అక్క సోనియాను ఫాలో అయితే సరి!
చాన్నాళ్ల తర్వాత తన తోటికోడలు సోనియా గాంధీని పొగుడుతూ, అక్రమాలను అరికట్టే విషయంలో ఆమెను అనుసరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి మేనకా గాంధీ. నాడు దగ్గరిబంధువైన ఓ వ్యక్తి నుంచి తలనొప్పులు ఎదుర్కొన్న సోనియా ఏ విధంగా అతణ్ని కట్టడిచేశారో అధికారులకు వివరించిన మేనకా, అదే బాటలో నడవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అసలేం జరిగిందంటే..
కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆదివారం తన సొంత నియోజకవర్గం ఫిలిబిత్(యూపీ)లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో.. కొందరు ఐఏఎస్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నరని, లంచాలు తీసుకుని ప్రైవేటు స్కూళ్లకు ఇష్టారీతిగా అనుమతులు, గుర్తింపులు మంజూరుచేస్తున్న విషయాన్ని ఇతర అధికారులు మంత్రిగారి దృష్టికి తెచ్చారు. సదరు కరప్టెడ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకునే పవర్ తమకు లేనందున, మీరే ఏదో ఒకటి చెయ్యాలని మంత్రిని కోరారు.
అప్పుడు మేనకాగాంధీ ఏం చెప్పారంటే.. 'అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు. నిజమే, మీరన్నట్లు ఐఏఎస్ లపై చర్యలు తీసుకునే అధికారం మనకు లేకపోవచ్చు. కానీ వాళ్ల ఆగడాలను కచ్చితంగా అడ్డుకోగలం. ఇందుకు సంబంధించి నేనొక ఉదాహరణ చెప్తా. మా అక్క సోనియా గాంధీ దగ్గరి బంధువు ఒకరు ఆ మధ్య ఓ షాప్ ప్రారంభించాడు. తెలిసినవాళ్లకు, తెలియని వాళ్లకు తాను సోనియా గాంధీ బంధువునంటూ బాజా వేసుకుని, తద్వారా లబ్ధి పొందాలని చూశాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కయ్య.. వెంటనే అతని చర్యలను ఖండిస్తూ పేపర్లలో ప్రకటనలిచ్చింది. దెబ్బకి అతని రోగం కుదిరింది. మీరు కూడా అదే మాదిరిగా అవినీతిని రూపుమాపేందుకు ప్రకటనలు ఇవ్వండి' అని. ఎలాంటి పనికైనా, ఎవ్వరికైనాసరే లంచం ఇవ్వొద్దని నోటీస్ బోర్డుల్లో రాయాడమేకాక అందరు అధికారుల ఆఫీసుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, తద్వారా అక్రమాలను అడ్డుకోగలమని మేనకా గాంధీ పేర్కొన్నారు.