Union Minister Maneka Gandhi
-
అమ్మాయిలకు శుభవార్త!
న్యూఢిల్లీ: అమ్మాయిలకు శుభవార్త. వారి చదువులు మరింత నిర్విరామంగా సాగే రోజులు రానున్నాయి. ఆర్థిక భారంతో మధ్యలోనే చదువును ఆపేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే తక్కువ రేట్లకే విద్యకోసం అమ్మాయిలకు రుణాలు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీకి కూడా ఓ లేఖ పంపించారు. భేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కిందట వారికి ఈ రుణాలు అందేలా చూడాలని ఆమె కోరారు. 'తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యకోసం పంపిస్తున్నప్పుడు అమ్మాయిలకన్నా అబ్బాయిలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉన్నత విద్యకోసం ఖర్చులకు వెనుకాడి అమ్మాయిలను పంపించడం లేదు. రుణాల వడ్డీ రేట్లు కూడా అధికంగా ఉండటంతో అమ్మాయిల చదువుకోసం రుణాలు తీసుకునే ప్రయత్నం వారి తల్లిదండ్రులు చేయడం లేదు' అని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన అంగీకరిస్తే అమ్మాయిల చదువులకు ఏ ఢోకా లేదు. -
అక్క సోనియాను ఫాలో అయితే సరి!
చాన్నాళ్ల తర్వాత తన తోటికోడలు సోనియా గాంధీని పొగుడుతూ, అక్రమాలను అరికట్టే విషయంలో ఆమెను అనుసరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి మేనకా గాంధీ. నాడు దగ్గరిబంధువైన ఓ వ్యక్తి నుంచి తలనొప్పులు ఎదుర్కొన్న సోనియా ఏ విధంగా అతణ్ని కట్టడిచేశారో అధికారులకు వివరించిన మేనకా, అదే బాటలో నడవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆదివారం తన సొంత నియోజకవర్గం ఫిలిబిత్(యూపీ)లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో.. కొందరు ఐఏఎస్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నరని, లంచాలు తీసుకుని ప్రైవేటు స్కూళ్లకు ఇష్టారీతిగా అనుమతులు, గుర్తింపులు మంజూరుచేస్తున్న విషయాన్ని ఇతర అధికారులు మంత్రిగారి దృష్టికి తెచ్చారు. సదరు కరప్టెడ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకునే పవర్ తమకు లేనందున, మీరే ఏదో ఒకటి చెయ్యాలని మంత్రిని కోరారు. అప్పుడు మేనకాగాంధీ ఏం చెప్పారంటే.. 'అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు. నిజమే, మీరన్నట్లు ఐఏఎస్ లపై చర్యలు తీసుకునే అధికారం మనకు లేకపోవచ్చు. కానీ వాళ్ల ఆగడాలను కచ్చితంగా అడ్డుకోగలం. ఇందుకు సంబంధించి నేనొక ఉదాహరణ చెప్తా. మా అక్క సోనియా గాంధీ దగ్గరి బంధువు ఒకరు ఆ మధ్య ఓ షాప్ ప్రారంభించాడు. తెలిసినవాళ్లకు, తెలియని వాళ్లకు తాను సోనియా గాంధీ బంధువునంటూ బాజా వేసుకుని, తద్వారా లబ్ధి పొందాలని చూశాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కయ్య.. వెంటనే అతని చర్యలను ఖండిస్తూ పేపర్లలో ప్రకటనలిచ్చింది. దెబ్బకి అతని రోగం కుదిరింది. మీరు కూడా అదే మాదిరిగా అవినీతిని రూపుమాపేందుకు ప్రకటనలు ఇవ్వండి' అని. ఎలాంటి పనికైనా, ఎవ్వరికైనాసరే లంచం ఇవ్వొద్దని నోటీస్ బోర్డుల్లో రాయాడమేకాక అందరు అధికారుల ఆఫీసుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, తద్వారా అక్రమాలను అడ్డుకోగలమని మేనకా గాంధీ పేర్కొన్నారు. -
కుక్కలు కనిపిస్తే.. ఎగుమతేనట!
కేరళలో గ్రామ సింహాలకు భలే చిక్కొచ్చిపడింది. ఇకపై మొరిగినా, మొరగకపోయినా, ఎవరినీ కరవకపోయినా కూడా వీధుల్లో కనిపిస్తే చాలు.. వాటిని ఖైమా చేసే పనిలో పడ్డారు ఎర్నాకుళం జిల్లా గ్రామ పంచాయతీల వారు. మన మున్సిపాల్టీల వారు వీధికుక్కల్ని ఒకచోట పట్టుకుని మరోచోట విడిచిపెడుతుంటారు. కానీ కేరళ గ్రామ పంచాయతీల వారు మాత్రం వీటిని ఎగుమతి చేయాలని తీర్మానించారు! వీధికుక్కల్ని ఎగుమతి చేస్తే ఇటు సమస్య తప్పడంతో పాటు అటు ఆదాయమూ వస్తుందన్నది వీరి ప్లాన్. ఈశాన్య రాష్ట్రాలు, చైనా, కొరియా జనాలకు వీధికుక్కలను చూస్తేనే నోట్లో నీళ్లూరతాయట. అందుకే.. వీధికుక్కలను అక్కడికి ఎగుమతి చేస్తే పంట పండినట్లేనని వీరు చెబుతున్నారు. ఎర్నాకుళం జిల్లా సర్పంచుల సమావేశంలో ఎదక్తువయల్ గ్రామ సర్పంచ్ గురువారం దీనిపై ఓ తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వమూ ఆమోదిస్తే కోళ్ల పెంపకం మాదిరిగా.. కుక్కల పెంపకమూ జోరందుకుంటుందనీ ఆయన సెలవిచ్చారు. అన్నట్టూ.. 2014-15లో కేరళలో 1.06 లక్షల మందిని వీధికుక్కలు కరిచాయట! వీధికుక్కల దాడులు పెరుగుతుండటంతో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఇటీవల ఏకంగా అఖిలపక్ష భేటీనే నిర్వహించారు! కుక్కలకు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టడం, రేబిస్ సోకినవాటిని హతమార్చడం వంటివాటిపై సమగ్ర ప్రణాళిక గురించి చర్చించారు. ఏదేమైనా వీధికుక్కల సమస్యను ఇలా వదిలించుకోవ డమేంటని కేంద్ర మంత్రి మేనకా గాంధీ లాంటి జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.