ప్రభావిత అంశాలు
* చివరిబ్యాచ్ త్రైమాసిక ఫలితాలు
* రుతుపవనాల గమనం
* ఆటో కంపెనీల అమ్మకాల గణాంకాలు
* రూపాయి కదలికలు
ముంబై: త్వరలో విడుదలయ్యే జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయ ట్రెండ్‌పై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అలాగే చివరిబ్యాచ్ త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల గమనం తదితర అంశాలు కూడా దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని వారన్నారు.
2016 జనవరి-మార్చి త్రైమాసికానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఈ మంగళవారం వెలువడతాయి. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) తీరుతెన్నులు, ద్రవ్యలోటు పరిస్థితి, ఎనిమిది మూలధాన పరిశ్రమల డేటా కూడా ఈ వారం ప్రకటితమవుతాయని, ఇవన్నీ కూడా మార్కెట్‌ను హెచ్చుతగ్గులకు గురిచేస్తుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. జూన్ 1న వెలువడే ఆటోమొబైల్ కంపెనీల మే నెల అమ్మకాల డేటా ఆయా షేర్లను హెచ్చు తగ్గులకు లోనుచేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, మహింద్రా అరబిందో వంటి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు ఈ వారమే వెలువడనున్నాయి. చివరిబ్యాచ్ కార్పొరేట్ ఫలితాలు, రూపాయి కదలికలు, ముడిచమురు ధర తదితరాల్ని ఇన్వెస్టర్లు రానున్నరోజుల్లో నిశితంగా గమనిస్తారని అంచనా.
ఫెడ్ నిర్ణయం కీలకం...
వడ్డీ రేట్లను క్రమేపీ పెంచుతామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఛైర్‌పర్సన్ జెనెట్ యెలెన్ గత శుక్రవారం ఇచ్చిన సంకేతాలకు ఈ సోమవారం ఇన్వెస్టర్ల స్పందనతో మార్కెట్ మొదలవుతుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.
గతవారం మార్కెట్...
గతవారం సెన్సెక్స్ 1,351 పాయింట్ల పెరుగుదలతో 26,653 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 407 పాయింట్లు ఎగిసి 8,157 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మార్చి 4 తర్వాత ఒకే వారంలో సూచీలు ఇంత అధికంగా పెరగడం ఇదే తొలిసారి. మే నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత స్టాక్ మార్కెట్లో రూ. 1,495 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. అయితే ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి రూ. 6,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. రూపాయి బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలతో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు విక్రయాలు జరిపినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
జీడీపీ డేటా, గ్లోబల్ ట్రెండ్‌పై దృష్టి
Published Mon, May 30 2016 3:45 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM
Advertisement
Advertisement