కుక్కలు కనిపిస్తే.. ఎగుమతేనట!
కేరళలో గ్రామ సింహాలకు భలే చిక్కొచ్చిపడింది. ఇకపై మొరిగినా, మొరగకపోయినా, ఎవరినీ కరవకపోయినా కూడా వీధుల్లో కనిపిస్తే చాలు.. వాటిని ఖైమా చేసే పనిలో పడ్డారు ఎర్నాకుళం జిల్లా గ్రామ పంచాయతీల వారు. మన మున్సిపాల్టీల వారు వీధికుక్కల్ని ఒకచోట పట్టుకుని మరోచోట విడిచిపెడుతుంటారు. కానీ కేరళ గ్రామ పంచాయతీల వారు మాత్రం వీటిని ఎగుమతి చేయాలని తీర్మానించారు! వీధికుక్కల్ని ఎగుమతి చేస్తే ఇటు సమస్య తప్పడంతో పాటు అటు ఆదాయమూ వస్తుందన్నది వీరి ప్లాన్. ఈశాన్య రాష్ట్రాలు, చైనా, కొరియా జనాలకు వీధికుక్కలను చూస్తేనే నోట్లో నీళ్లూరతాయట.
అందుకే.. వీధికుక్కలను అక్కడికి ఎగుమతి చేస్తే పంట పండినట్లేనని వీరు చెబుతున్నారు. ఎర్నాకుళం జిల్లా సర్పంచుల సమావేశంలో ఎదక్‌తువయల్ గ్రామ సర్పంచ్ గురువారం దీనిపై ఓ తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వమూ ఆమోదిస్తే కోళ్ల పెంపకం మాదిరిగా.. కుక్కల పెంపకమూ జోరందుకుంటుందనీ ఆయన సెలవిచ్చారు. అన్నట్టూ.. 2014-15లో కేరళలో 1.06 లక్షల మందిని వీధికుక్కలు కరిచాయట!
వీధికుక్కల దాడులు పెరుగుతుండటంతో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఇటీవల ఏకంగా అఖిలపక్ష భేటీనే నిర్వహించారు! కుక్కలకు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టడం, రేబిస్ సోకినవాటిని హతమార్చడం వంటివాటిపై సమగ్ర ప్రణాళిక గురించి చర్చించారు. ఏదేమైనా వీధికుక్కల సమస్యను ఇలా వదిలించుకోవ డమేంటని కేంద్ర మంత్రి మేనకా గాంధీ లాంటి జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.