ఆడపిల్ల.. గుండెల మీద కుంపటి కాదు!
‘‘నేను చాలా అదృష్టవంతురాల్ని’’ అంటున్నారు ప్రియాంక చోప్రా. తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఆమె ఈ మాట అన్నారు. ‘నువ్వు ఆడపిల్లవి. వంచిన తల ఎత్తకు’ అంటూ నియమ నిబంధనలు పెట్టకుండా మా అమ్మానాన్న తగినంత స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు ప్రియాంక. మహిళలకు సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారామె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘మా కుటుంబంలో ఆడపిల్లలను ఒకలా, మగపిల్లలను ఒకలా పెంచరు. తేడా శరీరంలోనే కానీ.. మనసులో కాదని, అందుకని లింగ భేదాల గురించి ఆలోచించడం అనవసరం అని అంటారు. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి.
అందుకే ఎవరైనా ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడితే భరించలేను. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే.. దాదాపు ఇరవై, పాతికేళ్లు ఆడపిల్లలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే తల్లిదండ్రులు ఆమె వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలొస్తే ‘మెట్టినింట్లో సర్దుకుపోవాలి.. పుట్టింటికి రాకూడదు’ అంటారు. ఇక కొంతమందైతే ఆడపిల్ల పుట్టిందని తెలియగానే, తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారో లేదో అడగకుండా, ప్రపంచం తలకిందులైపోయినట్లుగా ఫీలవుతారు. పెళ్లి చేసి పంపేవరకూ ఆడపిల్లను గుండెల మీద కుంపటిలా భావిస్తారు.
తమకు జన్మనిచ్చినది ఆడదే అని ఒక్క క్షణం ఆలోచించినా ఆడపిల్లలు వద్దనుకునే మగవాళ్లకు కనువిప్పు కలుగుతుంది’’ అన్నారు ఆవేశంగా. ఆడవాళ్లు ధైర్యంగా ఉండాలని, ఎవరైనా వేధించాలని చూస్తే, భయపడి ఊరుకోకూడదని ప్రియాంక సూచించారు. స్త్రీలపై అత్యాచారాలు చేసేవాళ్లని కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఘోరాల సంఖ్య తగ్గుతుందని కూడా అన్నారు.