Animal lovers
-
National Animal Rights Day: జంతువులను ప్రేమిద్దాం..
మన కాలనీలో ఓ కుక్క కాలు విరిగి ఈడ్చుకుంటూ వెళుతుంటుంది... చూసి, పట్టనట్టు వెళ్లిపోతుంటాం. ఓ చిన్న సందులో పిల్లి ఇరుక్కుని గిలగిల్లాడుతుంటుంది ... దానిని కాపాడటం మన పని కాదులే అని తప్పుకుంటాం. వాటికి ఆకలేసినా, ప్రమాదాలు జరిగినా మనసున్న మనుషులుగా మనమెంతవరకు పట్టించుకుంటున్నాం? మనతో పాటు మూగజీవాలకూ బతికే హక్కు ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిది అని అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న జంతుప్రేమికులు సాయిశ్రీ, పంచ్, శారద, డాక్టర్ కృష్ణప్రియ. ప్రజలలో మూగ జీవాల పట్ల అవగాహన కలిగించేందుకు, సురక్షితంగా ఉంచేందుకు నార్డ్ గ్లోబల్ ఆర్గనైజేషన్‌తో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేషనల్ యానిమల్ రైట్స్ డే సందర్భంగా జంతు ప్రేమికులు చెబుతున్న విషయాలు. స్కూల్, కాలేజీలకు వెళ్లి.. జంతువులకు కూడా జీవించే హక్కు ఉంది అని చెప్పడానికి నార్డ్ అనే సంస్థ అంతర్జాతీయంగా వర్క్ చేస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్‌తో కలిసి వర్క్ చేస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. మూడేళ్లుగా యానిమల్ సేవలో పాల్గొంటున్నాను. మనిషి కారణంగా ఏ జంతువూ బాధపడకూడదు. ఎవరూ వాటిని హింసించకూడదు. నేను ఒక స్ట్రీట్ డాగ్‌ను దత్తత తీసుకున్నా. అప్పటి నుంచి నాకు ఈ సేవ పట్ల ఆసక్తి పెరిగింది. స్కూల్, కాలేజీలకు వెళ్లి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాం. జంతు ఆధారిత ఉత్పత్తులను ఏవీ ఉపయోగించం. – పంచ్, యానిమల్ యాక్టివిస్ట్, సైనిక్‌పురి పూర్తి సమయం కేటాయింపు.. మన వీధిలో ఒక కుక్క ఉందంటే అది ఆ కాలనీవారందరి బాధ్యతగా ఉండాలి. దానికి ఏదైనా దెబ్బ తగిలినా, తిండి లేకుండా పడి ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అలాంటి కుక్కలు, పిల్లలు, గోవులు... వీధుల్లో తిరిగేవాటిని తీసుకొచ్చి, సేవ చేస్తాం. వీధుల్లో ఉండే కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయిస్తాం. ఐదేళ్లయ్యింది ఈ వర్క్ చేయబట్టి. ఎనిమిదేళ్ల క్రితం మా ఫ్రెండ్ అక్కవాళ్ల దగ్గర నుంచి ఒక కుక్కను తీసుకున్నాను. స్ట్రీట్ డాగ్స్‌కు దెబ్బలు తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేసేదాన్ని, చేయించేదాన్ని. ఆ తర్వాత షెల్టర్ స్టార్ట్ చేశాను. దీనికి మరొక ఫౌండర్ జత కలవడంతో ఇప్పుడు ఇక్కడ రెండు వందల వరకు యానిమల్స్ ఉన్నాయి. గోవులు ఆరున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేల స్ట్రీట్ యానిమల్స్‌కి సేవలందించాను. నేషనల్ బాక్సర్‌గా ఉన్న నేను ఈ వైపుగా ఆసక్తి పెరగడంతో పూర్తి సమయాన్ని జంతువుల సేవకే కేటాయిస్తున్నాను. వీగన్ పదార్థాల తయారీ, ప్రొడక్ట్స్ బిజినెస్ కూడా చేస్తుంటాను. వీటి వల్ల వచ్చే ఆదాయంలో 15 శాతం జంతు సేవలకే ఉపయోగిస్తుంటాను. – సాయి శ్రీ, బోరంపేట్, దుండిగల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది.. మా అపార్ట్మెంట్ దగ్గర 20 కుక్కలను సేవ్ చేసి, వాటికి షెల్టర్ ఏర్పాటు చేశాను. ఇందుకు చాలా మందితో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుక్కలకు ఆహారం పెడుతుంటే, పై నుంచి బాటిల్స్ వేసినవారున్నారు. అవే కుక్కల మీద పడితే, వాటికి ఎంత ప్రమాదం జరిగేదో అస్సలు ఆలోచించరు. న్యూసెన్స్ అవుతుందని కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. యానిమల్ రైట్స్ గురించి చెప్పినప్పుడు, అందరూ తగ్గారు. మొదట్లో స్ట్రీట్ డాగ్‌ని దత్తత తీసుకొని, పెంచేదాన్ని. ఆ తర్వాత ఆ కాలనీలో తిరుగుతున్నవాటిని రెస్క్యూ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్ షెల్టర్‌కి పంపిస్తుంటాను. – శారద, యానిమల్ యాక్టివిస్ట్, ప్రగతినగర్ బ్లడ్ అవసరమైతే.. నేను డెంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. అలాగే, అవసరమైన డాగ్స్‌కి బ్లడ్ అందేలా చూస్తుంటాను. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ల కుక్కకు ప్రమాదం జరిగి, బ్లడ్ అవసరమైంది. ఆ సమయంలో మరో కుక్క నుంచి బ్లడ్ తీసి, మ్యాచ్ చేసి ప్రమాదం నుంచి గట్టెక్కించారు. అప్పటి నుంచి కుక్కలకు కూడా బ్లడ్ అవసరం అని భావించి, రికార్డ్ చేస్తున్నాను. ఇందుకు సంబంధించి వెటర్నరీ డాక్టర్స్‌ని, వారి ద్వారా అవసరమైన కుక్కలకు మరో పెట్ పేరెంట్ ద్వారా బ్లడ్ అందేలా చూస్తుంటాను. – డాక్టర్ కృష్ణప్రియ, మలక్‌పేట – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం ఆమోదిస్తే.. త్వరలో
జంతు ప్రేమికులకు ఊరట కల్పించేలా కేంద్రం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంపుడు జంతువులను రైలు ప్రయాణంలో వెంట తీసుకెళ్లేందుకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వెసలు బాటు కల్పించనుంది. ఇందుకోసం టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రైలు ప్రయాణంలో జర్నీ చేయాల్సి వస్తే మూగ జీవాలతో ఇబ్బందే. ఈ సమస్యను నివారించేందుకు రైల్వే శాఖ సరికొత్త విధానంతో ముందుకొస్తోంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ పెంపుడు జంతువులకు కూడా టికెట్లను అమ్మనుంది. చదవండి👉 ఫోన్లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ ‘యాప్’ వాడితే ఇక అంతే సంగతులు ప్రస్తుతం, ప్రయాణికులు పెంపుడు జంతువుల్ని వెంట తీసుకొని వెళ్లాలంటే ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లు, క్యాబిన్లు లేదా కూపేలను బుక్ చేసుకోవాలి. ఇందు కోసం ప్రయాణం రోజున ప్లాట్‌ఫామ్‌లోని పార్శిల్ బుకింగ్ కౌంటర్లను సంప్రదించి టికెట్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది. అనంతరం, ప్రయాణికులు తమ పెంపుడు జంతువులను బాక్స్‌లలో ఉంచి ట్రైన్లలోని సెకండ్ క్లాస్ లగేజీ, బ్రేక్ వ్యాన్లలో తీసుకొని వెళ్తున్నారు. ఈ విధానం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేలా ఐఆర్సీటీసీ వెబ్సైట్లలో జంతువులకు టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ట్రైన్లలో జంతువులకు టికెట్లను బుక్ చేసే అధికారాన్ని టీటీఈలకు ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో జంతువులను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని రైల్వే బోర్డు cris (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్)ని కోరినట్లు ది స్టేట్స్‌మన్ నివేదిక వెల్లడించింది. గార్డు కోసం కేటాయించిన ఎస్ఎల్ఆర్ కోచ్‌లో జంతువులను ఉంచుతారు. జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులకు రైలు స్టాపేజ్‌లలో నీరు, ఆహారం మొదలైనవాటిని అందించవచ్చు. అయితే ఆన్లైన్లో జంతువుల టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కొన్ని షరతులు విధించనుంది. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి. 👉ప్రయాణికుల టిక్కెట్ తప్పనిసరిగా ధృవీకరించాలి 👉ప్రయాణికుడు టిక్కెట్‌ను రద్దు చేస్తే, జంతువులకు బుక్ చేసిన టిక్కెట్ వాపసు ఇవ్వబడదు. 👉ట్రైన్ రద్దయినా లేదా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, మూగజీవాల కోసం బుక్ చేసుకున్న టికెట్ రుసుము తిరిగి పొందలేరు. ప్రయాణీకుల టిక్కెట్ మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది. 👉గుర్రాలు, ఆవులు, గేదెలు మొదలైన పెద్ద పెద్ద పెంపుడు జంతువులను గూడ్స్ రైళ్లలో బుక్ చేసి రవాణా చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. 👉ప్రయాణంలో మూగజీవాలకు సంరక్షణకు ఒక వ్యక్తి ఉండాలి. 👉జంతువులకు ఏదైనా నష్టం జరిగితే యజమాని బాధ్యత వహిస్తాడు. వాటికి రైల్వేశాఖ బాధ్యత వహించదు. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
రుస్తుమా ఎగిరిపోయింది.. కనిపెట్టిన వారికి రూ.50వేల నజరానా
బెంగళూరు: ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎగిరిపోయిందని బాధపడుతోంది కర్ణాటక తుమకూరుకు చెందిన ఓ కుటుంబం. ఇంట్లో ఓ కుటుంబసభ్యుడిగా ఉన్న చిలుకను బాగా మిస్ అవుతున్నట్లు చెబుతోంది. దాని ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటన కూడా ఇచ్చారు కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను తుమకూరు వ్యాప్తంగా అతికించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'మా చిలుక కన్పించడం లేదు. దానికి మాకు చాలా అనుబంధం ఉంది. మీకు ఎక్కడైనా కన్పిస్తే చెప్పండి. రూ.50 వేలు ఇస్తాం. మీ ఇంటి బాల్కనీ, కిటీకీలు వెతకండి' అని చిలుక యజమానులు పల్లవి, అర్జున్ ప్రకటనలో తెలిపారు. #Karnataka Family Announces Rs 50K Reward For Finding Missing #Parrot #Trending #Viralvideo #India pic.twitter.com/cTVRLVjlKZ — IndiaObservers (@IndiaObservers) July 19, 2022 వీరిది జంతు ప్రేమికుల కుటుంబం. కొన్నేళ్లుగా ఆఫ్రికాకు చెందిన రెండు చిలుకలను పెంచుకుంటున్నారు. అయితే అందులో ఒకటి శనివారం నుంచి కన్పించడం లేదు. దాని పేరు రుస్తుమా. అది ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని వీళ్లు భావిస్తున్నారు. రెండున్నరేళ్లకుపైగా ఈ చిలుక వీళ్లతో ఉంది. రెండుసార్లు దానికి ఘనంగా పుట్టినరోజు వేడుక కూడా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
'చిరుత పులి' రోజుకొకటి బలి!
సాక్షి, హైదరాబాద్: అంతరించడంలో చిరుతదే వేగం. పులుల కంటే వేగంగా అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వన్యప్రాణుల్లో చిరుతపులి ముందు వరసలో ఉందని జంతుప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లోనే ఎక్కువగా చిరుతపులులు మరణించాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 218 చిరుతలు మరణించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న మనిషి, మృగం సంఘర్షణ అడవులు, పచ్చదనం తగ్గిపోతూ పట్టణీకరణ విస్తరించడంతో మనుషులు–జంతువుల మధ్య సంఘర్షణ పెరుగుతోంది. జంతువులు ముఖ్యంగా చిరుతపులులు వంటివి ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి, నివాస ప్రాంతాల్లోకి వస్తుండటంతో వాటిపై దాడులు పెరుగుతున్నాయి. వేట, గ్రామస్తుల దాడులతోపాటు బావుల్లో పడి, విద్యుత్ షాక్, రైలు,రోడ్డు ప్రమాదాలకు గురై చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఒక చిరుతపులి చనిపోతున్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2018లో అత్యధికంగా 460 చిరుతలు ప్రాణాలు కోల్పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో.. 2014లో రాష్ట్ర విభజనకు పూర్వం ఉమ్మడి ఏపీలో పులుల ఆవాసప్రాంతాలు, అభయారణ్యాల్లో 345 చిరుత పులులున్నట్టుగా అంచనా. పులుల మాదిరిగా దట్టమైన అడవులు, ఆహారం, నీటికి అనువైన ప్రాంతాలు, విశాలమైన పరిసరాలకే చిరుతపులులు పరిమితం కావు. అడవుల బయట అనువైన ప్రాంతాల్లో కూడా సులభంగా ఇవి జీవించగలుగుతాయి. ఈ లక్షణాలను బట్టి ఉమ్మడి ఏపీలో అడవుల బయట 250కు తక్కువ కాకుండా చిరుతలు ఉన్నాయని పర్యావరణవేత్తల అంచనా. అయితే, 2018 నాటికి ఏపీలో 300 నుంచి 350 వరకు, తెలంగాణలో 100 నుంచి 150 వరకు చిరుతపులులుంటాయని భావిస్తున్నారు. 2014లో దేశవ్యాప్తంగా పులుల ఆవాస ప్రాంతాల్లో చిరుతల సంచారానికి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ సేకరించిన వివరాల ప్రకారం మొత్తం 7,872 చిరుతపులులు ఉన్నట్టు అంచనా.. అన్ని రకాలుగా కలుపుకుంటే.. మొత్తంగా 15 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. 2018కు సంబంధించి పులుల గణణ వివరాలను అధికారికంగా ప్రకటించారు. చిరుతల సంఖ్యను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా, పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్న విధంగానే...రాజస్తాన్‌లో మాదిరిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిరుతల కోసం ప్రత్యేకంగా ‘ప్రాజెక్ట్ లెపర్డ్’ను ప్రారంభించాలని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధి ఇమ్రాన్ సిద్ధిఖీ కోరుతున్నారు. -
కుక్కలకూ కావాలొక ‘శ్రీమంతుడు’
నగరంలో వీధి కుక్కల దత్తత.. దేశంలోనే తొలిసారి సాక్షి, హైదరాబాద్: దత్తత కాన్సెప్టు ఇప్పుడు వీధి కుక్కల వరకూ చేరింది. వీధి కుక్కల బెడదను నివారించేందుకు దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ మహానగరంలో ‘వీధి కుక్కల దత్తత’అనే వినూత్న కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఆదివారం నార్త్‌జోన్‌లో ‘స్ట్రీట్ డాగ్స్ అడాప్షన్’కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. తొలిరోజు ఐదు కుక్కపిల్లలను జంతు ప్రేమికులు దత్తత తీసుకున్నారు. దత్తత ద్వారా వీధికుక్కల నియంత్రణకు మార్గం లభిస్తుందని బల్దియా భావిస్తోంది. మహానగరం పరిధిలో ప్రస్తుతం ఆరు లక్షల వీధికుక్కలు ఉన్నాయి. వీటిలో ఒక లక్ష కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలో ఉన్న వీధికుక్కలకు రేబిస్ నిరోధక టీకాలతోపాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నా, నగర శివార్లలోని గ్రామాలు, పట్టణాలలో ఈ విధమైన పద్ధతి లేనందున అక్కడి వీధికుక్కల సమస్య జీహెచ్ఎంసీకి తలనొప్పిగా తయారైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదివారం అడిషనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ వెటర్నరీ అధికారి వెంకటేశ్వరరెడ్డి, ఇతర వెటర్నరీ అధికారులతో సమావేశమై వీధి కుక్కల దత్తతపై చర్చించారు. దత్తతపై అవగాహన దత్తతపై స్వచ్ఛంద సంస్థలకు, జంతు ప్రేమికులకు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దత్తత తీసుకున్న కుక్కపిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, అవసరమైన వైద్య చికిత్సలను తామే చేపడతామని బల్దియా వెటర్నరీ అధికారులు భరోసా ఇస్తున్నారు. రెండు రోజులక్రితం నార్త్ జోన్ పరిధిలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు 20 మందికిపైగా స్వచ్ఛంద సంస్థల, జంతు ప్రేమికుల సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వీధికుక్కలను దత్తత తీసుకునేవారు స్థానిక జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులను సంప్రదించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జంతు ప్రేమికులకు సూచించారు. -
ఆటవిడుపా.. ఆటవికమా..
► సంప్రదాయం పేరుతో మనుషుల జంతుక్రీడలు! ► ప్రపంచ దేశాలన్నిటా కొనసాగుతున్న జంతుహింస ► కీటకాల నుంచి తిమింగలాల వరకూ జీవాలన్నీ బలి (సాక్షి నాలెడ్జ్ సెంటర్) సంప్రదాయం.. ఆటవిడుపు.. పేరేదైనా మనిషి తన ఆనందం కోసం జంతువుల మధ్య బలవంతపు పోరాటాలు నిర్వహించడం శతాబ్దాలుగా కొనసాగుతోంది. జంతువులను స్వయంగా సామూహికంగా హింసించే ఆటవిక క్రీడలూ ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. మనకు సంక్రాంతి వచ్చిందంటే కోళ్ల పందేలు, జల్లికట్టు నిర్వహణ మీద ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. జంతు ప్రేమికులు ఎంతగా అభ్యంతరం వ్యక్తంచేసినా.. చట్టాలు ఏం చెప్తున్నా, కోర్టులు ఏ ఆదేశాలు ఇచ్చినా సదరు ‘క్రీడా ప్రేమికులు’, ‘సంప్రదాయవాదులు’ ఆయా హింసాత్మక క్రీడల నిర్వహణకే మొగ్గుచూపుతున్నారు. ఇది ఒక్క మన రాష్ట్రానికో, మన దేశానికో పరిమితం కాదు. ప్రపంచమంతటా ఈ ఆటవిక క్రీడలు సంప్రదాయం రూపంలో కొనసాగుతున్నాయి. చాలా చోట్ల అది నిత్య జూదంగా కూడా అభివృద్ధి చెందింది. అందులో కొన్ని ముఖ్యమైన హింసాత్మక జంతుక్రీడలు... కోళ్ల పందెం: కోడి పుంజుల మధ్య నిర్వహించే పోటీ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంప్రదాయ క్రీడకు చాలా ప్రాచుర్యం ఉంది. ఇండియాలోనే కాకుండా.. చైనా, జపాన్, ఇరాక్, పాకిస్తాన్, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి చాలా దేశాల్లో కోళ్ల పందేలు శతాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. గుర్రపు పందెం: మనకు తెలిసి గుర్రపు పందెం అంటే పరుగు పోటీ మాత్రమే. కానీ.. కొన్ని దేశాల్లో మగ గుర్రాల మధ్య పోరాటం నిర్వహిస్తుంటారు. చాలా పోటీల్లో ఏదో ఒక గుర్రం చనిపోయే వరకూ పొటీ కొనసాగుతుంది. చైనాలోని మియావో ప్రజలు ఫిలిప్పీన్స్ దీవి మిండానావోలో ఈ గుర్రపు పందేలు నిర్వహించడం వందల ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, ఇండొనేసియా, ఐస్ ల్యాండ్లలో కూడా ఈ పోటీలు నిర్వహిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఒంటెల పందెం: ఇది కూడా పరుగు పందెం కాదు. ఒంటెల మధ్య పోరాటం. టర్కీలో నవంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో దించే ఒంటెలను ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లలో ప్రత్యేకంగా ఉత్పత్తి చేసి పెంచుతారు. మధ్య ఆసియా, దక్షిణాసియాల్లోని మరికొన్ని దేశాల్లోనూ ఈ ఒంటెల పోటీలు జరుగుతుంటాయి. కుక్కల పందెం: మన కోళ్ల పందెం తరహాలోనే కుక్కల మధ్య జరిపే పోరాటం. చైనా, జపాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో ఈ క్రీడకు ఎక్కువ ఆదరణ ఉంది. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో పాటు పలు ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో కూడా రహస్యంగా డాగ్ ఫైట్ క్లబ్‌లు నిర్వహిస్తుంటారు. కొన్ని రకాల జాతి కుక్కలను ప్రత్యేకంగా పెంచి శిక్షణనిస్తుంటారు. చాలా పోటీల్లో ప్రత్యర్థి కుక్క చనిపోయే వరకూ పోరాటం కొనసాగుతుంది. దున్నల పందెం: ఎడ్ల పోటీలు మన తెలుగు వాళ్లకు తెలుసు. అందులో ఎడ్ల బలాల ప్రదర్శన జరుగుతుంది. ఇక జల్లికట్టు, బుల్ ఫైట్ పోటీల్లో ఎడ్లు, దున్నలతో మనుషులు పోరాడతారు. కానీ.. అస్సాంలో సంక్రాంతి పండగకు కోళ్ల పందెం తరహాలో దున్నల మధ్య పోరాటంతో పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రీడను కూడా సుప్రీంకోర్టు నిషిద్ధ ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ నిర్వహిస్తున్నారు. పొట్టేళ్ల పందెం: మన దేశంలో పొట్టేళ్ల పందెం కూడా నిన్న మొన్నటి వరకూ నిర్వహించిన విషయం తెలిసిందే. నైజీరియా, ఉజ్బెకిస్తాన్, ఇండొనేసియా వంటి దేశాలు ఈ పొట్టేళ్ల పందేలకు పేరుగాంచాయి. ఈ పందెం కోసం కొన్ని పొట్టేళ్లను ప్రత్యేకంగా ఉత్పత్తి చేసి పెంచుతుంటారు. బుల్ బుల్ పందెం: అస్సాంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగే మరో పక్షుల పందెం ఇది. బుల్ బుల్ పిట్టల మధ్య పోరాటం నిర్వహించి ఆనందించడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ పోటీల నిర్వహణను నిషేధించే అంశంపైనా ఎప్పుడూ పండుగ సమయాల్లోనే చర్చ వస్తుంటుంది. బుల్ ఫైటింగ్: ఎద్దులు, దున్నలతో మనుషులు చేసే పోరాట క్రీడ. తమిళనాడులో జల్లికట్టు పేరుతో జరుగుతుంది. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, వెనిజువెలా, పెరూ తదితర దేశాల్లో ఈ క్రీడను నిర్వహిస్తున్నారు. చాలా దేశాల్లో ప్రత్యేకంగా పెంచే కొన్ని జాతుల ఎడ్లు, దున్నలను ఈ క్రీడకు ఉపయోగిస్తారు. డాల్ఫిన్ల వేట: డెన్మార్క్ లోని ఫెరో దీవి సముద్ర తీరం రక్తంతో నిండిపోతుంది. ఆ దీవిలో యువక్తవయసుకు వచ్చిన యువతీయువకులు ఆ విషయాన్ని ప్రకటించడానికి వందలాది కాల్డెరాన్ డాల్ఫిన్లను వేటాడి హతమారుస్తారు. ఏటా సగటున 838 పైలట్ తిమింగలాలు, 75 డాల్ఫిన్లను చంపేస్తారు. పవర్ బోట్లలో సముద్రంపైకి వెళ్లి ఈ తిమింగలాలు, డాల్ఫిన్లను ఒడ్డుకు తరుముకువచ్చి కర్కశంకా నరికి చంపుతారు. గత 300 ఏళ్లుగా సాగుతున్న ఈ సంప్రదాయంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాతు లాగుడు పోటీ: నేలకు కొన్ని అడుగుల ఎత్తున ఒక తాడుకు బాతును తలకిందులుగా వేలాడదీస్తారు. గుర్రం స్వారీ చేసుకుంటూ వచ్చి ఆ బాతు మొడను పట్టుకుని తల తెంచుకెళ్లాలి. ఈ పని విజయవంతంగా చేసిన వ్యక్తి హీరో. యూరప్ లోని నెదర్లాండ్స్, బెల్జియం, ఇంగ్లండ్‌లతో పాటు అమెరికాలోనూ ఈ క్రీడను నిర్వహిస్తుంటారు. గాడిదపై మూకుమ్మడి దాడి: స్పెయిన్‌లో పెరో పాలో పండగ పేరుతో జరిగే మరొక సంప్రదాయ క్రీడ ఇది. చాలా ఏళ్ల కిందట ఒక రేపిస్టును పట్టుకున్న ఘట్టానికి ప్రతీకగా ఈ క్రీడను కొనసాగిస్తున్నారు. మద్యం మత్తులోని మగాళ్ల గుంపు ఒక గాడిదపై దాడి చేసి, దానిని సామూహికంగా అన్ని రకాలుగా హింసిస్తూ, నగరంలోని విధుల వెంట ఈడ్చుకెళ్లే క్రీడ ఇది. గాడిద పడిపోయినా దాన్ని మళ్లీ మళ్లీ నిల్చోబెట్టి హింసిస్తూ, దాని గొంతులోనూ మద్యం పోస్తూ ఈ క్రీడను కొనసాగిస్తారు. చివరికి ఆ గాడిద చనిపోతుంది. చేపల పందెం: కోళ్ల పందెం లాగానే కొన్ని రకాల చేపల మధ్య పోరాటం నిర్వహించడం మరొక సంప్రదాయ క్రీడ. నీటి తొట్టెలు, గాజు జాడీలు, మట్టి తొట్టెలు వంటి వాటిల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఇండొనేసియా, వియత్నాం, మయన్మార్, కంబోడియా, లావో వంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఈ పోటీలు జరుగుతుంటాయి. కుక్కలను చెట్టుకు వేలాడదీసి: స్పెయిన్‌లో వేట కోసం ఉపయోగించే స్పానిష్ గ్రౌండ్ జాతి కుక్కలు గాల్గో. వేట సీజన్ ముగిసిన తర్వాత వేటగాళ్లు తమ కుక్కలను చంపేయటం ఆనవాయితీ. ఎందుకంటే మిగతా సీజన్లో ఆ కుక్కలను అనవసరంగా పోషించటం వారికి ఇష్టం లేదు. ఈ కుక్కలను చెట్లకు వేలాడదీసి, పాడుబడ్డ బావుల్లో వేసే చంపే ఆ ఆనవాయితీ ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ఎద్దును హింసిస్తూ..: దక్షిణాఫ్రికాలో ఉక్వేష్వామా అనే పండుగ జరుగుతుంది. ఒక ఎద్దు నాలుక కోసివేసి, నోట్లో మట్టి కుక్కుతూ, దాని కళ్లు పీకివేసి, వృషణాలు ధ్వంసం చేస్తూ ఈ క్రీడ సాగుతుంది. కానీ.. దేశ ‘సాంస్కృతిక స్వాతంత్య్రం’ పేరుతో ఈ క్రీడకు జంతు చట్టాల నుంచి మినహాయింపునిచ్చారు. సముద్రంలోకి తరిమేసి: బ్రెజిల్లో ఫార్రా డె బొయి అనే పండుగ జరుగుతుంది. కొన్ని ఎడ్లను వెంటాడుతూ అవి చనిపోయే వరకూ హింసించడం ఈ క్రీడ. వాటిని సముద్రం వైపుగా తరుముకెళ్తారు. మనుషుల హింసతో బెంబేలెత్తిన ఆ ఎడ్లు వడ్డుకు రావడానికి భయపడి నీళ్లలో మునిగి చనిపోతాయి. కీచురాళ్ల పందెం: మంగ కీచురాళ్ల (క్రికెట్) మధ్య పోరాటం నిర్వహించడం చైనాలో సంప్రదాయ క్రీడ. కీటకాల బరువు, జాతి ప్రాతిపదికన ఈ పోటీ జరుపుతారు. ఒక గిన్నెలో కీచురాళ్లను ఉంచి వాటి మీసాలను కదిలించి రెచ్చగొట్టడం ద్వారా పోటీ నిర్వహిస్తారు. పేడపురుగుల పందెం: జపాన్, థాయ్‌లాండ్‌లలో రైనో జాతి పేడపురుగుల (బీటిల్) మధ్య పోటీ నిర్వహించి ఆనందిస్తుంటారు. స్పైడర్ల పందెం: ఫిలిప్పీన్స్, జపాన్, సింగపూర్‌వంటి దేశాల్లో సాలిపురుగుల (స్పైడర్) మధ్య పోటీలు నిర్వహిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆడ సాలీళ్లు, మరికొన్ని దేశాల్లో మగ సాలీళ్ల మధ్య పోరాటం నిర్వహిస్తారు. -
అదీ పాయింటే.. ఇదీ పాయింటే!
ఈ ఏనుగు పేరు మారా. అర్జెంటీనాలోని ఒక జూలో దప్పికతో నీళ్లు తాగుతోంది. దీంతో పాటు అదే జూలో మరో రెండు ఏనుగులున్నాయి. ఇటీవల అక్కడి కోర్టు జంతు ప్రేమికులు వేసిన వాజ్యంలో ఈ మూడు ఏనుగులను ఇంకొన్ని సౌకర్యాలతో చూసుకోవాలని జూ అధికారులకు ఆదేశించింది. అయితే వీటి తరఫున వాదిస్తున్న న్యాయవాది అసలు సహజమైన అడవుల్లో తిరగాల్సిన ఏనుగులు జూలో బందీ కావడం ఏంటని వెంటనే వాటిని స్వేచ్ఛగా వదిలిపెట్టాలని వాదనలు వినిపించాడు. దీనికి జూ అధికారులు జవాబిస్తూ ‘అయ్యా! అవి జూలోనే పుట్టాయి. ఇక్కడే పెరిగాయి. వీటికి అడవిలో ఉండే పరిస్థితులు తెలియవు. స్వేచ్ఛ ప్రసాదిస్తే చచ్చూరుకుంటాయి’ అని అన్నారు. అదీ పాయింటే... ఇదీ పాయింటే గనుక న్యాయమూర్తి తల పట్టుకున్నాడు. -
సెల్ఫీ పిచ్చితో డాల్ఫిన్‌ను చంపేశారు..
బ్యూనస్ ఎయిర్స్: విభిన్న రీతుల్లో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి హిట్స్, లైక్స్ పొందడం ఓ వ్యసనంగా మారింది. ఇది ఎంతలా అంటే సెల్ఫీల మోజులో తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాదు.. ఇతర జీవుల ప్రాణాలను సైతం తీస్తున్నారు. అర్జెంటీనాలో సెల్ఫీ తీసుకోవడానికి పోటీ పడి ఓ డాల్ఫిన్‌ను చంపేశారు. సముద్రతీర పట్టణమైన సాంటా టెరిసిటాలో బీచ్‌లో సేదతీరుతున్న వారికి ఓ బేబీ డాల్ఫిన్ కనిపించింది. అదీ అరుదైన జాతికి చెందిన లాప్లాటా డాల్ఫిన్. అంతే.. అక్కడున్న వారు దానిని నీటిలోకి వదలాలనే కనీస విషయాన్నే మరచిపోయి దానితో పోటీలు పడి సెల్ఫీలు దిగారు. ఒకరి చేతిలో నుండి ఇంకొకరు తీసుకుంటూ దానిని బయటే ఉంచారు. దీంతో ఆ డాల్ఫిన్ మృతి చెందింది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో చూసిన జంతుప్రేమికులు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. లాప్లాటా డాల్ఫిన్లు ప్రపంచ వ్యాప్తంగా 30,000 మాత్రమే ఉన్నాయి. ఇవి అర్జెంటీనా, ఉరుగ్వే, బ్రెజిల్ తీరాల్లో మాత్రమే కనిపించే అరుదైన రకానికి చెందినవి. ఇప్పటికే వీటిని అంతరించి పోతున్న జీవుల జాబితాలో అత్యంత ప్రమాదకరమైన దశలో ఉన్నట్లుగా రెడ్ లిస్ట్‌లో చేర్చారు. అర్జెంటీనా వైల్డ్‌లైఫ్ ఫౌడేషన్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి డాల్ఫిన్లు కనిపిస్తే వాటిని వెంటనే నీటిలోకి వదలాలని ఓ ప్రకటనను విడుదల చేసింది. -
బెట్టు చేస్తున్న కోడి
సమాజం కోరుకోవడం లేదు. జంతు ప్రేమికులు కోరుకోవడం లేదు. చట్టాలు కోరుకోవడం లేదు. ఆఖరకు కోళ్లు కూడా మాకొద్దు మొర్రో అని బెట్టు చేస్తున్నాయి. కాని బెట్టు కోసం వీటి బెట్టును తీసి గట్టున పెడుతున్నారు. ‘కూస్తే అలారం... కోస్తే పలారం’ అని కోడి గురించి చమత్కరించాడో నానుడికారుడు. నిజమే. అలారం లేని రోజుల్లో కోడి కూతతోనే సుప్రభాతం అయ్యేది. కోడి లేపితేనే ఊరంతా లేచింది. తెలీని రోజుల్లో ఆదిమానవులు కొండ దేవరతో పాటు కోడి దేవరకు కూడా దండం పెట్టుకునేవారు. అయితే క్రమక్రమంగా భ్రమలు తొలగిపోయాయి. ‘తాను కూయకపోతే తెల్లారదు’ అని బెట్టు చేసినా సూరయ్య సరాసరా అని పైకొచ్చేసేవాడు. ఇంకేముంది? కోడి కూరైపోయింది. కోరిన దేవతకు మొక్కయ్యింది. దిష్టి దింపే పక్షి అయ్యింది. బంధువులకు మర్యాద అయ్యింది. పందెం వేస్తే ప్రాణం ఇచ్చే ప్రాణి అయ్యింది. ఆరువేల ఏళ్లుగా... మనిషి ఎక్కడైనా మనిషే. కష్టం చేసిన మనిషి వినోదం కోరుకున్నాడు. ఆ వినోదం చుట్టుపక్కల దొరికి ప్రతి ప్రాణిలో వెతుక్కున్నాడు. అన్ని పందేలకు మల్లే కోడి పందేలు కూడా వినోద సాధనంగా మారాయి. పర్షియాలో దాదాపు ఆరువేల ఏళ్లుగా ఇవి ఉనికిలో ఉన్నట్టు చరిత్ర. కాని 17వ శతాబ్దం నుంచి అధికారికంగా నమోదు అవుతున్నాయి. కోళ్ల పందాలు జరిగే దేశాలలో అమెరికా, జపాన్ వంటి అగ్ర రాజ్యాలు ఉన్నా లాటిన్ అమెరికా దేశాల్లో ఇవి విస్తారం. భారత ఉపఖండంలో తూర్పు ఆసియా దేశాల్లో కోళ్లు కొట్టుకోకపోతే మనుషులు కొట్టుకునేంత వెర్రి ఉంది. ఇక తెలుగువారికైతే పల్నాటి చరిత్రే ఉంది. మనిషికి చెలగాటం... కోడికి ప్రాణసంకటం పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లే కోళ్లయందు పందెపు కోళ్లు వేరేగా ఉంటాయి. పందేలకు పనికొచ్చేవి పుంజులే! ఎంత గతి లేని వాళ్లయినా పెట్టలతో పందేలు ఆడరు. పుంజులలో మేలిజాతివాటిని ఏరి కోరి సాకుతారు. జీడిపప్పు, బాదంపప్పు ఖరీదైన దాణా వేస్తారు. జబ్బులు సోకకుండా ఉండటానికి టీకాలు వేయిస్తారు. ఎప్పటికప్పుడు పశువైద్యులతో పరీక్షలు జరిపిస్తారు. ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో వాటి చేత వ్యాయామాలు చేయిస్తారు. యుద్ధశిక్షణ ఇప్పిస్తారు. బరిలోకి దిగాక హుషారు సన్నగిల్లకుండా ఉండటానికి గొంతులోకి కాస్త ‘చుక్క’ అలవాటు చేస్తారు. ఇలా మేసే పందెం పుంజులు మనుషులను లెక్కజేయవు. లేని గదను ఊహించుకుంటూ సుయోధనుల్లా తిరుగుతుంటాయి. వేళకు కూత పెట్టినా, పెట్టకున్నా యజమానులు వీటిని పల్లెత్తు మాట అనరు. అయితే, ఇదంతా తాత్కాలిక వైభోగమే! పందెంలో గెలవాలి. అప్పుడే మర్యాద. ఓడిందా... వీరమరణం తప్పదు. ఒక్కోసారి పరువు హత్యలు కూడా ఉంటాయి. గెలిచినా ఓడినా పందెం కోడి అంతిమ స్థావరం భోజన ప్రియుల పెద్ద బొజ్జే. కాకి... నెమలి... డేగ... ఇవన్నీ కోళ్లే! పందెం పుంజుల్లో చాలా రకాలు ఉన్నాయి. కాకి, కొక్కిరాయి, నెమలి, డేగ... పక్షుల స్వభావాలను పోలుస్తూ రెక్కలు, తోకల రంగుల బట్టి పందెం కోళ్లకు ఇలా నామకరణం చేస్తారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ, కాకి రకాలు ఉంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఉంటాయి. ఇవి కాకుడా చవల, సేతువ, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుగు గౌడు వంటి రకాలు ఉన్నాయి. దించుడు పందెం... చూపుడు పందెం... కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తారు. ఎత్తుడు దించుడు పందెం... చూపుడు పందెం... ముసుగు పందెం... డింకీ పందెం... వీటిలో ఎత్తుడు దించుడు పందేలకే గిరాకీ ఎక్కువ. రెండు పుంజులను బరిలోకి దింపి రెచ్చగొట్టి అవి కయ్యానికి కాలు దువ్విన మరుక్షణం నుంచి పోటీ మొదలైపోతుంది. నిజానికి కోడి యజమానుల కంటే చుట్టూ చేరిన జనాలే ఎక్కువ పందెం కాస్తారు. కత్తుల పందెం అయితే పందెం ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లాంటిది. క్షణాల్లో ముగిసిపోతుంది. ఆయువుపట్టు మీద మొదటి కత్తిదెబ్బ తాకిన కోడి నెత్తురోడుతూ వీరమరణం పొందుతుంది. రెండో కోడి రెక్కలల్లారుస్తూ విజేతగా నిలుస్తుంది. కత్తుల పందెంలో కోడి గెలుపు ఎక్కువగా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. కత్తులు లేని పందెమే కోడిపుంజుల శౌర్యప్రతాపాలను నిగ్గుతేల్చే సిసలైన పందెం. ఇది టెస్ట్ మ్యాచ్లలాంటిది. ఇలాంటి పందెం చాలాసేపు కొనసాగుతుంది. కేవులు... తీతలు... పందెం కోళ్ల యజమానుల కంటే పందేలు నిర్వహించేవాళ్లే ఈ పోటీల్లో ఎక్కువ లబ్ధిదారులు. ప్రతి పందెంలో వీరు అన్ని పందేల మీద టెన్ పర్సెంట్ కమీషన్ తీసుకుంటారు. దీనినే కేవులు లేదా తీతలు అంటారు. సంక్రాంతి పండుగలో తూ.గో, ప.గో జిల్లాల్లో ఒక్కో బరిలో ఒక రోజంతా సాగే పందేల్లో నిర్వాహకులకు వచ్చే తీతలే పది నుంచి ముప్పై లక్షలు ఉంటుందని అంచనా. వీళ్లు కాకుండా లబ్ధి పొందేవాళ్లు ఇంకొకరున్నారు. వీళ్లే రూస్టరాలజిస్టులు. అనగా కుక్కుట శాస్త్రవేత్తలు. అంటే పందెం కోళ్ల స్పెషలిస్టులన్న మాట. వీరు బరులన్నీ తిరుగుతూ ఏ రకం కోడిని ఏ రోజు పందెంలో నిలబెడితే గెలుస్తుందో ఏ రకం కోడిని బరిలో ఏ దిక్కున నిలబెడితే గెలుస్తుందో ఈకకు ఈక పరిశీలించి, పంచాంగాలను ‘కోడీ’కరించి మరీ చెబుతారు. ఇలా చెప్పినందుకు భూరి సంభావనలు పుచ్చుకుంటారు. జోస్యం ఫలిస్తే అది తమ ప్రతాపంగా, వికటిస్తే అది సదరు కోడి యజమాని గ్రహచారంగా చెప్పి తప్పించుకుంటారు. నిజానికి కోడి పందేల సీజన్లో పందెం బరి దరిదాపుల్లోనైనా కనిపించని ఇలాంటి కుక్కుటేశ్వర స్వాములే సిసలైన విజేతలు! దుష్ట సంప్రదాయం... నిజంగా వినోదం ఏదైనా స్థాయి మించకపోతే వినోదంగానే ఉంటుంది. రెండు పుంజులు రెండు మూడు నిమిషాల పాటు కాలు దువ్వుకుంటే దేని ప్రాణమూ పోదు. మరు నిమిషం విడిపోయి అవి తమ దారిన తాము పోతాయి. కాని పందెం పెట్టడం వల్ల ఒకటి చావాల్సిన... ఇంకోటి బతకాల్సిన అగత్యం వస్తోంది. దీని కోసం కోళ్లకు స్టెరాయిడ్లు ఇచ్చేవాళ్లు ఉన్నారు. పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్లు ఉన్నారు. కత్తులకు విషాలు పూసి ఎదుటి పక్షిని విషగ్రస్తం చేసేవాళ్లు ఉన్నారు. ఇవన్నీ సరదాగా సాగాల్సిన పల్లె పందేల్ని కోడి పందేల్లి హింసాత్మకం చేస్తున్నాయి. కాని మానవుల అభిరుచుల్ని చట్టాలు నియంత్రించలేవు. ఇంగ్లాండుతో సహా అనేక దేశాల్లో కోడి పందేలను నిషేధించినా ఎక్కువ తక్కువగా అవి సాగుతూనే ఉన్నాయి. సాగుతాయి కూడా! - సాక్షి ఫ్యామిలీ -
కుక్కను వేధించినందుకు జరిమానా!
పాశ్చాత్యదేశాల్లో జంతువులను హింసిస్తే కేసులవుతాయి. మన దగ్గరా జంతు ప్రేమికులు క్రియాశీలమవుతున్నారనేందుకు ఇదో ఉదాహరణ. నవీ ముంబైలోని ఖార్గార్ ప్రాంతంలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యార్థులు ముగ్గురు లాబ్రాడర్ జాతికి చెందిన ఓ కుక్కపిల్లను హింసించారు. సిగరెట్లు తాగుతూ పొగను దాని నోట్లోకి బలవంతంగా ఊదారు. ఈ వీడియో ఎవరిద్వారానో జంతుహక్కుల సంస్థకు అందింది. వారు వెంటనే... క్యాంపస్‌లో తెలిసిన వ్యక్తి ద్వారా ఆ ముగ్గురెవరో గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్ర సింగ్ అనే విద్యార్థి దీన్ని పెంచుకుంటున్నాడు. స్నేహితులు రోహిత్ పంచపాల్, సుర్యాంశు రాజ్‌లతో కలిసి ఈ చర్యకు పాల్పడ్డారు. పోలీసులు వెంటనే ఈ ముగ్గురిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి రూ. 2,500 జరిమానా విధించారు. అలాగే కుక్కపిల్లను వారి నుంచి స్వాధీనం చేసుకొని సంరక్షణాలయానికి తరలించారు. -
కుక్కలు కనిపిస్తే.. ఎగుమతేనట!
కేరళలో గ్రామ సింహాలకు భలే చిక్కొచ్చిపడింది. ఇకపై మొరిగినా, మొరగకపోయినా, ఎవరినీ కరవకపోయినా కూడా వీధుల్లో కనిపిస్తే చాలు.. వాటిని ఖైమా చేసే పనిలో పడ్డారు ఎర్నాకుళం జిల్లా గ్రామ పంచాయతీల వారు. మన మున్సిపాల్టీల వారు వీధికుక్కల్ని ఒకచోట పట్టుకుని మరోచోట విడిచిపెడుతుంటారు. కానీ కేరళ గ్రామ పంచాయతీల వారు మాత్రం వీటిని ఎగుమతి చేయాలని తీర్మానించారు! వీధికుక్కల్ని ఎగుమతి చేస్తే ఇటు సమస్య తప్పడంతో పాటు అటు ఆదాయమూ వస్తుందన్నది వీరి ప్లాన్. ఈశాన్య రాష్ట్రాలు, చైనా, కొరియా జనాలకు వీధికుక్కలను చూస్తేనే నోట్లో నీళ్లూరతాయట. అందుకే.. వీధికుక్కలను అక్కడికి ఎగుమతి చేస్తే పంట పండినట్లేనని వీరు చెబుతున్నారు. ఎర్నాకుళం జిల్లా సర్పంచుల సమావేశంలో ఎదక్తువయల్ గ్రామ సర్పంచ్ గురువారం దీనిపై ఓ తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వమూ ఆమోదిస్తే కోళ్ల పెంపకం మాదిరిగా.. కుక్కల పెంపకమూ జోరందుకుంటుందనీ ఆయన సెలవిచ్చారు. అన్నట్టూ.. 2014-15లో కేరళలో 1.06 లక్షల మందిని వీధికుక్కలు కరిచాయట! వీధికుక్కల దాడులు పెరుగుతుండటంతో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఇటీవల ఏకంగా అఖిలపక్ష భేటీనే నిర్వహించారు! కుక్కలకు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టడం, రేబిస్ సోకినవాటిని హతమార్చడం వంటివాటిపై సమగ్ర ప్రణాళిక గురించి చర్చించారు. ఏదేమైనా వీధికుక్కల సమస్యను ఇలా వదిలించుకోవ డమేంటని కేంద్ర మంత్రి మేనకా గాంధీ లాంటి జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
జంతు ప్రేమికులు
ఇంట్లో బొచ్చు కుక్కకు ముద్దు పేరు పెట్టుకుని మరీ ముద్దులు చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. అదే కుక్క వీధిలో కనిపిస్తే పిచ్చి కుక్కని దూరంగా పోతుంటారు. లేదా ఛీకొడతారు. ఇక పిల్లి ఎదురొస్తే అపశకునంగా భావించి పనులు వాయిదా వేసుకుంటారు. ఇలాంటివి పట్టించుకోకుండా వీధుల్లోని మూగజీవాలకు ఆహార భద్రత కల్పిస్తున్నారు కొందరు సిటీవాసులు. వేల రూపాయలు ఖర్చు చేస్తూ పదుల సంఖ్యలో శునకాలు, మార్జాలాల ఆకలి తీరుస్తూ మనవత్వాన్ని చాటుతున్నారు. వీధి కుక్కలకు దిక్కు.. పెంపుడు శునకాలకు ఉండే రాజభోగాలు అన్నీ ఇన్నీ కావు. ఆహారం కోసం అలమటించడం వీధి కుక్కల దినచర్యలో భాగం. అలాంటి శునకాల పాలిట అన్నపూర్ణగా మారారు సుజీ అబ్రహం. హిమాయత్‌నగర్ 5వ వీధిలో ఉండే సుజీ బ్లూక్రాస్ సంస్థలో మెంబర్ కూడా. ప్రతి ఉదయం 4 కిలోల బియ్యం వండి.. అన్నాన్ని తన కోసం ఎదురు చూస్తున్న శునకాలకు పంచుతుంది. 15 ఏళ్లుగా ఇది కొనసాగిస్తున్నారామె. కుక్కల కడుపు నింపడమే కాదు.. అవి తినేసిన తర్వాత ఆకులను చెత్తకుండిలో వేసి పారిశుద్ధ్య ప్రాధాన్యాన్ని చాటుతున్నారు. ఆహారం దొరక క వీధి కుక్కలు పడుతున్న అవస్థలు వాటి పిల్లలు పడకూడదనే ఆలోచనతో స్టెరిలైజ్ చేయిస్తుంటారు. రేబిస్ ఇంజక్షన్లు కూడా వేయిస్తుంటారు. చనిపోయిన కుక్కలకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తుంటారు. - రంగయ్య, హిమాయత్‌నగర్ మిడ్నైట్ మీల్స్.. స్థలం: ఆనంద్‌బాగ్, సమయం: అర్ధరాత్రి పదుల సంఖ్యలో శునకాలు రోడ్డుమీద తచ్చాడుతుంటాయి. ఎవరో వస్తారని.. ఏదో తెస్తారని.. ఆత్రంగా ఎదురు చూస్తుంటాయి. ఆ మనిషి రాగానే.. అన్నీ అతని చుట్టూ చేరిపోతాయి. తోకలాడిస్తూ.. కాళ్లెత్తి సలామ్ కొడతాయి. ఆయన తీసుకొచ్చిన ఆహారాన్ని ఎంచక్కా తినేసి తోకలు ఆడిస్తూ కృతజ్ఞతాభావాన్ని చాటుకుంటాయి. ప్రతి రోజూ ఈ సీన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ శునకరాజాల ఆకలి తీరుస్తున్న మనసున్న మనిషి పేరు పురుషోత్తం. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఏడేళ్ల కిందట ఓ అర్ధరాత్రి శునకాల ఆకలి అరుపులు విన్న ఆయన కడుపు తరుక్కుపోయింది. ఆ రోజు నుంచి ఆ వీధిలోని కుక్కలకు అన్నదాతగా మారాడు. బన్ను, బిస్కెట్లు.. ఆదివారం వస్తే చికెన్ పీస్‌లు.. అందిస్తున్నాడు. వీటి కోసం నెలకు రూ.10 వేలు ఖర్చు చేస్తున్నాడు. ‘పగటి పూట వాటికి ఆహారం పెట్టడం మంచిది కాదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాల బారిన పడవచ్చు. అందుకే అర్ధరాత్రుల్లో వాటి కడుపు నింపుతుంటాను’ అని చెబుతాడు పురుషోత్తం. - సునీల్‌రెడ్డి, మల్కాజిగిరి పిల్లులతో దోస్తీ... స్థలం: చిలకలగూడ సమయం: మధ్యాహ్నం 12 గంటలు ఓ ఇంటి నుంచి పిల్లుల మ్యావ్.. మ్యావ్‌లు.. తెగ వినిపిస్తుంటాయి. ఒక్కసారి ఇంట్లోకి తొంగి చూస్తే.. చుట్టూ పిల్లులు.. మధ్యలో ఓ మనిషి. ఆయన పేరు మేకల హన్మంతరావు. అపశకునానికి సింబాలిక్‌గా పిల్లిని చెప్పుకుంటారు. కానీ హన్మంతరావు మాత్రం ఏకంగా 25 పిల్లులను పెంచుతున్నాడు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు వాటికి ఠంచనుగా ఆహారం అందిస్తాడు. పిల్లి చేష్టలను ఆప్యాయంగా చూసి మురిసిపోతుంటాడు. ఇన్ని పిల్లులు ఎక్కడి నుంచి వచ్చాయని సందేహం రావొచ్చు. ఇవన్నీ ఆయన ఇంటి పైవాటాలోనే ఉంటాయి. పిల్లుల కోసమే టైపై ప్రత్యేకంగా షెడ్ వేయించారాయన. మొదట్లో 100 పిల్లుల వరకూ ఉండేవి. కొన్ని చనిపోగా, ఇంకొన్ని ఎక్కడికో వెళ్లిపోయాయి. ప్రస్తుతం 25 పిల్లులు కేరాఫ్ హన్మంతరావుగా కాలం వెళ్లదీస్తున్నాయి. ‘వాటికి ఆహారం వేయకపోతే మనసు విలవిల్లాడుతుంది. అందుకే ఏదైనా ఊరికి వె ళ్లాల్సి వస్తే.. మిత్రులకు వాటి బాధ్యతను అప్పగిస్తాను’ అని తెలిపాడు హన్మంతరావు. - శ్రీనివాస్, చిలకలగూడ నాన్పేయింగ్ గెస్ట్స్.. చుట్టాలకు, పక్కాలకు కూడా ఇంట్లో చోటు ఇవ్వలేని సిటీలైఫ్‌లో.. తన నివాసాన్ని మూగజీవాల ఆవాసంగా మార్చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు నీలిమా నాగరాజు. పంజగుట్ట ప్రతాప్‌నగర్ కాలనీలో ఉండే ఆమె ఇంట్లో.. తొమ్మిది శునకాలు, 10 పిల్లులు నాన్పేయింగ్ గెస్ట్‌లు. జాతివైరాన్ని మరచి స్నేహంగా ఉంటాయివి. 40 ఏళ్లుగా శునకాలు, మార్జాలాలను పెంచుతున్నారామె. ఉదయాన్నే వీటికి పాలు.. బ్రెడ్, లంచ్, డిన్నర్లలో అన్నంతో పాటు మాంసాహారం వడ్డిస్తున్నారు. 24 ఏళ్లుగా ఓ చిలుకను కూడా పెంచారామె. ముద్దు ముద్దుగా మాటలు పలికే ఆ చిలుక పేరు రాము. కొన్నాళ్ల కిందట అది చనిపోయింది. - సత్య, శ్రీనగర్‌కాలనీ -
ఆయేషా ‘పెటా’ ప్రచారం
జంతుప్రేమికుల సరసన తాజాగా ‘సూపర్’ సుందరి ఆయేషా టకియా కూడా చేరింది. నవంబర్ 1న వచ్చే ప్రపంచ శాకాహారుల దినోత్సవం సందర్భంగా ‘పెటా’ రూపొందించిన ప్రచారంలో ఆమె కోడిపిల్లతో ఫొటోలకు ఫోజులిచ్చింది. శాకాహారం తన జీవితాన్నే మార్చేసిందని ఆమె ‘పెటా’ ప్రచారం కోసం రూపొందించిన వీడియో చిత్రంలో చెప్పుకొచ్చింది. జంతువులను దారుణంగా చంపుకొని తినడం క్రూరమైన చర్య అని, అందరూ శాకాహారులుగా మారాలని విజ్ఞప్తి చేసింది.