ఆసియా శృంగారదేవత మళ్లీ ఆమే
'క్వాంటికో' టీవీ సీరియల్‌తో అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. మరోసారి ఆసియా శృంగార దేవతగా ఎంపికైంది. 'ఈ భూగ్రహం మీద ఉన్న 50 మంది సెక్సీయెస్ట్ ఆసియా మహిళలు' అంటూ ఓ బ్రిటన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే పత్రిక ఒక జాబితా రూపొందించగా.. అందులో ప్రియాంక అగ్రస్థానంలో నిలిచింది. ఆమె ఈ టైటిల్ గెలుచుకోవడం ఇది మూడోసారి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమందితో వార్షిక సర్వే నిర్వహించగా.. అందరి అభిప్రాయం ప్రకారం ప్రియాంక టాప్ ప్లేస్ సాధించింది. తాను మళ్లీ ఈ కిరీటం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తనకు ఓట్లు వేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. తనను తాను 'సెక్సీ'గా భావించుకునేలా చేసిన ఈస్ట్రన్ ఐ పత్రికకు కూడా కృతజ్ఞతలు చెప్పింది. కనీసం మరో సంవత్సరం పాటు ఈ ఫీలింగ్ ఇలాగే ఉంటుందంది. ప్రియాంక భారతదేశాన్ని గర్వపడేలా చేసిందని.. విశ్వయవనిక మీద ఆమె అందరికీ ఆరాధ్యదేవతగా మిగిలిపోతుందని పత్రిక ఎంటర్‌టైన్‌మెంట్ ఎడిటర్ అస్జద్ నజీర్ అన్నారు.