదారులు
అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ప్రయత్నాలు
మంత్రులతో సీఎం పేషీకి సిఫార్సులు కోరుకున్న చోటకు బదిలీ చేయిస్తే నజరానా
హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు గిరాకీ
జిల్లా కేంద్రంతో పాటు పట్టణ ప్రాంత పాఠశాలలపై కన్ను
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీ మార్గదర్శకాలను స్వయంగా ప్రభుత్వమే తుంగలో తొక్కితే....నిబంధనలను అమలు పరిచి, బదిలీలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలొంచితే...ఏమనాలి.. ఏంచేయాలి.. ప్రస్తుతం జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల విషయమై ఈ తరహా పరిస్థితు లే నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను దిగువస్థాయి టీచర్లకు ఉద్యోగోన్నతి కల్పించి భర్తీ చేయాల్సి ఉన్నా, అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమ బదిలీలకు తెర తీశారు.
     
ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రాతిపదికన వారు కోరుకున్న పాఠశాలకు బదిలీ చేసేందుకు ఏటా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ రాజకీయ పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంతో పాటు పట్టణ ప్రాంతాలకు నేరుగా బదిలీ పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి బదిలీ అవకాశం కల్పించాలని, ఒకే స్థానంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి ఏటా వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభానికి ముందుగా ఉపాధ్యాయ సాధారణ బదిలీల ప్రక్రియ చేపడుతున్నారు.
గత ఏడాది నిర్వహించిన బదిలీల అనంతరం తిరిగి ఇప్పటి వరకూ కౌన్సెలింగ్ జరగలేదు. అధికారికంగా బదిలీలు నిర్వహించని సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలతో సీఎం పేషీకి నేరుగా రికమండేషన్ చేయించుకుని బదిలీ పొందిన సంఘటనలు గతంలో ఉన్నాయి.
సమైక్యాంధ్ర ఉద్యమం, సార్వత్రిక ఎన్నికల కోలాహలం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు తదితర కారణాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది.

 బదిలీకి విశ్వ ప్రయత్నాలు
ప్రభుత్వం నుంచి నేరుగా బదిలీ పొందేందుకు ఉపాధ్యాయులు  ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రానికి చేరువలోని మండలాలు, పట్టణ ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న పోస్టులకు డిమాండ్ ఏర్పడింది.
వివిధ ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు 53, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు-50, ఎస్జీటీ పోస్టులు 600 వరకూ ఉన్నాయి.
వాస్తవానికి ఆయా పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే  కౌన్సెలింగ్ చేపడితే కీలక స్థానా లు భర్తీ అయ్యే అవకాశమున్న దృష్ట్యా దానికి ముందుగానే సీఎం పేషీ నుంచి నేరుగా బదిలీ పొందడం ద్వారా జిల్లా కేంద్రానికి దగ్గరలోని ప్రాంతాల్లోని పాఠశాలలు వెళ్లవచ్చనే ఆశతో ఉపాధ్యాయులు పైరవీలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేల ద్వారా మంత్రులకు చెప్పించి అక్కడి నుంచి సిఫార్సు లేఖలతో నేరుగా సీఎం పేషీకి వెళ్లేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు.
పెదపలకలూరు, ప్రత్తిపాడు, పెదకాకాని తదితర మం డలాల్లోని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులకు పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కోరుకున్న చోట కు బదిలీ చేయిస్తే నజరానా ముట్ట జెప్పేందుకు సైతం ఉపాధ్యాయులు వెనుకాడటం లేదని తెలుస్తోంది.

అర్హులైన వారికి అన్యాయం
నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వం చేపడుతున్న అక్రమ బదిలీల కారణంగా సంవత్సరాల తరబడి ఒకే స్థానంలో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement