మార్కెట్లు - ఈ వారం
గత వారం స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు చుక్కలు చూపించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సెన్సెక్స్ దాదాపు 3700 పాయింట్లు నష్టపోయి 78000 పాయింట్ల స్థాయిలో స్థిరపడగా.. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ నిఫ్టీ 1200 పాయింట్లు కోల్పోయి 23600 దరిదాపుల్లో ముగిసింది. అంటే సెన్సెక్స్, నిఫ్టీలు ఒకవారం రోజుల వ్యవధిలో 5 శాతం నష్టపోయాయన్నమాట.
ప్రధాన సూచీలు ఈస్థాయిలో పడిపోవడం మామూలు విషయమేమీ కాదు. పైగా కేవలం గత గురు, శుక్రవారాల్లో భారీగా నష్టపోయాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా. కిందటి బుధవారం రాత్రి (మన కాలమానం ప్రకారం) అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వడ్డీ రేట్లను పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోతలు చాలా పరిమిత సంఖ్యలో ఉంటాయన్న ప్రకటన మార్కెట్లకు నచ్చలేదు. దీంతో అక్కడి డోజోన్స్, నాస్డాక్స్ సూచీలు భారీగా నష్టపోయాయి. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ఆసియా, ఐరోపా మార్కెట్లూ ఊచకోతకు గురయ్యాయి. ఇందుకు మన మార్కెట్లూ మినహాయింపు కాలేదు.
విదేశీ మదుపర్లు
డిసెంబర్ చివరి వారానికి వచ్చేశాం. సాధారణంగా డిసెంబర్‌లో విదేశీ మదుపర్ల లావాదేవీలు మందగిస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ వారంలో వీరి కొనుగోళ్ల స్థాయి పడిపోతుంది. దీంతో సూచీలు చాలా స్తబ్దుగా కొనసాగుతాయి. ఇప్పటికే వీరి విధ్వంసాన్ని మార్కెట్లు కళ్లజూశాయి. మళ్ళీ వీళ్ళు జనవరి రెండో వారంలో మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెడతారు. అప్పటి దాకా దూకుడు కొంత తగ్గవచ్చు.
గత వారం విదేశీ మదుపర్లు దాదాపు రూ. 20,000 కోట్ల షేర్లను నికరంగా విక్రయించారు. ఈ నెల మొత్తానికి మాత్రం వీరి నికర విక్రయాలు సుమారు రూ.4,100 కోట్లుగా ఉన్నాయి. దీనికి కారణం అంత క్రితం రెండు వారాల్లో వీళ్ళు నికర కొనుగోళ్లు జరపడమే.
ఈ వారం అంచనాలు
ఈ వారం కూడా మార్కెట్లలో జోరు ఉండకపోవచ్చు. కొన్నాళ్ల పాటు నష్టాల బాటలోనే కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. నిఫ్టీకి 23500 వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. ఒకవేళ ఆ స్థాయిని కూడా బ్రేక్ చేసి దిగజారితే 23370 వరకు పడిపోవచ్చు. ఒకవేళ అక్కడి దాకా చేరితే.. మార్కెట్‌కు మద్దతు దొరికి మళ్ళీ సూచీలు బలంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అదీ కాని పక్షంలో 23000 వరకు పతనం కొనసాగవచ్చు. ఒకవేళ సూచీలు ముందుకు కదిలితే 23700 వద్ద మొదటి నిరోధం ఎదురవుతుంది. దాన్ని అధిగమిస్తే తదుపరి నిరోధం 23800 వద్దఎదురవుతుంది. దీన్నీ దాటుకుని ముందుకెళ్తే 24000 వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.
ఇప్పటికే మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా సూచీల్లో ఎక్కువ స్థాయిలో షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. గత వారమంతా అమ్మకాలు కొనసాగడం, డిసెంబర్ నెల కాంట్రాక్టులకు సంబంధించి ఇదే చివరి వారం కావడం వంటి కారణాల వల్ల వారంలో ఏ సమయంలోనైనా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక బ్యాంకు నిఫ్టీ విషయాని కొస్తే.. 50500 దిగువన కొనసాగితే మాత్రం 49000 వరకు క్షీణించే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్లు ముందుకెళ్తే 52000 వరకు సూచీ దూసుకెళ్ళవచ్చు. షార్ట్ కవరింగ్ లావేదేవీలు సహకరిస్తే 53000 వరకు పరుగులు తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
జీఎస్టీ మండలి నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై విధిస్తున్న పన్ను రేట్ల తగ్గింపు. గత సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం వెలువడవచ్చని భావించినప్పటికీ.. ఇది వాయిదా పడటం ఒక రకంగా ఇన్సూరెన్సు కంపెనీల షేర్లపై స్వల్ప స్థాయిలోనే అయినా ప్రతికూల ప్రభావం చూపించడానికి ఆస్కారంఉంది. ఆటోమొబైల్, చమురు షేర్లు నష్టాల్లోనే కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో ఎలాటి ప్రభావిత వార్తలు లేకపోవడంతో సిమెంట్ షేర్స్ మందకొడిగా కొనసాగవచ్చు.
ఇక ఎఫ్ఎంసీజీ, టెలికాం రంగాల షేర్లలోనూ స్తబ్దత తప్పదు. యంత్ర పరికరాల రంగానికి సంబంధించిన షేర్లకు నష్టాల బాట తప్పక పోవచ్చు. సాధారణంగా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు సురక్షిత రంగంగా ఫార్మాను భావిస్తూ ఉంటారు. గతవారం లాభాల్లో నడిచిన ఫార్మా షేర్లు ఈ వారం కూడా అదేస్థాయిలో జోరు కొనసాగించవచ్చు. క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు బుధవారం సెలవు.
- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment