పత్రికా రంగంలో ఎఫ్‌డీఐల పెంపులేదట!
న్యూఢిల్లీ : వార్తాపత్రికలు, పీరియాడికల్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 26శాతం నుంచి 49శాతానికి పెంచకూడదని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వార్తలు, కరెంట్ అఫైర్స్ ప్రచురించే వార్తాపత్రికలు, పీరియాడికల్స్ లో ప్రస్తుతమున్న 26 శాతం వరకు ఎఫ్‌డీఐల పరిమితిని అలాగే ఉంచాలని నిర్ణయించింది.
పత్రికా రంగంలోకి ఎఫ్‌డీఐలు రావాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటోంది. ప్రింట్ మీడియా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని పెంచే ప్రతిపాదన చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది. ఆర్థికవ్యవహారాల విభాగం(డీఈఏ) ఈ ప్రతిపాదనను సమీక్షించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ను(డీఐపీపీ) తాజాగా మరోసారి కోరింది.
డీఈఏ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని సమీక్షించిన డీఐపీపీ, పత్రికరంగంలో ఎఫ్‌డీఐ క్యాప్ ను పెంచేందుకు విముఖత వ్యక్తంచేసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత నవంబర్ నుంచి పత్రికారంగంలో ఎఫ్‌డీఐ క్యాప్ ను సడలించే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. ఇటీవల ఎనిమిది రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బార్ల తలుపులు తెరిచిన కేంద్రప్రభుత్వం పత్రికా రంగంలో మాత్రం ఈ పరిమితులను పెంచలేదు.
సివిల్ ఏవియేషన్, డిఫెన్స్, ప్రైవేట్ సెక్యురిటీ ఏజెన్సీలు, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రిలో ప్రభుత్వం ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. విదేశీ ఫండ్స్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ప్రభుత్వం ఇటీవల ఈ నిబంధనలను సడలించినట్టు పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ప్రవేశించిన ఎఫ్ డీఐలు 29శాతం పెరిగి, 40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.