పెద్దనోట్ల రద్దు కుబేరుల శ్రేయస్సు కోసమే..
ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ
ఇందూరు: ‘‘ప్రధాని మోదీ దేశంలో నల్ల డబ్బును కట్టడి చేస్తాం. టెర్రరిస్టుల చేతుల్లో లేకుండా చేస్తాం.. అని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేయడం బాగుంది, కానీ మళ్లీ అంత కంటే పెద్దనోటు రూ.2,000 ఎందుకు ప్రవేశ పెట్టారో అర్థం కావడం లేదు, దీని వెనుక ఏదో కుట్ర ఉంది’’ అని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన బీడీ కార్మికుల భారీ ధర్నాలో వనమాల కృష్ణ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో బీడీ కార్మికుల్లో ఆందోళన మొదలైందని, ఆన్‌లైన్ అంటే తెలియని కష్టజీవులైన మహిళాబీడీ కార్మికులకు నెలసరి వేతనాలు చెల్లించే విషయంలో కేంద్రం కుట్ర చేస్తుం దని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ విష యంలో స్పందించి బీడీ కార్మికులకు నగదు రూపంలో బట్వాడ చెల్లించే విధంగా కేంద్రంతో మాట్లా డాలని కోరారు.
నిర్మల్ కలెక్టరేట్ ముట్టడి
నిర్మల్ టౌన్: నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ గురువారం నిర్మల్ కలెక్టరేట్‌ను బీడీ కార్మికులు ముట్టడించారు. బీడీ కార్మికులకు నగదు రూపంలోనే వీరికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు వస్తున్న రూ.వెయ్యికి 40 రూపాయల రుసుము వసూలు చేయడం దారుణమన్నారు.