బాల్కొండ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు జీవన భృతిగా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట తప్పడం న్యాయమా.. సీఎం సారూ అంటూ తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలో బీడీ కార్మికులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుంచి తహశీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఆరు నెలలు గడిచినా దాని ఊసెత్తకపోవడం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు చేతినిండా పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా బీడీ కార్మికులను ఆదుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. వంద రోజుల పాలన ముగిసిన రోజు కూడా 43 రంగాల కార్మికులను ఆదుకుంటామని, అందులో బీడీ కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు. జూలై 7వ తేదీన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీడీ కార్మికుల ఓట్లతో గెలుపొందామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి గురించి ఊసే ఎత్తడం లేదన్నారు.అన్ని పార్టీ నాయకుల మాదిరిగానే కేసీఆర్ బీడీ కార్మికులను మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు.
నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తే బీడీ కార్మికులకు కూడా ఏమైనా ఇస్తారని ఆశతో ఎదురుచూస్తే, నిరాశే మిగిలిందన్నారు. లక్ష కోట్ల బడ్జెట్‌లో చిల్లి గవ్వ కూడా బీడీ కార్మికుల కోసం కేటాయించలేదన్నారు. నెలకు 70 కోట్ల నిధులు అవసరమయ్యే బీడీ కార్మికుల గురించి పట్టించుకోని సీఎం హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చడానికి వేల కోట్లు ఖర్చు చేస్తాననడం సిగ్గు చేటన్నారు. వెంటనే బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవన భృతిని అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్‌ను బీడీ కార్మికులు ఏడు అడుగుల లోతులో పాతి పెడతారని హెచ్చరించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ వేణుగౌడ్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ర్ట కార్యదర్శి ప్రభాకర్, నాయకులు దేవారాం, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
సీఎం సారూ.. మాట తప్పారు..
Published Sun, Dec 7 2014 2:54 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement