ఆడబిడ్డలపై చిన్నచూపు
* హైదరాబాద్‌లో అధికంగా లింగవివక్ష
* ఆందోళన వ్యక్తంచేస్తున్న కేంద్ర, రాష్ట్రాలు
* బాలికల రక్షణ, విద్యాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక కార్యక్రమం
* మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన కు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికే ఐటీ గమ్యంగా మారిన రాష్ట్ర రాజధానిలో లింగవివక్ష కూడా అధికంగానే ఉందంటే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెంది నప్పటికీ ఇక్కడ బాలికలు, మహిళల పట్ల వివక్ష పెరుగుతూనే ఉందని పలు సంస్థలు చేసిన సర్వేలు, ప్రభుత్వ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రభుత్వం 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం కూడా.. ఆరేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి వెయ్యిమంది మగ పిల్లలకు కేవలం 914 మందే ఆడపిల్లలున్నట్లు తేలింది. 2001లో ఆరేళ్లలోపు మగ, ఆడ పిల్లల నిష్పత్తి 1000: 943 ఉండగా, పదేళ్ల అనంతరం ఆడపిల్లల సంఖ్య మరింతగా దిగజారడం ఆందోళనకర పరిణామంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
తల్లి గర్భం లోని ఆడశిశువు బయటకు రాకుండానే అంతమౌతోం దన్న నిజం.. అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. ముఖ్యంగా.. రాజధాని శివారు జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల నుంచి ఎక్కువమంది నగరానికి వలస వస్తుం డడం, తమకు పుట్టబోయేది ఆడపిల్ల అని స్కానింగ్ పరీక్షల ద్వారా తెలుసుకొని గర్భంలోనే చిదిమేస్తుండడం ఈ పరిస్థితికి కారణమని అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా.. ఇటువంటి పరిస్థితులున్న 100 జిల్లాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం లింగవివక్షను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆడ పిల్లల భద్రత, విద్యాభివృద్ధి కోసం ‘బేటీ బచావో.. బేటీ పడావో’పేరిట ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది.
ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో.. కార్యక్రమం అమలు బాధ్యతలను రాష్ట్రంలో మహిళా శిశు సం క్షేమ శాఖ చేపట్టింది. జాతీయ సగటు(1000: 918)కన్నా ఆడపిల్లల సంఖ్య తక్కువగా నమోదైన హైదరాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయంచేసి ఈ కార్యక్రమా లు నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సి ద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్యక్రమం అమలుకు జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించింది.
బహిర్గతం చేస్తే.. హత్య చేసినట్లే..
ప్రభుత్వపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్కానింగ్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ ల్యేబొరేటరీల యాజమాన్యాలు తమ వ్యాపార దృక్పథాన్ని వీడడం లేదు. పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో ముందుగానే చెప్పడం నేరమని తెలిసినా, డబ్బుకు కక్కుర్తిపడి స్కానింగ్ సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారు. సమాచారం బహిర్గతం చేసినవాళ్లు.. ఆడపిల్లలను హత్య చేసినట్లే. ప్రభుత్వం పరంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి.
- శ్యామ్ సుందరి, బేటీ బచావో.. బేటీ పడావో
కార్యక్రమ నోడల్ అధికారి