ఆప్షన్స్ ట్రేడింగ్‌లో సక్సెస్ కావాలంటే.... | How to succeed in options trading | Sakshi
Sakshi News home page

ఆప్షన్స్ ట్రేడింగ్‌లో సక్సెస్ కావాలంటే....

Published Sun, Jan 12 2025 9:41 AM | Last Updated on Sat, Jan 25 2025 4:30 PM

How to succeed in options trading

ఆప్షన్స్ ట్రేడింగ్ (options trading)లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించడానికి ఎంత అవకాశం ఉందో... ఉన్న డబ్బులు ఊడ్చిపెట్టుకుని పోవడానికీ  అంతే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎట్ ది మనీ (ఏటీఎం), ఇన్ ది మనీ (ఐటీఎం), అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం) లది ప్రధాన పాత్ర అని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం. అలాగే ఏటీఎం కాల్స్, పుట్స్ ఎలాంటి ప్రయోజనం కలగజేస్తాయో కూడా చర్చించుకున్నాం.

ఇప్పుడు ఐటీఎం, ఓటీఎం ల గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో స్మార్ట్ ట్రేడర్లు అనుసరించే పద్ధతి ఐటీఎం. మళ్ళీ ఎస్బీఐ షేరు నే ఉదాహరణగా తీసుకుందాం.ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 దగ్గర ఉంది. స్ట్రైక్ ప్రైస్ 10 రూపాయల తేడాలో 730, 740, 750... ఇలా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా.  ఇపుడు 730  రూపాయల కాల్ తీసుకుంటే.. అది ఐటీఎం కాల్ అవుతుంది. అంటే అండర్ లయింగ్ అసెట్ (ఈక్విటీ షేరు ధర) కంటే షేరు ధర తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఐటీఎం కాల్ గా వ్యవహరిస్తారు. ఇంకా తక్కువ ధరలు ఉండే 720, 710, 700 రూపాయల కాల్స్ కొనుగోలు చేస్తే అవి డీప్ ఐటీఎం కాల్స్ అవుతాయి. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. ధరల్లో ఊగిసలాటలు కూడా ఎక్కువే ఉంటాయి. అంటే పెరగడం ఎంత వేగంగా పెరుగుతాయో పడటమూ అంతే వేగంగా ఉంటాయి. కాబట్టి సగటు ట్రేడరు కొంచెం ఎక్కువ రిస్క్ భరించాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఎస్బీఐ షేరు ధరను దృష్టిలో పెట్టుకుని 730 రూపాయల కాల్ సెలెక్ట్ చేసుకుందాం. దీని ధర ప్రస్తుతం రూ. 28 వద్ద ఉంది. షేరు పెరుగుతున్న కొద్దీ ఇది పెరిగే వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే షేరు 730 దిగువకు రానంత సేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ కాల్ ధర తగ్గినప్పటికీ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ జోరు తగ్గుతుంది. అదెలాగంటే... షేరు ధర 730 నుంచి 780 కి వెళ్ళేటప్పటికి  మీరు కొన్న కాల్ 28 రూపాయల నుంచి 70 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.  షేరు ధర 750 కి పడినప్పుడు 30 -35 కి వచ్చేస్తుంది. మళ్ళీ షేరు పెరగడం మొదలై 780 కి వెళ్లినా ఈసారి కాల్ ధర 60 దాటకపోవచ్చు. అంటే మొదట పెరిగినంత వేగంగా రెండోసారి పెరగదన్న మాట.  దీనికి కారణం ఆప్షన్ గ్రీక్స్. ఇవే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. 

ఇక పుట్స్ విషయానికొస్తే... కాల్స్ కి ఇది రివర్స్. షేరు ధర 744 దగ్గర ఉంది కాబట్టి మనం 760 పుట్ కొంటే.... అది ఎంత పడితే పుట్ ధర అంత పెరుగుతూ వెళ్తుంది. ట్రేడర్లు సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే... ఐటీఎం కాల్స్, పుట్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయన్నది నిర్వివాదం.

ఇదీ చదవండి: Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!

ఇక ఓటీఎంల విషయానికొద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో అత్యంత ప్రమాదకరమైనవే ఈ ఓటీఎం కాల్స్, పుట్స్. కానీ నూటికి 90 మంది ఈ ఓటీఎం ల్లోనే ట్రేడింగ్ చేస్తారు. సంపాదించేది తక్కువే అయినా.. పోగొట్టుకునేది మాత్రం వీటిలో ఎక్కువే.  మరి డబ్బులు పోతాయి అని తెల్సినా... ఈ ఓటీఎంల్లోనే ఎందుకు ట్రేడింగ్ చేస్తారంటే దానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు.

1. ప్రీమియం రేట్లు చాలా చౌకగా ఉండటం.  
2. తక్కువ పెట్టుబడి తో భారీ లాభాలు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం.

ఎస్బీఐ షేరు 744 దగ్గర ఉంది కదా... చాలామంది 760, 770, 780 కాల్స్ కొంటారు. ఇంకా చెప్పాలంటే 800 కాల్స్ కూడా తీసుకుంటారు. వీటి రేట్లు వరుసగా 11, 8, 6, 3  స్థాయిలో ఉన్నాయి. అంటే 760 కాల్ ఒక లాట్ కొనడానికి 8250 పెట్టుబడి అవసరమైతే... 770 కాల్ కు 6000, 780 కాల్ కు 4500, 800 కాల్ కు 2250 పెట్టుబడి సరిపోతుంది.  అంటే కేవలం ఓ 3000 నుంచి 10000 చేతిలో ఉన్న వ్యక్తి కూడా చాలా సులువుగా ఎస్బీఐ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేయగలడు. రిటైల్ ట్రేడర్లని ఆకర్షించేవి ఈ రేట్లే. 

6 రూపాయలు పెట్టి 780 కాల్ కొన్న వ్యక్తికి గిట్టుబాటు కావాలంటే... షేర్ ధర 780 దాటి పెరగాలి. అది కూడా కంటిన్యూ గా పెరుగుతూ రావాలి. ఒకసారి పెరిగి, ఇంకోసారి పడి... ఇలా ముందుకెళ్తే కుదరదు. వీటిలో ఉన్న దుర్లక్షణం ఏమిటంటే.... పెరిగినప్పుడు చాలా స్వల్పంగా పెరిగితే.. షేరు ధర పడేటప్పుడు చాలా ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. కాంట్రాక్టు ఎక్సపైరీ టైం కి మొత్తం పెట్టుబడి కాస్తా సున్నా అయిపోతుంది. కానీ సగటు ట్రేడరు మాత్రం మళ్ళీ పెరగొచ్చులే... అని చివరి దాకా ఎదురుచూస్తూనే ఉంటాడు. చివరకు నష్టంతోనే బయటకొస్తాడు. మార్కెట్ ను తిట్టుకుంటాడు.. మళ్ళీ పోగుట్టుకున్న డబ్బులు సంపాదించేయాలన్న ఆతృతతో విఫల యత్నాలు చేస్తూనే ఉంటాడు.

ఇప్పుడు అర్ధం అయింది కదా... ఆప్షన్స్ ట్రేడింగ్ చిన్న ట్రేడర్లకు ఎంత ప్రమాదకరమో... ఆ తప్పులు చేయకూడదంటే....  ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మార్కెట్ పరిస్థితులపై అవగాహన కల్పించుకోవాలి. తగిన క్యాపిటల్ చేతిలో ఉండాలి. ఎప్పటికప్పుడు వచ్చే న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. ప్రత్యేకించి ఒక షేరు కు సంబంధించి.. ఆప్షన్స్ కొంటున్నప్పుడు టైం కి ప్రాధాన్యమివ్వాలి.
ఆప్షన్ గ్రీక్స్ అర్ధం చేసుకోవాలి. ఆప్షన్స్ చైన్ అనలైజ్ చేయడం రావాలి. టెక్నికల్ తెలిసి ఉండాలి. ఇవేవీ తెలియకుండా... చేతిలో కాసిన్ని డబ్బులు పెట్టుకుని... లక్షలు, కోట్లు సంపాదించేయొచ్చు అని వేషాలేస్తే... ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోవడం ఖాయం. అంచేత... పొరపాట్లకు తావివ్వక ముందుకు సాగే ట్రేడర్లు మాత్రమే ఆప్షన్స్ ట్రేడింగ్ లో సక్సెస్ అవుతారనేది తోసిపుచ్చలేని వాస్తవం.

-బెహరా శ్రీనివాస రావు
స్టాక్ మార్కెట్ విశ్లేషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement