చిత్తశుద్ధితో ఆర్థిక సంస్కరణలు
ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత సరళీకృతం
• ప్రపంచానికే భారత్ ఓ ఆశాకిరణం
• వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన
గాంధీనగర్: భారత దేశంలో ఆర్థిక సంస్కరణలను కొనసాగించటంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గాంధీనగర్‌లో ద్వైవార్షిక వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సీఈవోలనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘వ్యాపారానికి అనువైన వాతావరణం ఏర్పాటుచేయటం, పెట్టుబడులను ఆకర్షించటం మా ప్రధాన బాధ్యత’ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రభుత్వం నిర్విరామ కృషి, జీడీపీ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక సూచికల్లో స్థిరమైన వృద్ధితోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కారణంగా భారత్ ఇప్పటికే వ్యాపారానుకూల దేశంగా ముద్ర వేసుకుందన్నారు.
రాజకీయ, వ్యాపార ప్రముఖులతో భేటీ
సదస్సుకు ముందు ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలు, వ్యాపార ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రువాండా అధ్యక్షుడు పాల్ కగామే, సెర్బియా ప్రధాని అలెగ్జాండర్ తదితర రాజకీయ ప్రముఖులతోపాటు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, వ్యాపార వేత్తలతోనూ భేటీ అయ్యారు. రువాండా, భారత్ సంబంధాలతోపాటు ఫోరెన్సిక్ సైన్స్‌లో సహకారం, అంతర్జాతీయ సౌరశక్తి కూటమి లో చేరేందుకు రువాండా అంగీకారం అంశాలపై ఒప్పందపత్రాలపై సంతకాలు చేసుకున్నారు. జపాన్ కంపెనీల ప్రతినిధులతో కలిసి వచ్చిన ఆ దేశ ఆర్థిక మంత్రి సీకో హిరిషోగి మోదీని కలిశారు. డెన్మార్ మంత్రి లార్స్ క్రిస్టియన్, ఇజ్రాయిల్, స్వీడన్, యూఏఈ మంత్రులతోనూ ప్రధాని భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్లో పేర్కొంది.
డెన్మార్క్ మంత్రితో సమావేశం సందర్భంగా ‘పురూలియా ఆయుధ డీలర్ కిమ్ డేవీపై రాజద్రోహం కేసు వేయటంపై డెన్మార్క్ సహకారం ఉంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు’ అని పీఎంవో ట్విటర్లో పేర్కొంది. వివిధ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో సిస్కో సిస్టమ్స్ చైర్మన్ జాన్ థామస్, ఫ్రెంచ్ విద్యుత్ కంపెనీ ఈడీఎఫ్ సీఈవోతో పాలు పలువురు ప్రముఖుల పాల్గొన్నారు.
ప్రపంచాభివృద్ధికి ఇంజన్ భారతే..
‘ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనా భారత్ తట్టుకుని నిలబడగలిగింది. అందుకే ప్రపంచంలో ఓ ఆకర్షణీయమైన దేశంగా భారత్ పేరు సంపాదించుకుంది. ప్రపంచాభివృద్ధికి మమ్మల్ని ఓ ఇంజన్‌లాగా (ముందుండి నడిపే వాడిలా) చూస్తున్నారు’ అని మోదీ తెలిపారు. వ్యాపారానుకూల దేశంగా భారత్‌ను నడిపించే దిశలో.. లైసెన్సింగ్ విధానాన్ని, నిబంధనలను సరళీకృతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు.
‘మా సుపరిపాలన వాగ్దానం ప్రకారం మేం వివిధ రంగాల్లో వందల రకాల కార్యాచరణను అమలుచేస్తున్నాం. రోజు రోజుకూ మా విధానాలను, పద్ధతులను హేతుబద్ధీకరించుకుంటున్నాం. వివిధ రంగాల్లో వేర్వేరు పద్ధతుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్నీ సరళీకరించాం’ అని మోదీ వెల్లడించారు. మే 2014 నుంచి దేశంలో 130 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.87 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయని.. మేకిన్ ఇండియాపై విదేశీ కంపెనీలకున్న నమ్మకానికి ఇదో నిదర్శనమన్నారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువ ఎఫ్‌డీఐలు అందుకుంటున్న దేశం కూడా భారతేనని స్పష్టం చేశారు.