
ఎఫ్‌డీఐల చిరునామా భారత్
విదేశీ పెట్టుబడిదారులకు భారత్ స్వర్గధామమని మరోసారి రుజువయింది.
⇔ గరిష్ట స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం
⇔ 2016లో రూ.3.99 లక్షల కోట్లు రాక
⇔ చైనా, అమెరికాలు తర్వాతి స్థానాల్లో
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడిదారులకు భారత్ స్వర్గధామమని మరోసారి రుజువయింది. ప్రపంచంలో అత్యధికంగా విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షిస్తున్న దేశంగా భారత్ వరుసగా రెండో ఏడాదీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2016వ సంవత్సరంలో 62.3 బిలియన్ డాలర్ల (రూ.3.99 లక్షల కోట్లు సుమారు) ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. ఫైనాన్షియల్ టైమ్స్‌కు చెందిన ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్స్ విభాగం ‘ఎఫ్‌డీఐ 2017’ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం ఎఫ్‌డీలను రాబట్టడంలో చైనా, అమెరికాలు భారత్ వెనుకనే నిలిచాయి. 2016లో మొత్తం 809 ప్రాజెక్టుల్లోకి క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో 62.3 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్టు ఈ నివేదిక వెల్లడించింది.
గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా భారత్ వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నదని , చైనా అమెరికాల కంటే ముందు నిలిచిందని నివేదిక స్పష్టం చేసింది. 2016లో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడుల సరళి మార్పునకు లోనైందని... బలమైన ఆర్థిక వృద్ధికి అవకాశం ఉన్న దేశాలకు ఎఫ్‌డీఐలు ఎక్కువ శాతం తరలి వెళ్లాయని నివేదికను రూపొందించిన ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్స్ తెలిపింది. సంక్షోభం, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశాల్లో ఎఫ్‌డీఐలు తగ్గుముఖం పట్టినట్టు వివరించింది.
అంతర్జాతీయంగానూ మెరుగే
2016లో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ ఎఫ్‌డీఐ మొత్తం మీద 6 శాతం పెరిగి 776.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2011 తర్వాత ఈ స్థాయిలో ఎఫ్‌డీఐ నమోదు కావడం తిరిగి ఇదేనని ఈ నివేదిక ప్రముఖంగా పేర్కొంది. 5 శాతం అధికంగా 20 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడ్డాయి. ఇక పొరుగు దేశం చైనా ఎఫ్‌డీల విషయంలో అమెరికాను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. 2016లో 59 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.
అగ్రరాజ్యం అమెరికా 48 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలతో ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా చూస్తే ఎఫ్‌డీఐలను ఎక్కువగా ఆకర్షించిన రంగం రియల్‌ఎస్టేట్. 2016లో 157.5 బిలియన్ డాలర్లు ఈ రంగంలోకి వచ్చాయి. ఇది అంతకుముందు ఏడాది కంటే 58 శాతం అధికం. బొగ్గు, సహజవాయువుల రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 121 బిలియన్ డాలర్లు. ప్రత్యామ్నాయ, సంప్రదాయేతర ఇంధన రంగంలోకి 77 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.