పొగచూరిన బతుకుల పోరుబాట | Beedi workers concern for Living allowance | Sakshi
Sakshi News home page

పొగచూరిన బతుకుల పోరుబాట

Published Fri, Jan 2 2015 1:44 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

పొగచూరిన బతుకుల పోరుబాట - Sakshi

పొగచూరిన బతుకుల పోరుబాట

‘మునీం, సేట్ల దోపిడీతో కార్మికుల్లో అసంతృప్తి పేరుకుపోయిన పరిస్థితి. ఆగ్రహం నివురువుగప్పిన నిప్పులా రాజుకుంటుంది. ఈ అసంతృప్తి...ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. లక్ష్మి అనే పాత్రధారి బయటకు వస్తుంది. బీడీ కార్మికులందరినీ సమీకరించి బతుకు పోరు రాజేస్తుంది.’ 1980లో తెలంగాణ రచయిత బీఎస్ రాములు రాసిన ‘బతుకు పోరు’ పుస్తకం కథా వస్తువు ఇది.

ప్రస్తుతం మెతుకు సీమ పల్లెల్లో ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమవుతోంది. హక్కుల సాధన కోసం బీడీ కార్మికులు  రోడ్డు మీదకొస్తున్నారు. సిద్దిపేటలో రాజుకున్న బీడీ కార్మిక పోరాటం... దుబ్బాక...రామాయంపేట.. గజ్వేలు పల్లెలకు అంటుకొంది. ధర్నాలు, రాస్తారోకోలతో  కార్మికులు కదం తొక్కుతున్నారు.
 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘బీడీలు చుట్టటంలో కష్టం మాది... కష్టార్జితమేమో కంపెనోళ్లది. నెలకు  10 రోజులు కూడా పని ఇవ్వడంలేదు. నెలకు రూ.1000 జీవన భృతి ఇవ్వండి’ అనే డిమాండ్‌తో బీడీ కార్మికులు పోరుబాట పట్టారు.  ప్రభుత్వానికి సగటున రూ.100 కోట్ల సెస్సు, కంపెనీ యాజమాన్యాలకు రూ. 200 కోట్లు ఆర్జించి పెడుతున్న బీడీ కార్మికుల కష్టాల మాత్రం ఎవరికీ పట్టడం లేదు.

పని దినాలను కుదించి ... వర్ధీ బీడీలు తెచ్చి
జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు బీడీ కార్మికులుగా పని చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది వరకు కార్మికులున్నారు.  దాదాపు  14 గంటల పాటు  నిరంతరాయంగా బీడీలు చుడుతున్నారు. ఇన్ని గంటలు కష్టపడితే సగటున 800 వందల బీడీలు చుడుతున్నారు. 1000 బీడీలకు కంపెనీలు కేవలం రూ.100 నుంచి రూ.120 వరకు కట్టిస్తున్నారు.

ఈ లెక్కన దాదాపు 14 గంటలకు పైన కష్టపడితే రూ80 నుంచి 90 వరకు కూలీ పడుతోంది. ఆ పని నెలలో 10 రోజులు మాత్రమే కల్పిస్తున్నారు. ఇంకో పని చేయడం తెలియని బీడీ కార్మికులు మిగిలిన రోజుల్లో పని లేక, తిండికెళ్ల్లక  ఇబ్బంది పడుతున్నారు.  ఇదే సమయంలో కంపెనీల యాజమాన్యాలు అనధికారికంగా(వర్ధీ) కార్మికులతో బీడీలు చుట్టించి అతి తక్కువ కూలీ రేట్లు కట్టిస్తున్నారు. వర్ధీతో ఒక్కొక్క కార్మికుడు రోజుకు రూ.30, రూ.40 నష్టపోతున్నాడు. ప్రభుత్వానికి కూడా రూ.కోట్లలో సెస్సు ఎగ్గొడుతున్నారు.

30 ఏళ్లకే స్పాండలైటిస్...
అరకొర ఆదాయం కార్మికులకు మూడు పూటల కడుపు నింపలేకపోతోంది. ఇక  పౌష్టికాహారం అంటే ఏమిటో కూడా తెలియదు. ప్రతి మనిషికి కనీసం 2,800 కాలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని వైద్యులు చెప్తుండగా, ఆర్థిక సమస్యల కారణంగా  వీళ్లు కేవలం 1,700 కాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోగలుగుతున్నారని ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఫలితంగా ప్రతి మహిళ రక్త హీనతతో బాధపడుతోంది.

ఒకే పనిని ఏకాగ్రతతో 14 గంటల పాటు చేయడం వల్ల బీడీ కార్మికుల్లో 30 ఏళ్లకే మెడ నరాల నొప్పి (స్పాండలైసిస్)తో బాధపడుతున్నారు. పొగాకు కేన్సర్ కారకమని శాస్త్రీయంగానే నిర్ధారణ అయింది. బీడీ కార్మికులు ఏళ్ల తరబడి పోగాకుతోనే గడుపుతారు కాబట్టి కేన్సర్, టీబీ  వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు తేలింది. కార్మికులు సంపాదించిన దాంట్లో సగం డబ్బు ఆస్పత్రుల ఖర్చులకే  పోతున్నాయి. కార్మికులు రోగాల బారిన పడ్డప్పుడు  అండగా నిలబడాల్సిన కంపెనీలు మొఖం చాటేస్తున్నాయి.

చట్టాలకు తూట్లు....
కార్మికులకు కనీస వేతనం కింద 1,000 బీడీలు చుడితే రూ.158 కట్టివ్వాలని, వారానికి ఒక రోజు సెలవు, ఇతర అలవెన్సులు కలుపుకొని వెయ్యి బీడీలు చుడితే రూ.170 వరకు గిట్టుబాటు అయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట జీఓ 41 విడుదల చేసింది. ఆ త ర్వాత కంపెనీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి వెంటనే ఆ జీఓను పెండింగ్‌లో పెట్టారు.  దీన్ని అమల్లోకి తేవాలని కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా, పాలకులు పట్టించుకోవడం లేదు.

కేసీఆర్ ప్రభుత్వం జీవో 41 అమల్లోకి తేవడంతో పాటు, రూ.1000 భృతి  కలిపిస్తే  బీడీ కార్మికుల బతుకుల్లో  వెలుగులు పూస్తాయని సిద్దిపేట చెందిన బీడీ కార్మికులు చెబుతున్నారు. 1965 కార్మిక వేతన చట్టం, 1966 బీడీ కార్మిక చట్టం ప్రకారం వారానికి ఒక రోజు సెలవుతో కూడిన వేతనం ఇవ్వాలి. ఆరోగ్యకరమైన వాతావరణంలో పసి పిల్లలకు ఊయల కట్టించాలి. ప్రసవించిన మహిళలకు 180 రోజులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా వీటిని అమలు చేసినట్లు కనిపించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement