జీవన భృతి కోసం ఆందోళన
నందిపేట : తమకు రూ.వెయ్యి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో బీడీ కార్మికులు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నందిగుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఐఎఫ్‌టీయూ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి జీవనభృతి అందజేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా, 25 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు.
వీరందరూ కేసీఆర్ మాటలు నమ్మి ఓట్లేశారని అన్నారు. కానీ అధికారంలోకి రాగానే కేసీఆర్ బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మరిచిపోయారని విమర్శించారు. బడ్జెట్‌లో బీడీ కార్మికుల భృతి అంశాన్ని ప్రస్తావించక పోవడం శోచనీయమన్నారు. బడ్జెట్‌లో అనవసరమైన పనులకు వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం, రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులకు రూ.840 కోట్లు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించిందని విమర్శించారు. కార్మికులతో ఎప్పుడో అవసరం తీరిపోయిందనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
వెంటనే బడ్జెట్ సవరణ చేసి బీడీ కార్మికుల భృతికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సర్కారు మెడలు వంచి, ఆందోళనలు చేసి భత్యాన్ని సాధించుకుంటామన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తహశీల్దార్ బావయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, కె.గంగాదర్, జిల్లా ఉపాధ్యక్షులు బాగులు, రాజేశ్వర్, మల్లేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.