
న్యూఢిల్లీ: విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లను ఆకర్షించే దిశగా నిబంధనలను సడలించాలని కేంద్రం యోచిస్తోంది. ఆయా సంస్థలు తప్పనిసరిగా 30 శాతం స్థానికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉంటుందన్న సోర్సింగ్ నిబంధనకు సంబంధించి కాలావధి విషయంలో కొంత వెసులుబాటునివ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను పంపింది. ప్రతిపాదనల ప్రకారం.. యాపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు 200 మిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తెచ్చిన పక్షంలో ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటుకన్నా ముందు ఆన్‌లైన్ స్టోర్స్ ఏర్పాటుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి.
ఆన్‌లైన్ అమ్మకాలు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్లలోగా ఈ సంస్థలు ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు.. ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేసిన తర్వాతే ఆన్‌లైన్ అమ్మకాలు జరిపేందుకు అనుమతిస్తున్నారు. మరోవైపు, పెట్టుబడి పరిమాణాన్ని బట్టి సోర్సింగ్ నిబంధనలను సడలించే అంశం కూడా వాణిజ్య శాఖ ప్రతిపాదనల్లో ఉంది. ప్రస్తుతం అయిదేళ్లుగా ఉన్న కాలవ్యవధిని 6–10 ఏళ్ల దాకా పొడిగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment