IFTU
-
పెద్దనోట్ల రద్దు కుబేరుల శ్రేయస్సు కోసమే..
ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ ఇందూరు: ‘‘ప్రధాని మోదీ దేశంలో నల్ల డబ్బును కట్టడి చేస్తాం. టెర్రరిస్టుల చేతుల్లో లేకుండా చేస్తాం.. అని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేయడం బాగుంది, కానీ మళ్లీ అంత కంటే పెద్దనోటు రూ.2,000 ఎందుకు ప్రవేశ పెట్టారో అర్థం కావడం లేదు, దీని వెనుక ఏదో కుట్ర ఉంది’’ అని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన బీడీ కార్మికుల భారీ ధర్నాలో వనమాల కృష్ణ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో బీడీ కార్మికుల్లో ఆందోళన మొదలైందని, ఆన్లైన్ అంటే తెలియని కష్టజీవులైన మహిళాబీడీ కార్మికులకు నెలసరి వేతనాలు చెల్లించే విషయంలో కేంద్రం కుట్ర చేస్తుం దని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ విష యంలో స్పందించి బీడీ కార్మికులకు నగదు రూపంలో బట్వాడ చెల్లించే విధంగా కేంద్రంతో మాట్లా డాలని కోరారు. నిర్మల్ కలెక్టరేట్ ముట్టడి నిర్మల్ టౌన్: నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ గురువారం నిర్మల్ కలెక్టరేట్‌ను బీడీ కార్మికులు ముట్టడించారు. బీడీ కార్మికులకు నగదు రూపంలోనే వీరికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు వస్తున్న రూ.వెయ్యికి 40 రూపాయల రుసుము వసూలు చేయడం దారుణమన్నారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
మక్తల్ : కార్మికుల హక్కుల రక్షణకు సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా సహాయకార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సమావేశాలు, బైక్‌ర్యాలీతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని అన్నారు. అందులో భాగంగానే పట్టణంలోని ఐబీ నుంచి నెహ్రూగంజ్, సంగంబండ, నల్లజానమ్మగుడి, పాతబజార్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. కార్యక్రమంలో ఇప్టూ నాయకులు భుట్టో, శ్రీనివాసులు, రమేష్, రాము, గోపి, రాజు, వెంకటేష్, సజన్, మారెప్ప, దేవప్ప, తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని : బొగ్గుగని కార్మికుల పదో వేజ్‌బోర్డులో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చించి వేతన ఒప్పందాన్ని చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేశ్ డిమాండ్ చేశారు. రెండేళ్ల చర్చల ఫలితంగా దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మిక సంఘాలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఐక్య ఉద్యమం నిర్వహించడంలో ఐఎఫ్టీయూ విజయం సాధించిందని తెలిపారు. ఆగస్టు 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఏడు రాష్ట్రాల ధర్నాలో ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు అపర్ణ, ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్, టి.శ్రీనివాస్, ఎ.వెంకన్న. జె.సీతారామయ్య, శంకర్‌ముదిరాజ్ పాల్గొన్నారని గుర్తుచేశారు. 2013 జనవరి నుంచి అమలు కావాల్సిన హైపవర్ కమిటీ వేతనాలపై వేజ్‌బోర్డు సంఘాలు స్పందించడం లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులకు హెచ్పీసీ వేతనాలు అమలు జరిగిన దాఖలాలు లేవని తెలిపారు. 10 వేజ్‌బోర్డులో కాంట్రాక్టు కార్మికులకు వేతన ఒప్పందాన్ని వర్తింపజేసి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారని, ధర్నా అనంతరం కేంద్ర బొగ్గు గనుల కార్యదర్శికి వినతిపత్రం అందించారని గుర్తుచేశారు. -
‘స్వదేశీ’ ముసుగులో విదేశీ సేవ
‘ఇఫ్టూ’ నేత వెంకటేశ్వర్రావు కాశిబుగ్గ : దేశప్రధాని నరేంద్రమోడీ స్వదేశీ నినాదం ముసుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆయా దేశాల సేవకు అంకితమయ్యారని ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు విమర్శించారు. వరంగల్ 14వ డివిజన్లోని ఐఎఫ్‌టీ యూ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెళ్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలోని ప్రధాన ఆదాయ వనరుల నిర్వహణ కో సం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిం చడం ద్వారా ఇక్కడి సంపదను వారికి దారాధత్తం చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకం గా సెప్టెంబర్‌లో చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అలాగే, వచ్చే 9వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. సమావేశంలో ఐ.కృష్ణ, అనురాధ, నరేందర్, రాసుద్దీన్, శంకర్, విశ్వనాథం, అవినాష్, విష్ణు, దయాకర్, నున్నా అప్పారావు, బయ్యన్న, నర్సిం గం, శ్రీను పాల్గొన్నారు. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం జిల్లా: కార్మిక చట్టాలను కాలరాస్తూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సేవలు చేస్తున్నారని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) ఆరోపించింది. టేకులపల్లి మండలకేంద్రంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బుధవారం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్మిక చట్టాల సవరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
బీడీ కార్మికుల పోరుబాట
ముకరంపుర: బీడీ కార్మికులకు ఆంక్షలు లేని జీవనభృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు సర్కస్‌గ్రౌండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. ధర్నాకు హాజరైన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు జేవీ చలపతిరావు మాట్లాడుతూ ఆంక్షలు పెట్టి జీవనభృతి చెల్లిస్తుండడంతో బీడీ కార్మికులందరికీ పింఛను అందడం లేదన్నారు. బీడీ యాజ మాన్యాలు కార్మికులకు చేతినిండా పని కల్పించ డం లేదని అన్నారు. కార్ఖానాలను వారానికి 2 లేదా 3 రోజులు బంద్ పెడుతున్నారని అన్నా రు. ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్ర మే జీవనభృతి చెల్లిస్తామనడం అన్యాయమన్నా రు. కార్మికులందరికీ పీఎఫ్ వర్తింపజేసి రూ. 1000 జీవనభృతి చెల్లించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు బి.సంపత్‌కుమార్, జిల్లా నాయకులు నరే ష్, చింత భూమేశ్వర్, వెంకన్న, ఆకుల రాము లు, పాముల కిషన్, రమేశ్, శ్రీనివాస్, మణె క్క, నల్ల శ్రీనివాస్, బాలలక్ష్మి, జగదీశ్వరి, రేవ తి, గంగాధర్, నరేందర్ పాల్గొన్నారు. -
పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారు
* కేంద్రం తీరుపై కార్మికసంఘాల ధ్వజం * ఇందిరాపార్కు వద్ద ధర్నా, భారీ ర్యాలీ హైదరాబాద్: పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నట్లుగా ఉందని కార్మికసంఘాల నేతలు ఆరోపించారు. కార్మిక చట్టాలను ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను సవరించేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు శుక్రవారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, బీఎంఎస్ తదితర కార్మిక సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో కార్మికసంఘాల నేతలు మాట్లాడుతూ... పారిశ్రామిక వేత్తలకు, పాలకులకు మధ్య రహస్య ఒప్పందాలు జరగుతున్నాయని విమర్శించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కేంద్రం తిలోదకాలిస్తోందని, అందులో భాగంగానే కార్మిక చట్టాల్లో సవరణకు పాల్పడుతోందని విమర్శించారు. కోట్లాది మంది కార్మికులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రపై ఏపీ, తెలంగాణ సీఎంలు స్పందించకపోవడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా 47 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికులు హక్కుల ఉల్లంఘనకు, తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావులు ప్రసంగించారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.మల్లేశం, ఏఐటీయూసీ రాష్ట్ర కన్వీనర్ సుధీర్, ఐఎఫ్టీయూ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వర రావు, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్ భాస్కర్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంకే బోస్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
జీవన భృతి కోసం ఆందోళన
నందిపేట : తమకు రూ.వెయ్యి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో బీడీ కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నందిగుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఐఎఫ్టీయూ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి జీవనభృతి అందజేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా, 25 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. వీరందరూ కేసీఆర్ మాటలు నమ్మి ఓట్లేశారని అన్నారు. కానీ అధికారంలోకి రాగానే కేసీఆర్ బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మరిచిపోయారని విమర్శించారు. బడ్జెట్లో బీడీ కార్మికుల భృతి అంశాన్ని ప్రస్తావించక పోవడం శోచనీయమన్నారు. బడ్జెట్లో అనవసరమైన పనులకు వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం, రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులకు రూ.840 కోట్లు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించిందని విమర్శించారు. కార్మికులతో ఎప్పుడో అవసరం తీరిపోయిందనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వెంటనే బడ్జెట్ సవరణ చేసి బీడీ కార్మికుల భృతికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సర్కారు మెడలు వంచి, ఆందోళనలు చేసి భత్యాన్ని సాధించుకుంటామన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తహశీల్దార్ బావయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, కె.గంగాదర్, జిల్లా ఉపాధ్యక్షులు బాగులు, రాజేశ్వర్, మల్లేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.