విదేశీ పెట్టుబడులే కీలకం... | With budget week behind, markets look to RBI for out-of-turn | Sakshi
Sakshi News home page

విదేశీ పెట్టుబడులే కీలకం...

Published Mon, Mar 7 2016 12:19 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

విదేశీ పెట్టుబడులే కీలకం... - Sakshi

విదేశీ పెట్టుబడులే కీలకం...

పెరుగుతున్న ఆర్‌బీఐ రేట్ల కోత అంచనాలు
* రూపాయి, ముడి చమురు ధరల కదలికలూ ముఖ్యమే
* ఈ వారం మార్కెట్ గమనంపై విశ్లేషకుల అభిప్రాయం

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ కీలక రేట్ల తగ్గింపు అవకాశాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై ప్రధానంగా ప్రభా వం చూపనున్నాయి. వీటితో పాటు  డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల గమనం,  శుక్రవారం వెలువడే  జనవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు,.. ఈ అంశాలన్నీ తగిన ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నేడు (సోమవారం) సెలవు కారణంగా ఈ వారంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది.
 
అందరి కళ్లూ ఆర్‌బీఐ పైనే...
ఆర్‌బీఐ రేట్ల కోత అవకాశాలు మార్కెట్లో ఒకింత ఒడిదుడుకులకు కారణమవుతాయని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.5 శాతానికే కట్టడి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించడం వల్ల ఆర్‌బీఐ కీలక రేట్లలో కోత కోయవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. దేశీయంగా మరే ప్రధాన సంఘటన ఏదీ లేనందున అందరి కళ్లు ఆర్‌బీఐ మీదనే ఉన్నాయని వివరించారు.  ఫిబ్రవరిలో వచ్చిన నష్టాలన్నీ భర్తీ అయ్యేలా బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తోందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు జరపడం కూడా కలసివస్తోందన్నారు.
 
క్యూ4 ఫలితాల ప్రభావం...
ఇక బడ్జెట్ ముగిసినందున  కంపెనీలు వెల్లడించే జనవరి-మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలపైననే అందరూ దృష్టి సారిస్తారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. జీఎస్‌టీ వంటి కీలక బిల్లుల కారణంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కూడా ఇన్వెస్టర్లు గమనంలోకి తీసుకుంటారని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ తక్షణం ఆర్‌బీఐ నుంచి రేట్ల కోతను ఆశిస్తోందని వివరించారు. దీని తర్వాత కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, వర్షాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, సంస్కరణల అమలు... ఈ అంశాలన్నీ సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
 
ఏడేళ్లలో అత్యుత్తమ లాభాల వారం..
గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,492 పాయింట్లు(6.4 శాతం) లాభపడి 24,646 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ పాయింట్లు(6.5 శాతం) లాభపడి 7,485 పాయింట్ల వద్ద ముగిశాయి. పాయింట్ల పరంగా చూస్తే స్టాక్ సూచీలకు ఇవి ఏడేళ్లలో అత్యుత్తమ లాభాలు కాగా, పర్సంటేజ్ పరంగా చూస్తే ఇవి నాలుగేళ్లలో అత్యుత్తమ లాభాలు.
 
విదేశీ కొనుగోళ్ల జోరు..
ఈ నెల తొలి 4 ట్రేడింగ్ సెషన్లలోనే భారత స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 4,100 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఆర్‌బీఐ రేట్ల కోత అంచనాలు, సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. కాగా ఈ 4 రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు డెట్  మార్కెట్ నుంచి రూ.746 కోట్లు నికరంగా ఉపసంహరించుకున్నారు. ఇతర వర్ధ మాన దేశాలతో పోల్చితే మన దేశం పటిష్టంగా ఉందని, అందుకే విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఫండమెంటల్ రీసెర్చ్ వినోద నాయర్ చెప్పారు.

అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా పెరుగుతుండడం, బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉండడం కూడా కలసివచ్చిందని వివరించారు.  కాగా ముడిచమురు ధరల పతనం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన వంటి అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు  స్టాక్ మార్కెట్ నుంచి ఈ ఏడాది జనవరిలో రూ.11,126 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,521 కోట్లు వెరసి ఈ రెండు నెలల్లో రూ.16,648 కోట్ల నిధులు వెనక్కి తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement