పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారు
* కేంద్రం తీరుపై కార్మికసంఘాల ధ్వజం
* ఇందిరాపార్కు వద్ద ధర్నా, భారీ ర్యాలీ
హైదరాబాద్: పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నట్లుగా ఉందని కార్మికసంఘాల నేతలు ఆరోపించారు. కార్మిక చట్టాలను ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను సవరించేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు శుక్రవారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, బీఎంఎస్ తదితర కార్మిక సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో కార్మికసంఘాల నేతలు మాట్లాడుతూ... పారిశ్రామిక వేత్తలకు, పాలకులకు మధ్య రహస్య ఒప్పందాలు జరగుతున్నాయని విమర్శించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కేంద్రం తిలోదకాలిస్తోందని, అందులో భాగంగానే కార్మిక చట్టాల్లో సవరణకు పాల్పడుతోందని విమర్శించారు.
కోట్లాది మంది కార్మికులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రపై ఏపీ, తెలంగాణ సీఎంలు స్పందించకపోవడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా 47 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికులు హక్కుల ఉల్లంఘనకు, తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు.
ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావులు ప్రసంగించారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.మల్లేశం, ఏఐటీయూసీ రాష్ట్ర కన్వీనర్ సుధీర్, ఐఎఫ్‌టీయూ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వర రావు, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్ భాస్కర్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంకే బోస్, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రామయ్య తదితరులు పాల్గొన్నారు.