సమయపాలన తూచ్‌ | Controversial spouse transfer | Sakshi
Sakshi News home page

సమయపాలన తూచ్‌

Published Wed, Jul 26 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

సమయపాలన తూచ్‌

సమయపాలన తూచ్‌

సీఎస్‌ఈ ఆకస్మిక నిర్ణయాలతో తప్పని అగచాట్లు
వివాదాస్పదంగా మారిన స్పౌజ్‌ బదిలీ
ఫిర్యాదు చేసిన ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుబాబు
 రాత్రిపూటా తప్పని కౌన్సెలింగ్‌ వెతలు


ఒంగోలు: ఉపాధ్యాయుల బదిలీల్లో సమయపాలనే లేదు. బదిలీ, రేషనలైజేషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన అనంతరం అనేక సవరణలు, జీఓలు ఇస్తూ బదిలీ ప్రక్రియే గందరగోళంగా మారింది. పాఠశాల విద్యాశాఖ తాజా నిర్ణయాలు సైతం ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. రాత్రిపూట కౌన్సెలింగ్‌ నిర్వహించడం ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది.  మంగళవారం మొత్తం మూడు సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. వారిలో మళ్లీ  ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పాఠశాలలు అంటూ విడివిడిగా ఉపా«ధ్యాయులకు కౌన్సెలింగ్‌ ఉంటుంది. దీని ప్రకారం ప్రతి యాజమాన్య పరిధిలోని స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిష్, స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటించారు.

అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం 34, గణితం 23, ఫిజికల్‌ డైరెక్టర్లు 17 స్థానాలు క్లియర్‌ వేకెన్సీలుగా చూపించారు. దీనికిగాను ఆంగ్లం 43, గణితం 38, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు 10 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఆంగ్లం 410, గణితం 509, ఫిజికల్‌ డైరెక్టర్‌ 100 పోస్టులు ఖాళీగా ఉండగా వాటికి ఆంగ్లం 483, గణితం 632, ఫిజికల్‌ డైరెక్టర్‌ 50 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 165 మంది, జిల్లా ప్రజాపరిషత్‌ యాజమాన్య పరిధిలో 2184 మంది వెరసి మొత్తంగా మంగళవారం బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 2349 మంది.  

ఆలస్యంగా ప్రారంభమైన కౌన్సెలింగ్‌
విద్యాశాఖ ప్రాథమికంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న పాత జిల్లా పరిషత్‌ సమావేశ మందిరాన్ని రెండు భాగాలుగా విభజించి వీఐపీ రెస్ట్‌ రూములో, సమావేశమందిరంలో రెండు చోట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఏకకాలంలో ప్రారంభించారు. దీంతో ప్రక్రియ వేగం పుంజుకుంటుందని అందరు భావించినా సీఎస్‌ఈ నుంచి అనుమతి రావడం, ఆ తరువాత స్థానికంగా ఏర్పడిన సర్వర్‌ సమస్యలు వెరసి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రక్రియ 12.30 గంటలకు ప్రారంభమైంది. కేవలం జిల్లా ప్రజాపరిషత్‌ ఆంగ్లం కౌన్సెలింగ్‌ సాయంత్రం 6 గంటల సమయానికి మరో 100 మందికి పైగా ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ జాబితాలో ఉండడం గమనార్హం. రెండో కౌన్సెలింగ్‌ సెక్షన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో అక్కడ జెడ్పీ పాఠశాలలకు సంబం«ధించి ఫిజికల్‌ డైరెక్టర్ల కౌన్సెలింగ్‌ కూడా ముగించారు. అయితే ఈ క్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్లకు సంబంధించిన అడ్‌హక్‌ ప్రక్రియను మాత్రం చివర్లో నిర్వహిద్దామంటూ సెక్షన్‌లో ఆంగ్లంకు సమాంతరంగా జెడ్పీ లెక్కలు కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో లెక్కలు, ఫిజికల్‌ డైరెక్టర్ల మొత్తం ప్రక్రియ పూర్తిచేసేందుకే విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడంతో రాత్రిపూట అగచాట్లకు తప్పని పరిస్థితులు   ఏర్పడ్డాయి.

ఉపాధ్యాయుల ఆందోళన ఇలా
ఇదిలా ఉంటే మంగళవారం భారీగా ఉపాధ్యాయులు హాజరుకావడంతో కనీసం ఆరుబయట కూర్చునేందుకు  కుర్చీలు లేని పరిస్థితి. ఇక టెంట్లు కూడా చాలకపోవడంతో మధ్యాహ్నం పూట ఇబ్బందులు తప్పలేదు. సమావేశ మందిరంలో 200 మంది వరకు కూర్చునేందుకు అవకాశం ఉందని, కనీసం వంద మంది చొప్పున కౌన్సెలింగ్‌కు పిలిచినా కనీసం వారన్నా నీడపట్టున ఉండే అవకాశం ఉందని, అలా కాకుండా కేవలం అయిదుగురు చొప్పున మాత్రమే పిలవడంతో ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ప్రతి మండలానికి కనీసం రెండు చొప్పున వేకెన్సీలను బ్లాక్‌చేశారు. ఇది సీఎస్‌ఈ నిర్ణయం ప్రకారమే జరిగినప్పటికి బ్లాక్‌ చేసిన పోస్టుల వివరాలను వెల్లడించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది.

వివాదాస్పదంగా మారిన బదిలీ
నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో జి.వెంకట్రావు అనే ఉపాధ్యాయుడు స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిష్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్పౌజ్‌ పాయింట్లు కోరుకున్నారు. అయితే ఆయన సతీమణి సంతనూతలపాడు మండలంలోని గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే ఈయన తన భార్యకు కూడా 8 సంవత్సరాల పీరియడ్‌ పూర్తయిందని, కనుక తాను జిల్లాలో ఎక్కడైనా కోరుకోవచ్చని పేర్కొంటూ నాగులుప్పలపాడు జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసుకున్నారు. దీంతో అతనికి ఆ స్థానాన్ని ఎలాట్‌ కూడా చేశారు. ఈ విషయం తెలియడంతో ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పౌజ్‌ పాయింట్లు వాడుకున్న వెంకట్రావు సతీమణికి 8 సంవత్సరాల సర్వీసు పూర్తయినా ఆమె పనిచేసేది జిల్లా విద్యాశాఖ పరిధికాదని, కనుక ఆ సర్వీసు ఎలా పరిగణనలోనికి తీసుకుంటారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను ప్రశ్నించారు.

అంతే కాకుండా ఆమెకు బదిలీ 8 సంవత్సరాలకే నిర్వహించాలనే నిబంధన కూడా లేదని, ఈ నేపథ్యంలో స్పౌజ్‌ కేటగిరీలో కోరుకున్నపుడు స్పౌజ్‌కు సమీపంలోని పాఠశాలలో కాకుండా సుదూరంగా ఉన్న మండలంలో పాఠశాలను ఎంపికచేయడం ఏమిటని పేర్కొన్నారు. ఇది పూర్తిగా స్పౌజ్‌ నిబంధనలకు విరుద్ధం అంటూ వాదించారు. దీంతో ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామని జెడ్పీ చైర్మన్‌ , కౌన్సెలింగ్‌ కమిటీ చైర్మన్‌ పేర్కొన్నారు. అయితే తాను కౌన్సెలింగ్‌కు ముందే ఈ ప్రక్రియ జరగబోతుందని తన దృష్టికి రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని పేర్కొనగా మరో ఫిర్యాదు తనకు ఇవ్వాలని జెడ్పీ చైర్మన్‌ సూచించారు. దీంతో ఆయన సూచన మేరకు మరో ఫిర్యాదును రాతపూర్వకంగా ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుబాబు జడ్పీ చైర్మన్‌కు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement