
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అత్యధికంగా ఆకర్షించే దేశంగా భారత్ నిలవాల్సి ఉందని కేంద్ర ఐటీ, సమాచార, ఎల్రక్టానిక్స్ మంత్రి రవి శంకర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎఫ్‌డీఐలను ఆకర్షించడానికి ఏంచేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మన దేశంలో డిజిటల్‌గా అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు. యాపిల్ తదితర విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి మార్కెట్, ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉండే విధానాలను అవలంబిస్తున్నామని వివరించారు. ఇక్కడ జరిగిన ఇన్వెస్ట్ డిజికామ్ 2019లో ఆయన ప్రసంగించారు.
పన్నులు తగ్గించాం....
కంపెనీలకు అనుకూలమైన విధానాలనే అనుసరించాలని అధికారులకు ఆదేశాలిచ్చామని ప్రసాద్ పేర్కొన్నారు. కంపెనీలు ఆశించిన విధానాలను, సదుపాయాలను కలి్పంచడానికి సదా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తయారీ రంగంలో కంపెనీలు నెలకొల్పేవారికి ఇటీవల కార్పొరేట్ పన్నులు తగ్గించామని, ఈ తగ్గింపుతో పన్నుల విషయంలో వియత్నాం, థాయ్‌లాండ్ సరసన నిలిచామని వివరించారు.
అగ్రస్థానం చేరుకోవాలి..: ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆరి్థక వ్యవస్థగా భారత్ నిలిచిందని ప్రసాద్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తున్న తొమ్మిదో దేశంగానే ఉన్నామని, ఈ విషయంలో అగ్రస్థానానికి చేరాల్సి ఉందని వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కృషి చేయాల్సి ఉందని చెప్పారు.
6,400 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు
గత కొన్నేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు పెరుగుతోందని ప్రసాద్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 6,400 కోట్ల డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమమైన కంపెనీలను ఆకర్షించడానికి పన్నుల్లో, ఇతర నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేశామని పేర్కొన్నారు. మరెంతో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డేటా అనేది కీలకమైన వృద్ధి అంశాల్లో ఒకటని, డేటా ఎనలిటిక్స్‌లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదగాల్సి ఉందని పేర్కొన్నారు.