స్టాక్‌ సూచీలు లాభాల్లో కొనసాగే అవకాశం - కారణం ఇదేనా? | Stock Markets Likely to Continue Their Gains | Sakshi
Sakshi News home page

స్టాక్‌ సూచీలు లాభాల్లో కొనసాగే అవకాశం - కారణం ఇదేనా?

Published Mon, Oct 16 2023 7:39 AM | Last Updated on Mon, Oct 16 2023 7:39 AM

Stock Markets Likely to Continue Their Gains - Sakshi

ముంబై: స్టాక్‌ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్‌ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియా ఘర్షణలు, క్రూడాయిల్‌ ధరలు, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్‌ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు.

సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్‌ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్‌ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి.

కార్పొరేట్‌ ఫలితాలు కీలకం
మార్కెట్‌ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్‌ మార్ట్‌(డీ మార్ట్‌)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్‌ ఫైనా న్స్, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్‌ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్‌ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్‌ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు.  

ప్రపంచ పరిణామాలు
ఇజ్రాయెల్‌ - పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ గురువారం ‘ది ఎకనామిక్‌ క్లబ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్‌ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్‌ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్‌ సెప్టెంబర్‌ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్‌ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు.

ప్రథమార్థంలో రూ. 9,800 కోట్లు ఉపసంహరణ
విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్‌– హమాస్‌ వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఇందుకు కారణమయ్యాయి. సెప్టెంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు.

ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్‌ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్‌ గూడ్స్‌ ఆటోమొబైల్స్‌ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్‌ మార్కెట్‌లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement