కుక్కలకూ కావాలొక ‘శ్రీమంతుడు’
నగరంలో వీధి కుక్కల దత్తత.. దేశంలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: దత్తత కాన్సెప్టు ఇప్పుడు వీధి కుక్కల వరకూ చేరింది. వీధి కుక్కల బెడదను నివారించేందుకు దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ మహానగరంలో ‘వీధి కుక్కల దత్తత’అనే వినూత్న కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఆదివారం నార్త్‌జోన్‌లో ‘స్ట్రీట్ డాగ్స్ అడాప్షన్’కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. తొలిరోజు ఐదు కుక్కపిల్లలను జంతు ప్రేమికులు దత్తత తీసుకున్నారు. దత్తత ద్వారా వీధికుక్కల నియంత్రణకు మార్గం లభిస్తుందని బల్దియా భావిస్తోంది. మహానగరం పరిధిలో ప్రస్తుతం ఆరు లక్షల వీధికుక్కలు ఉన్నాయి. వీటిలో ఒక లక్ష కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు.
నగరంలో ఉన్న వీధికుక్కలకు రేబిస్ నిరోధక టీకాలతోపాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నా, నగర శివార్లలోని గ్రామాలు, పట్టణాలలో ఈ విధమైన పద్ధతి లేనందున అక్కడి వీధికుక్కల సమస్య జీహెచ్‌ఎంసీకి తలనొప్పిగా తయారైంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదివారం అడిషనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ వెటర్నరీ అధికారి వెంకటేశ్వరరెడ్డి, ఇతర వెటర్నరీ అధికారులతో సమావేశమై వీధి కుక్కల దత్తతపై చర్చించారు.
దత్తతపై అవగాహన
దత్తతపై స్వచ్ఛంద సంస్థలకు, జంతు ప్రేమికులకు జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దత్తత తీసుకున్న కుక్కపిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, అవసరమైన వైద్య చికిత్సలను తామే చేపడతామని బల్దియా వెటర్నరీ అధికారులు భరోసా ఇస్తున్నారు. రెండు రోజులక్రితం నార్త్ జోన్ పరిధిలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు 20 మందికిపైగా స్వచ్ఛంద సంస్థల, జంతు ప్రేమికుల సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వీధికుక్కలను దత్తత తీసుకునేవారు స్థానిక జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారులను సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జంతు ప్రేమికులకు సూచించారు.