నాథుడు లేని పార్టీకి అందలమెలా.. | Analysis Of The Future Of The Congress Party | Sakshi
Sakshi News home page

నాథుడు లేని పార్టీకి అందలమెలా..

Published Sat, Feb 10 2024 6:57 PM | Last Updated on Sun, Feb 11 2024 8:51 AM

Analysis Of The Future Of The Congress Party - Sakshi

అది ఎంత మహా వృక్షమైనా కావొచ్చు. ఎన్నిఆటుపోట్లనైనా తట్టుకుని ఉండొచ్చు. చివరికి ఓ చిన్నపాటి గాలివాన చాలు.. కూకటి వేళ్ళతో కూలిపోవడానికి.. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ దృష్టాంతం అతికినట్లు సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చకచకా పావులు కదుపుతూ ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసరాల్సింది పోయి అంతర్గత సమస్యలహో అల్లాడుతూ పఠనం దిశగా సాగుతోంది. మరోపక్క ప్రస్తుత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం అందనంత ఎత్తులో మూడోమారు అందాలన్నీ దక్కించుకునే రేసులో దూసుకుపోతోంది.

ఒక జాతీయ పార్టీగా రాజకీయాలను శాసించి.. దిగ్గజాలకు ఆలవాలమై దుర్బేధ్యమైన కోటను నిర్మించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దిక్కులేని స్థాయికి ఎందుకు దిగజారింది?? ఎందుకీ దుర్గతి పట్టింది..?? ఎన్నికల వేళ పార్టీ ని సరైన పంథాలో నడిపించే నాథుడు లేక ఎందుకు విలాలలాడుతోంది..??  రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రాంతీయ పార్టీగానైనా నిలబడుతుందా..?? నాలుగు దశాబ్దాల కిందట 400 పై చిలుకు స్థానాలతో ప్రత్యర్థులను గడగడ లాడించిన పార్టీ నేడు కనీస సీట్లు అయినా సాధించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది?? ఇవన్నీ  సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే..

పతనం దిశగా..
వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. కాంగ్రెస్ పఠనం వెనుక కఠోర సత్యాలు కూడా దాచిపెట్టేవి ఏమీ కాదు. పార్టీ ప్రస్తుత దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం స్వయంకృతమేనని చెప్పుకోవాలి. నెహ్రు, ఇందిర, రాజీవ్‌ల హయాం తర్వాత పార్టీ మసకబారడం మొదలైంది. రాజీవ్ మరణానంతరం  సోనియా అధికార విముఖతతో ప్రధాని పదవిని చేపట్టిన పీవీ.. మన్మోహన్ సాయంతో దేశాన్ని సంస్కరణల బాట అయితే పట్టించగలిగారు కానీ పార్టీకి అవసరమైన శక్తియుక్తులు నింపడంలో మాత్రం తన చాణక్య నీతిని ప్రదర్శించలేక పొయారనే చెప్పొచ్చు. కారణం  పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు. అదీగాక పీవీ హయాంలోనే వెలుగు చూసిన హర్షద్ మెహతా కుంభకోణం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది.

ఫలితంగా తొలిసారి వాజపేయి  దేశ ప్రధాని అయ్యారు. ఇక 2004 ఎన్నికల్లో ‘ఇండియా షైనింగ్‘ నినాదంతో ఎన్డీయే కూటమి బలమైన ప్రభావాన్నే చూపినప్పటికీ గుజరాత్ మత కల్లోలాలు  ఆ కూటమిని కాదని యూపీఏ (ఇప్పటి ఇండియా కూటమి) కూటమికి అధికార పగ్గాలు అప్పగించాయి. మన్మోహన్ ప్రధాని అయ్యారు. దశాబ్ద కాలం పాటు రెండు విడతల్లోనూ ప్రధాని అయితే కాగలిగారు కానీ.. మౌన మునిగా ముద్రపడటం.. కర్త, కర్మ, క్రియ అంతా సోనియారాహుల్ లే అయ్యి ముందుకు నడిపించడం ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తికి ఆస్కారం కలిగించింది. దీంతో రానురానూ పార్టీ  ప్రాభవం అడుగంటుతూ వచ్చింది.

మన్మోహన్ రెండో విడతలో రకరకాల స్కాములు వెలుగు చూడటం, ధరల నియంత్రణ లేకపోవడం, నిరుద్యోగిత రేటు పెచ్చుమీరడం, పార్టీ నాయకుల్లో పొరపొచ్చాలు ప్రతిస్థను అథఃపాతాళానికి దిగజార్చేశాయి. ఎన్డీయే కూటమి ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. మోదీని తెరపైకి తెచ్చింది.. పగ్గాలు దక్కించుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎదురేలేకుండా దూసుకుపోతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 51 సీట్లు గెలుచుకోగా.. యూపీఏ కూటమి కేవలం 91 సీట్లతో, అది కూడా కేవలం 20 శాతం ఓటు  బ్యాంకు తో  సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే పార్టీ ఏ స్థాయికి  పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

అక్కరకు రాని అన్నా చెల్లెల్లు 
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతోనే యూపీఏకు నూకలు చెల్లడం మొదలైనట్లేనని భావించొచ్చు. ఇంటి పెద్దగా సోనియా పైపైన పెద్దరికం వహిస్తున్నా.. మోదీ, అమిత్ షాల ద్వయాన్ని ఎదుర్కొనే దీటైన నాయకుడ్ని తీర్చిదిద్ద లేకపోవడం కాంగ్రెస్ పార్టీని  వేధిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఇందుకు రాహుల్, ప్రియాంకల ఉదంతాలే ఓ పెద్ద ఉదాహరణ. పదేళ్ల కిందట ప్రజల్లోని అసంతృప్తి సెగలతో అధికార పీఠాన్ని వదులుకున్న కాంగ్రెస్ కూటమి తర్వాతి తరుణంలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేక పోయింది. పార్టీకి రాహుల్, ప్రియాంకల రూపంలో యువ నాయకత్వం అందుబాటులో ఉన్నప్పటికీ  సద్వినియోగం చేసుకోవడంలో పార్టీ విఫలమైంది.

యువ నాయకునిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీకి మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిపించలేకపోయాడు రాహుల్.. అంచెలంచెలుగా నాయకునిగా ఎదగాల్సిన చోట తనవల్ల కాదంటూ పార్టీ అధికార బాధ్యతలకు ఆమడ దూరం వెళ్లిపోయాడు ఆయన.. ఒక నెహ్రు, ఇందిరా, రాజీవ్‌ల వంశీకుడైనా ఆ లక్షణాలు పుణికిపుచ్చుకోలేక పోవడం రాహుల్ ప్రధాన వైఫల్యంగా భావించొచ్చు.

ఇక అప్పట్లో ఇందిరమ్మ డైనమిజంతో పోలుస్తూ ప్రియాంకను రంగంలోకి దింపేందుకు శతవిధాలా ప్రయత్నించింది కాంగ్రెస్ కోటరీ. వ్యక్తిగత సమస్యలో, అనుకోని అవాంతారాలో కానీ ఆ యత్నాలేవీ ఫలించలేదు. ఆమె తన ప్రాబల్యాన్ని చూపించి ఉంటే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మరింత రసవత్తరంగా మారేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అడపాదడపా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు అక్కడకు వెళ్లి ప్రచార సభల్లో మొహం చూపించి పోవడం తప్ప ప్రజల్లో బలమైన ముద్ర వేయలేకపోయింది ప్రియాంక. కాంగ్రెస్ అంటేనే నెహ్రు వారసులుగా భావించే ప్రజానీకంలో అన్నా చెల్లెళ్ళ వెనకడుగు ఆ పార్టీని మరింత బలహీనంగా మార్చేస్తోంది. పార్టీ బాధ్యతలు ఖర్గే  చేతుల్లో పెట్టినా.. ఈయన పాత్ర మరో మన్మోహన్ మాదిరిగానే ఉండొచ్చన్న అభిప్రాయం ప్రజల్లో గూడు కట్టుకుపోవడం పెద్ద మైనస్‌గా భావించొచ్చు. ఈ  నేపథ్యంలో ప్రజలు యే ధీమాతో ఇండియా కూటమికి ఓటు వేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న

మిత్రులే కానీ.... తలో దారి..
ఎన్నికలు  కూతవేటు దూరంలో ఉన్న ప్రస్తుత తరుణంలో విబేధాలను పరిష్కరించుకుని కలిసికట్టుగా సాగాల్సింది పోయి కాంగ్రెస్ మిత్ర గణం చెరో దారీ వెతుక్కుంటూంటే ఇదే అదనుగా ఎన్డీయే పక్షం బలం పెంచుకుంటూ పోతోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇటీవలి బీహార్ పరిణామాల గురించే. కాంగ్రెస్ సాయంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జనతాదళ్ (యూ) అధినేత నితీష్ కుమార్ తాజాగా ఇచ్చిన ఝలక్ బీహార్ రాజకీయాల్లో పెను సంచలనమే అయింది.

ఈ విషయాన్ని ముందస్తు పసిగట్టడంలో కాంగ్రెస్ అధిష్ఠానం విఫలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క పంజాబ్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌లు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మొన్నీ మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిష్ఠ వేసుకుని కూర్చుంది. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, హర్యానా, గుజరాత్‌లలో పెత్తనం ఎటూ బీజేపీదే, కర్ణాటకలో తమ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ, హామీల విషయంలో అక్కడి ప్రభుత్వ వైఖరి అయోమయంలో పడేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే ముందు నోరు మెదిపి పరిస్థితి ఎటూ లేదు. 

కళ్లు తెరవకపోతే..
2019 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటిదాకా పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఖర్గే పేరుతో తెచ్చిన దళిత కార్డు ప్రభావం నామమాత్రమేనని చెప్పొచ్చు. ఇక పార్టీకి ఏకైక ఆశాకిరణం రాహుల్ గాంధీయే. ఆయన  నేతృత్వం తక్షణ అవసరం.. పరిస్థితి తీవ్రత  గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా  ఓటర్లలో ఓ కొత్త నమ్మకాన్ని,  ప్రశ్నిచే గళం ఒకటి ఉండనే ధీమాను కలిగించాలి. సరైన రీతిలో పావులు కదిపి మోదీ సర్కారుకు సవాలు విసిరేలా పార్టీ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయగలగాలి.

సహజంగా అధికార పార్టీలపై ఉండే అసంతృప్తి సెగల్ని సొమ్ము చేసుకుని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోఎలాగైతే అధికారాన్ని అందిపుచ్చుకోగలిగారో.. అదే మాదిరి ప్రయత్నాలు  అన్నిచోట్లా చేయాలి. 70 ఏళ్లు పైబడిన వృద్ధ నాయకులను గౌరవ పదవులకు పరిమితం చేస్తూ.. వాళ్ళ సలహాలు, సూచనలతో యువ రక్తాన్ని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాలి. మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలను వెతికి పట్టుకుని ఎన్నికల పోరుకు సిద్ధమవ్వాలి.

అప్పుడే సార్వత్రిక రణం హోరాహోరీగా సాగే అవకాశం ఉంటుంది. బహుశా ప్రస్తుతానికి సమయం మించిపోయిందనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లోనైనా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకునే చర్యల ద్వారా ఆయా రాష్ట్రాల్లో బలం పుంజుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తే 2029లోనైనా మళ్లీ కేంద్రంలో కొలువుదీరే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ప్రజలకు భరోసా కల్పించనంత వరకు ఎన్ని జోడో యాత్రలు చేపట్టినా అవన్నీ కంటితుడుపు చర్యలుగా మిగిలిపోతాయే తప్ప  అధికారాన్ని మాత్రం అందించవు.  ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే సరే...  లేదంటే ముందే చెప్పినట్లు ఒక  చిన్న గాలివాన చాలు.. కాంగ్రెస్ అనే మహావృక్షం కూకటివేళ్లతో సహా కూలిపోవడానికి. 

తెలంగాణను చూసి మురిసిపోతే..
రెండు నెలల కిందటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ అది సంబరపడేటంత మురిపెమేమీ కాదు. అదే సమయంలో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్లలో ఓడిపోయింది అన్న విషయాన్ని విస్మరించలేం. జోడో యాత్రలో, కాంగ్రెస్‌పై పెరిగిన మమకారమే తెలంగాణాలో ఆధికారాన్ని తెచ్చిపెట్టలేదు. స్థానిక పరిస్థితులు, కేసీఆర్ సర్కారుపై పెల్లుబికిన అసంతృప్తి అధికార మార్పు జరిగేలా చేశాయి. సాధారణంగా రెండు దఫాలు అధికారంలో కూర్చున్న ఏ పార్టీకైనా ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉండటం సహజం. దీనికి నిదర్శనం ఉభయ పక్షాల మధ్య ఉన్న గెలుపు ఓటముల అంతరాలే.

భారాసా స్వయంకృత చేష్టలు ఆ పార్టీని 39 సీట్లకే పరిమితం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 సీట్ల బొటాబొటీ మెజార్టీతో అధికార పీఠాన్ని అప్పగించాయి.  ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  భట్టి లాంటి వాళ్ళ ప్రయత్నాలు, 6 గ్యారంటీల పథకాలు తమవంతు సాయం అందించాయి. మరోపక్క కాంగ్రెస్ గ్యారంటీలు అమలులో ఎంత ఇబ్బందికరమో అనుభవైక వేద్యమవుతోంది. ఇలాంటి హామీలు, యాత్రలను నమ్ముకుని కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకుందాం అనుకోవడం కల్లే  అవుతుంది.

అదే సమయంలో పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో అన్నపై చెల్లెలి అస్త్రాన్ని ప్రయోగించినా ప్రయోజనం శూన్యమే. ఇటీవల ఇండియాటుడే సమ్మిట్‌లో ఆంధ్ర ముఖ్యమంతి జగన్‌మోహన్‌రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ వైస్సార్సీపీ, టీడీపీ, జనసేనల మధ్యే ఉంటుందని, తన చెల్లెలి చేరిక తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోదని తేల్చిపడేశారు కూడా.. వాస్తవానికి ఆయన చెప్పింది అసెంబ్లీ ఎన్నికల గురించే అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకూ  ఇది వర్తిస్తుందని చెప్పొచ్చు.
-బెహరా శ్రీనివాస రావు
సీనియర్ పాత్రికేయులు 

ఇదీ చదవండి: కొంప ముంచే డైరీలు..! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement