
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సర్కార్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధలను సడలించింది. దీంతో అమెరికా, చైనా టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. ప్రధానంగా భారత వినియోగదారులకు విలాసవంతమైన ఆపిల్ ఫోన్లపై ఉన్న మోజు ఎక్కువే. తాజాగా ఎఫ్‌డీఐ నిబంధనల సవరణల నేపథ్యంలో ఇకమీద ఆపిల్ ఉత్పత్తులు తక్కువ ధరలకే కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ఆపిల్ లాంటి కంపెనీలు సొంత ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకాలు చేపట్టే వెసులు బాటు లభించనుంది. ఆపిల్ కంపెనీ, ఐ ఫోన్లు, వాచ్‌లు, మాక్‌బుక్స్, ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు ఇప్పటి వరకు థర్డ్‌పార్టీ సంస్థలపై ఆధారపడిన సంగతి తెలిసిందే. కానీ, సింగిల్ బ్రాండ్ రిటైల్ వాణిజ్యంలో ప్రభుత్వం ఇటీవల ఎఫ్‌డీఐ నిబంధనల్ని సరళతరం చేసిన నేపథ్యంలో ఆపిల్ భారత మార్కెట్లోకి దూసుకు రానుంది.
విదేశీ కంపెనీలకు 30 శాతం ప్రొడక్ట్‌లను ఇక్కడే తయారు చేయాలనే షరతు విధించింది గతంలో. కానీ భారత ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం దీనికి కొంత సడలింపు ఇచ్చింది. అంటే వార్షికంగా 30 శాతం అనే నిబంధనను సవరించి..ఇకపై ఐదేళ్లకు సగటున 30శాతం సమీకరించినా సరిపోతుందని తెలిపింది. అలాగే ఆన్‌లైన్ విక్రయాలకు కూడా అనుమతినిచ్చింది. ఇంకా, ఐదేళ్ల ఎగుమతులను పరిగణనలోకి తీసుకునే ప్రస్తుత పరిమితిని తొలగించాలని ప్రతిపాదించారు. సింగిల్-బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డిఐ కోసం దరఖాస్తు చేసుకున్న బ్రాండ్లు ఆన్‌లైన్ రిటైల్ సేల్స్‌ను ప్రారంభించవచ్చు. అయితే రెండేళ్లలో ఫిజికల్ స్టోర్‌ను తెరవాల్సి వుంటుంది. ఈ నిర్ణయంతో ఆపిల్‌లాంటి దిగ్గజ కంపెనీలు దేశంలో తమ మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు అవకాశం లభించినట్టే. ఈ క్రమంలోఅతి త్వరలోనే ఆపిల్ భారత్‌లో తన తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించనుందట. దీంతోపాటు వచ్చే ఏడాది నాటికి ఆపిల్ ముంబైలో తన రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా భారతదేశంలో 140 రిటైల్ దుకాణాల ద్వారా తన ఫోన్‌లను విక్రయిస్తున్న ఆపిల్ ఎగుమతుల విషయంలో సుమారు 1.2శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది