‘స్వదేశీ’ ముసుగులో విదేశీ సేవ
-
‘ఇఫ్టూ’ నేత వెంకటేశ్వర్‌రావు
కాశిబుగ్గ : దేశప్రధాని నరేంద్రమోడీ స్వదేశీ నినాదం ముసుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆయా దేశాల సేవకు అంకితమయ్యారని ఐఎఫ్‌టీయూ ఆల్ ఇండియా అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్‌రావు విమర్శించారు. వరంగల్ 14వ డివిజన్‌లోని ఐఎఫ్‌టీ యూ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెళ్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలోని ప్రధాన ఆదాయ వనరుల నిర్వహణ కో సం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిం చడం ద్వారా ఇక్కడి సంపదను వారికి దారాధత్తం చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకం గా సెప్టెంబర్‌లో చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అలాగే, వచ్చే 9వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. సమావేశంలో ఐ.కృష్ణ, అనురాధ, నరేందర్, రాసుద్దీన్, శంకర్, విశ్వనాథం, అవినాష్, విష్ణు, దయాకర్, నున్నా అప్పారావు, బయ్యన్న, నర్సిం గం, శ్రీను పాల్గొన్నారు.