ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈ వారంలోనూ బలహీనంగా ట్రేడవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా ఆర్‌బీఐ ద్రవ్య విధాన వైఖరి, స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ఒడిదుడుకులు ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి కదలికలు, ప్రపంచ మార్కెట్ల పనితీరు, క్రూడాయిల్ ధరల కదిలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు.
గాంధీ జయంతి సందర్భంగా నేడు ఎక్స్చేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. బాండ్లపై దిగుబడులు, క్రూడాయిల్ ధరల పెరుగుదల ఆందోళనలతో గతవారం మొత్తంగా సెన్సెక్స్ 181 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయాయి. ‘‘చారిత్రాత్మకంగా పరిశీలిస్తే అమెరికా, భారత మార్కెట్లు అక్టోబర్‌లో ర్యాలీ చేసాయి.
ఈసారి అదే ట్రెండ్ పునరావృతమయ్యే అవకాశం ఉంది. అందుకు సంకేతంగా ఇటీవల ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతీస్తున్న బాండ్ల ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరల పెరుగుదల ఆందోళనలు క్రమంగా తగ్గుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ ఎగువున 19,800 వద్ద కీలక నిరోధం ఉంది. దిగువ స్థాయిలో 19,600 – 19,500 పరిధిలో తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ నిర్ణయం కీలకం
రిజర్వ్ బ్యాంక్ తన పరపతి ద్రవ్య సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించనుంది. ఆర్‌బీఐ చైర్మన్ శక్తికాంత దాస్ శుక్రవారం పాలసీ కమిటి నిర్ణయాలు వెల్లడించనున్నారు. వరసగా నాలుగోసారి వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే ఆర్‌బీఐ మొగ్గుచూపొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణ గరిష్ట స్థాయిలో ఉండటం, ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య పాలసీ వైఖరిని కొనసాగించడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.
స్థూల ఆర్థిక గణాంకాలు
ఆటో కంపెనీలు విడుదల చేసిన సెప్టెంబర్ వాహన విక్రయ గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇదే వారంలో అక్టోబర్ 3న తయారీ రంగ పీఎంఐ, సెప్టెంబర్ 5న సేవారంగ డేటా విడుదల కానుంది. అమెరికా యూఎస్ తయారీ, సేవా రంగ డేటాతో పాటు వాణిజ్య, ఉద్యోగ కల్పన డేటా ఇదే వారంలో వెల్లడి కానుంది. బ్రిటన్ తయారీ, సేవా రంగ సీఐపీఎస్ డేటా గణాంకాలు విడుదల కానున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.
ప్రాథమిక మార్కెట్‌పై కన్ను
మనోజ్ వైభవ్ జెమ్స్ ‘ఎన్’ జ్యువెలరీŠస్ స్టాక్ లిస్టింగ్ మంగళవారం ఉంది. అదే రోజున వాలియంట్ ల్యాబొరేటరీస్ ఐపీఓ ముగిస్తుంది. జేఎస్‌డబ్ల్యూ లిస్టింగ్ సెప్టెంబర్ 4న ఉంది. ఈ మరుసటి రోజు గురవారం ప్లాజా వైర్స్ పబ్లిక్ ఇష్యూ ముగుస్తుంది.
ఆరు నెలల తర్వాత అమ్మకాలు
ఆరు నెలల వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో నికర అమ్మకందారులుగా నిలిచారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఈ సెప్టెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 14,767 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. డెట్ మార్కెట్లో రూ. 938 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దేశ ఆర్థికవ్యవస్థ, ఆర్‌బీఐ అక్టోబర్ ఎంపీసీ సమావేశం, సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎఫ్‌పీఐల ధోరణి అనిశ్చితిగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment