మిరుదొడ్డి: బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నెలకు రూ. 1,000ల జీవన భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు బీడీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం మిరుదొడ్డిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల స్వామి మాట్లాడుతూ బీడీ కార్మికుల కోసం రూ. వెయ్యి జీవన భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందన్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రూ. 1,000 జీవన భృతి చెల్లిస్తామని ప్రకటించడంతో కార్మికుల్లో ఆశలు రేకెత్తాయన్నారు. అయితే బడ్జెట్‌లో మాత్రం జీవనభృతికి నిధులు కేటాయించక పోవడంతో కార్మికుల ఆశలు సన్నగిల్లే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కార్మికుల ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవన భృతి చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గతంలో బీడీ కార్మికులు 32 రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న 41జీఓను వెంటనే అమలు చేయాలని కోరారు. బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించేలా యాజమాన్యాలు చొరవ చూపాలన్నారు. కార్మికుల పిల్లలకు గత మూడు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు అందడం లేదన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు తహశీల్దార్ వసంత లక్ష్మికి వినతి పత్రం అందించారు.
బీడీ కార్మికుల అందోళనకు డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు ముత్యాల భూపాల్ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక డివిజన్ కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్, మండల కార్యదర్శి భిక్షపతి, బీడీ వర్కర్స్ మండల కార్యదర్శి తోకల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రమేష్, రాజు, నర్సింలు, సాధిక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బీడీ కార్మికులకు రూ.వెయ్యి చెల్లించాలి
Published Sat, Dec 27 2014 11:04 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM