స్టార్టప్స్లోకి మరిన్ని ఎఫ్డీఐలు!
• నిబంధనలను సడలించిన ఆర్‌బీఐ
• ఎఫ్‌వీసీఐలకు అడ్డంకుల తొలగింపు
• మరిన్ని ఆర్థిక సేవల్లో 100% ఎఫ్‌డీఐలకూ వీలు
ముంబై: ప్రభుత్వం, విధాన నిర్ణేతలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న స్టార్టప్స్‌లోకి మరింతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం లక్ష్యంగా నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం సడలించింది. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) మరింతగా ఆకర్షించడం, అలాగే విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) విధానాలను సరళతరం లక్ష్యంగాసైతం నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీనిప్రకారం..
స్టార్టప్స్‌కు ఎఫ్‌వీసీఐల బాసట..
ఇకపై ఫారిన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌వీసీఐ) ఆర్‌బీఐ ముందస్తు అనుమతి లేకుండా భారత్ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టే వీలుంది. సెబీ వద్ద రిజిస్టరయిన ఎఫ్‌వీసీఐలు బయోటెక్నాలజీ, నానో-టెక్నాలజీ, డెయిరీ, పౌల్ట్రీ, బయో ఫ్యూయెల్స్ ఉత్పత్తి, హోటల్స్ కమ్ కన్వెన్షన్ సెంటర్లు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, విత్తన పరిశోధనా-అభివృద్ధి వంటి అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఆర్‌బీఐ అనుమతి లేకుండా ఎఫ్‌వీసీఐలు పెట్టుబడులు పెట్టే వీలుంది.
ఆయా రంగాలకు సంబంధించి ఒక ఇండియన్ స్టార్టప్స్ జారీ చేసిన ఈక్విటీ లేదా ఈక్విటీ ఆధారిత ఇన్‌స్ట్రమెంట్ లేదా డెట్ ఇన్‌స్ట్‌మ్రెంట్‌లో ఎఫ్‌వీసీఐలు పెట్టుబడులు పెట్టవచ్చు. లావాదేవీల నిర్వహణకు ఎఫ్‌వీసీఐలు ఫారిన్ కరెన్సీ అకౌంట్ లేదా రూపీ అకౌంట్ ప్రారంభించవచ్చు. ఎఫ్‌వీసీఐ కలిగిఉన్న ఎటువంటి సెక్యూరిటీ లేదా ఇన్‌స్ట్రమెంట్‌నైనా దేశ, విదేశాల్లో వ్యక్తులకు బదలాయించడానికి సైతం ఎటువంటి ఇబ్బందీ ఉండబోదు.
మరిన్ని ఆర్థిక సేవల్లో 100 శాతం ఎఫ్‌డీఐలు
రెగ్యులేటర్ల ఆమోదాలకు లోబడి మరిన్ని ఫైనాన్షియల్ సేవల్లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినిస్తూ (ఎఫ్‌డీఐ) ఆర్‌బీఐ గురువారం ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ సంస్కరణల అంశాలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 బడ్జెట్‌లో వివరించారు. మర్చెంట్ బ్యాంకింగ్, అండర్ రైటింగ్, పోర్టిఫోలియో మేనేజ్‌మెంట్ సేవలు, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అండ్ స్టాక్ బ్రోకింగ్‌సహా 18 నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) కార్యకలాపాల్లో ఆటోమేటిక్ రూట్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ప్రస్తుతం అనుమతి ఉంది. ఎన్‌బీఎఫ్‌సీలు నిర్వహించే ‘ఇతర ఫైనాన్షియల్ సేవల్లో’ 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇస్తున్నట్లు నోటిఫికేషన్ తెలిపింది. ఇది దేశంలోకి మరింత మొత్తంలో ఎఫ్‌డీఐలను ఆకర్షించడానికి దోహదపడే అంశం.
ఈసీబీల విషయంలో బ్యాంకులకు అధికారాలు...
ఇకపై ఏ రుణ గ్రహీత అయినా ఈసీబీ కాలవ్యవధి (టెన్యూర్) సమయంలో రుణ రీపేమెంట్ షెడ్యూల్ మార్పును కోరితే, దానిని బ్యాంకులు నేరుగా ఆమోదించే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రుణాన్ని ఈక్విటీల్లోకి మార్చడానికి అధికారాలనూ బ్యాంకులకు బదిలీ చేసింది. కొన్ని ప్రమాణాలకు లోబడి బ్యాంకులు ఆయా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ బ్రాంచీలు లేక అనుబంధ సంస్థలు భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రుణ సదుపాయం పొందిన ఈసీబీ రుణ గ్రహీత విషయంలో చెల్లించని ఈసీబీ రీపేమెంట్ షెడ్యూల్ మార్పు, లేదా ఈక్విటీల్లోకి బదలాయింపు వంటి అంశాల విషయంలో నిర్దిష్ట, పారదర్శక ప్రమాణాలను పాటించాలని తాజా నోటిఫికేషన్‌లో రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు స్పష్టం చేసింది.
మరికొన్ని విశేషాలు చూస్తే...
⇔ అంతర్జాతీయ అంశాలపై సమీక్ష: గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో గురువారం జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం- దేశీయ, అంతర్జాతీయ అంశాలపై సమీక్ష నిర్వహించింది. కేంద్రం ఆర్థికశాఖ ఉన్నతాధికారులూ సమావేశంలో పాల్గొన్నారు.
⇔ ట్రేడ్ లావాదేవీలపై ఆంక్షలు: రూపీ డ్రాయింగ్ ఎరేంజ్‌మెంట్స్ కింద ట్రేడ్ లావాదేవీలకు సంబంధించి లావాదేవీకి రూ.15 లక్షలు దాటరాదు. ప్రభుత్వం-ఆర్‌బీఐ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
⇔ క్రెడిట్ అగ్రికోల్‌పై జరిమానా: సేవల విషయంలో నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను క్రెడిట్ అగ్రికోల్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఇండియా)పై రూ.కోటి జరిమానాను విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.