న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ పుంజుకుంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్ట స్థాయులను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.
అలాగే సర్వీసుల ఎగుమతులకు సంబంధించి 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. వెరసి ఇటు వస్తువులు, అటు ఉత్పత్తుల విషయంలో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదు చేయగలమని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో దేశంలోకి 27 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని మంత్రి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 62 శాతం ఎగిశాయని వివరించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందని, లాక్‌డౌన్ విధించిన ప్రతికూల పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ వ్యవస్థకు ఎటువంటి అంతరాయాలూ ఏర్పడకుండా సేవలు అందించిందని మంత్రి చెప్పారు.
దేశ ఎకానమీ వేగంగా కోలుకుంటోందనడానికి అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.3 లక్షల పైగా నమోదు కావడం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్‌కి ఉన్న సానుకూల అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ ఇటీవలే భారత సార్వభౌమ రేటింగ్‌ను నెగెటివ్ నుంచి స్టేబుల్ స్థాయికి మార్చిందని మంత్రి చెప్పారు. మెరుగైన ఇన్‌ఫ్రా, వృద్ధిలో వైవిధ్యం, అభివృద్ధికి డిమాండ్ తదితర అంశాలు ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment