Living allowance
-
షరతులు లేకుండా భృతి ఇప్పించండి
మంత్రికి బీడీ కార్మికుల వినతి బీర్కూర్ : బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి ఇప్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బీడీ కార్మికులు విన్నవించారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి ఎదుట కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు జీవన భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తోందని, దీంతో తాము నష్టపోతున్నామని వాపోయూరు. తమలో కొంత మందికి పీఎఫ్ నంబర్లు లేవని, దీన్ని ఆసరా చేసుకుని తమకు పింఛన్ రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్లు వస్తున్న కుటుంబంలోని బీడీ కార్మికులకు జీవన భృతి అందించడం లేదన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉం టుం దని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. పీఎఫ్ నంబర్లు లేని వారికి సైతం పింఛన్లు ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు వచ్చే కుటుం బీకులకు కూడా భృతి అందేలా సీఎంతో మాట్లాడుతానన్నారు. ఎంపీడీవో తీరుపై ఆగ్రహం.. ఆసరా పింఛన్ల కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నామని, అయినా పెన్షన్లు ఇవ్వడం లేదని బీర్కూర్‌కు చెంది న సాయవ్వ, భూదెవ్వ అనే వృద్దులు మంత్రికి చెప్పగా ఆయన ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డిని పిలిచి ప్రశ్నిం చారు. తీరు మార్చుకోకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం ప్రభుత్వం వేల కోట్లు మంజూరు చేస్తున్నా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ మల్లెల మీనాహన్మంతు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ ఉన్నారు. -
పొగచూరిన బతుకుల పోరుబాట
‘మునీం, సేట్ల దోపిడీతో కార్మికుల్లో అసంతృప్తి పేరుకుపోయిన పరిస్థితి. ఆగ్రహం నివురువుగప్పిన నిప్పులా రాజుకుంటుంది. ఈ అసంతృప్తి...ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. లక్ష్మి అనే పాత్రధారి బయటకు వస్తుంది. బీడీ కార్మికులందరినీ సమీకరించి బతుకు పోరు రాజేస్తుంది.’ 1980లో తెలంగాణ రచయిత బీఎస్ రాములు రాసిన ‘బతుకు పోరు’ పుస్తకం కథా వస్తువు ఇది. ప్రస్తుతం మెతుకు సీమ పల్లెల్లో ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమవుతోంది. హక్కుల సాధన కోసం బీడీ కార్మికులు రోడ్డు మీదకొస్తున్నారు. సిద్దిపేటలో రాజుకున్న బీడీ కార్మిక పోరాటం... దుబ్బాక...రామాయంపేట.. గజ్వేలు పల్లెలకు అంటుకొంది. ధర్నాలు, రాస్తారోకోలతో కార్మికులు కదం తొక్కుతున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘బీడీలు చుట్టటంలో కష్టం మాది... కష్టార్జితమేమో కంపెనోళ్లది. నెలకు 10 రోజులు కూడా పని ఇవ్వడంలేదు. నెలకు రూ.1000 జీవన భృతి ఇవ్వండి’ అనే డిమాండ్‌తో బీడీ కార్మికులు పోరుబాట పట్టారు. ప్రభుత్వానికి సగటున రూ.100 కోట్ల సెస్సు, కంపెనీ యాజమాన్యాలకు రూ. 200 కోట్లు ఆర్జించి పెడుతున్న బీడీ కార్మికుల కష్టాల మాత్రం ఎవరికీ పట్టడం లేదు. పని దినాలను కుదించి ... వర్ధీ బీడీలు తెచ్చి జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు బీడీ కార్మికులుగా పని చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది వరకు కార్మికులున్నారు. దాదాపు 14 గంటల పాటు నిరంతరాయంగా బీడీలు చుడుతున్నారు. ఇన్ని గంటలు కష్టపడితే సగటున 800 వందల బీడీలు చుడుతున్నారు. 1000 బీడీలకు కంపెనీలు కేవలం రూ.100 నుంచి రూ.120 వరకు కట్టిస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 14 గంటలకు పైన కష్టపడితే రూ80 నుంచి 90 వరకు కూలీ పడుతోంది. ఆ పని నెలలో 10 రోజులు మాత్రమే కల్పిస్తున్నారు. ఇంకో పని చేయడం తెలియని బీడీ కార్మికులు మిగిలిన రోజుల్లో పని లేక, తిండికెళ్ల్లక ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో కంపెనీల యాజమాన్యాలు అనధికారికంగా(వర్ధీ) కార్మికులతో బీడీలు చుట్టించి అతి తక్కువ కూలీ రేట్లు కట్టిస్తున్నారు. వర్ధీతో ఒక్కొక్క కార్మికుడు రోజుకు రూ.30, రూ.40 నష్టపోతున్నాడు. ప్రభుత్వానికి కూడా రూ.కోట్లలో సెస్సు ఎగ్గొడుతున్నారు. 30 ఏళ్లకే స్పాండలైటిస్... అరకొర ఆదాయం కార్మికులకు మూడు పూటల కడుపు నింపలేకపోతోంది. ఇక పౌష్టికాహారం అంటే ఏమిటో కూడా తెలియదు. ప్రతి మనిషికి కనీసం 2,800 కాలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని వైద్యులు చెప్తుండగా, ఆర్థిక సమస్యల కారణంగా వీళ్లు కేవలం 1,700 కాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోగలుగుతున్నారని ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఫలితంగా ప్రతి మహిళ రక్త హీనతతో బాధపడుతోంది. ఒకే పనిని ఏకాగ్రతతో 14 గంటల పాటు చేయడం వల్ల బీడీ కార్మికుల్లో 30 ఏళ్లకే మెడ నరాల నొప్పి (స్పాండలైసిస్)తో బాధపడుతున్నారు. పొగాకు కేన్సర్ కారకమని శాస్త్రీయంగానే నిర్ధారణ అయింది. బీడీ కార్మికులు ఏళ్ల తరబడి పోగాకుతోనే గడుపుతారు కాబట్టి కేన్సర్, టీబీ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు తేలింది. కార్మికులు సంపాదించిన దాంట్లో సగం డబ్బు ఆస్పత్రుల ఖర్చులకే పోతున్నాయి. కార్మికులు రోగాల బారిన పడ్డప్పుడు అండగా నిలబడాల్సిన కంపెనీలు మొఖం చాటేస్తున్నాయి. చట్టాలకు తూట్లు.... కార్మికులకు కనీస వేతనం కింద 1,000 బీడీలు చుడితే రూ.158 కట్టివ్వాలని, వారానికి ఒక రోజు సెలవు, ఇతర అలవెన్సులు కలుపుకొని వెయ్యి బీడీలు చుడితే రూ.170 వరకు గిట్టుబాటు అయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట జీఓ 41 విడుదల చేసింది. ఆ త ర్వాత కంపెనీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి వెంటనే ఆ జీఓను పెండింగ్‌లో పెట్టారు. దీన్ని అమల్లోకి తేవాలని కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా, పాలకులు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 41 అమల్లోకి తేవడంతో పాటు, రూ.1000 భృతి కలిపిస్తే బీడీ కార్మికుల బతుకుల్లో వెలుగులు పూస్తాయని సిద్దిపేట చెందిన బీడీ కార్మికులు చెబుతున్నారు. 1965 కార్మిక వేతన చట్టం, 1966 బీడీ కార్మిక చట్టం ప్రకారం వారానికి ఒక రోజు సెలవుతో కూడిన వేతనం ఇవ్వాలి. ఆరోగ్యకరమైన వాతావరణంలో పసి పిల్లలకు ఊయల కట్టించాలి. ప్రసవించిన మహిళలకు 180 రోజులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా వీటిని అమలు చేసినట్లు కనిపించలేదు. -
కదంతొక్కిన బీడీ కార్మికులు
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీడీ కార్మికులు కదంతొక్కారు. మామడ, జన్నారంలో ర్యాలీలు చేపట్టి నిరసనలు చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగారు. మామడలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రూ.వెయ్యి జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిర్మల్(మామడ)/జన్నారం : సమస్యల పరిష్కారం కోసం బీడీ కార్మికులు కదంతొక్కారు. శనివారం మామడ, జన్నారం మండల కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. మామడలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో ర్యాలీగా బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు తరలివెళ్లారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రూ.వెయ్యి జీవనభృతి చెల్లించాలని అన్నారు. సమస్యలు పరిష్కారానికి నోచుకోక రాష్ట్రంలోని ఏడు లక్షల మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పనిదినాలు పెంచాలని అన్నారు. అనతరం ఆర్ఐ చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడివర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, ప్రధాన కార్యదర్శి రాజన్న, నాయకులు రాంలక్ష్మణ్, గంగన్న, గపూర్, సుమేష్, నంది రామయ్య పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు రూ. వెయ్యి భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ జన్నారంలో శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూతన్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విడుదల చేయకపోవడం విడ్డూరమని అన్నారు. కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతన చట్టం జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ సంపతి శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రాజన్న, మండల కార్యదర్శి కే.లింగన్న, సీఐటీయూ నాయకులు కూకటికారు బుచ్చన్న, పిల్లి అంజయ్య, అలగొండ శాంత, సిందెం స్వరూ ప, సుమారు వెయ్యి మంది బీడీ కార్మికులు పాల్గొన్నారు. -
బీడీ కార్మికులకు రూ.వెయ్యి చెల్లించాలి
మిరుదొడ్డి: బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నెలకు రూ. 1,000ల జీవన భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు బీడీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం మిరుదొడ్డిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల స్వామి మాట్లాడుతూ బీడీ కార్మికుల కోసం రూ. వెయ్యి జీవన భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందన్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రూ. 1,000 జీవన భృతి చెల్లిస్తామని ప్రకటించడంతో కార్మికుల్లో ఆశలు రేకెత్తాయన్నారు. అయితే బడ్జెట్లో మాత్రం జీవనభృతికి నిధులు కేటాయించక పోవడంతో కార్మికుల ఆశలు సన్నగిల్లే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కార్మికుల ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవన భృతి చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో బీడీ కార్మికులు 32 రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న 41జీఓను వెంటనే అమలు చేయాలని కోరారు. బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించేలా యాజమాన్యాలు చొరవ చూపాలన్నారు. కార్మికుల పిల్లలకు గత మూడు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు అందడం లేదన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు తహశీల్దార్ వసంత లక్ష్మికి వినతి పత్రం అందించారు. బీడీ కార్మికుల అందోళనకు డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు ముత్యాల భూపాల్ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక డివిజన్ కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్, మండల కార్యదర్శి భిక్షపతి, బీడీ వర్కర్స్ మండల కార్యదర్శి తోకల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రమేష్, రాజు, నర్సింలు, సాధిక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సారూ.. మాట తప్పారు..
బాల్కొండ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు జీవన భృతిగా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట తప్పడం న్యాయమా.. సీఎం సారూ అంటూ తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలో బీడీ కార్మికులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుంచి తహశీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఆరు నెలలు గడిచినా దాని ఊసెత్తకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు చేతినిండా పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా బీడీ కార్మికులను ఆదుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. వంద రోజుల పాలన ముగిసిన రోజు కూడా 43 రంగాల కార్మికులను ఆదుకుంటామని, అందులో బీడీ కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు. జూలై 7వ తేదీన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీడీ కార్మికుల ఓట్లతో గెలుపొందామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి గురించి ఊసే ఎత్తడం లేదన్నారు.అన్ని పార్టీ నాయకుల మాదిరిగానే కేసీఆర్ బీడీ కార్మికులను మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తే బీడీ కార్మికులకు కూడా ఏమైనా ఇస్తారని ఆశతో ఎదురుచూస్తే, నిరాశే మిగిలిందన్నారు. లక్ష కోట్ల బడ్జెట్లో చిల్లి గవ్వ కూడా బీడీ కార్మికుల కోసం కేటాయించలేదన్నారు. నెలకు 70 కోట్ల నిధులు అవసరమయ్యే బీడీ కార్మికుల గురించి పట్టించుకోని సీఎం హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చడానికి వేల కోట్లు ఖర్చు చేస్తాననడం సిగ్గు చేటన్నారు. వెంటనే బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవన భృతిని అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్‌ను బీడీ కార్మికులు ఏడు అడుగుల లోతులో పాతి పెడతారని హెచ్చరించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ వేణుగౌడ్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ర్ట కార్యదర్శి ప్రభాకర్, నాయకులు దేవారాం, గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
జీవన భృతి కోసం ఆందోళన
నందిపేట : తమకు రూ.వెయ్యి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో బీడీ కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నందిగుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఐఎఫ్టీయూ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి జీవనభృతి అందజేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా, 25 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. వీరందరూ కేసీఆర్ మాటలు నమ్మి ఓట్లేశారని అన్నారు. కానీ అధికారంలోకి రాగానే కేసీఆర్ బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మరిచిపోయారని విమర్శించారు. బడ్జెట్లో బీడీ కార్మికుల భృతి అంశాన్ని ప్రస్తావించక పోవడం శోచనీయమన్నారు. బడ్జెట్లో అనవసరమైన పనులకు వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం, రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులకు రూ.840 కోట్లు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించిందని విమర్శించారు. కార్మికులతో ఎప్పుడో అవసరం తీరిపోయిందనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వెంటనే బడ్జెట్ సవరణ చేసి బీడీ కార్మికుల భృతికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సర్కారు మెడలు వంచి, ఆందోళనలు చేసి భత్యాన్ని సాధించుకుంటామన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తహశీల్దార్ బావయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, కె.గంగాదర్, జిల్లా ఉపాధ్యక్షులు బాగులు, రాజేశ్వర్, మల్లేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.