9 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
రూ. 659 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 659 కోట్ల విలువ చేసే 9 విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వొడాఫోన్, నెట్‌మ్యాజిక్ సొల్యూషన్స్ మొదలైన సంస్థల ప్రతిపాదనలు వీటిలో ఉన్నా యి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) సిఫార్సుల మేరకు ఫిబ్రవరి 21న జరిగిన సమావేశంలో ప్రభుత్వం తొమ్మిది ప్రతిపాదనలను ఆమోదించామని, మూడు ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి (సీసీఈఏ) పంపామని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆమోదం పొందిన వాటిలో నెట్‌మ్యాజిక్ సొల్యూషన్స్‌కి చెందిన రూ. 534 కోట్లు, వొడాఫోన్ ఇండియా 55 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి.
అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించి రూ.750 కోట్లు, స్టార్ టెక్నాలజీస్ (రూ. 900 కోట్లు) ఫ్లాగ్ టెలికం సింగపూర్ (రూ. 789 కోట్లు) ప్రతిపాదనలను సీసీఈఏకి పంపినట్లు కేంద్రం వివరించింది. మరోవైపు గ్లాండ్ ఫార్మా, క్రౌన్ సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా, పవర్‌విజన్ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇండియా తదితర ఆరు ప్రపోజల్స్‌పై నిర్ణయం వాయిదా పడింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, స్పెక్ట్రంల్యాబ్స్ ఇండియా, పీఎంఐ ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రతిపాదనలు ఆటోమేటిక్ మార్గానికి సంబంధించినవి కావడంతో ఎఫ్‌ఐపీబీ పరిశీలనకు రాలేదు.