కరెంట్ అకౌంట్ లోటు పెరగొచ్చు: నొమురా
న్యూఢిల్లీ: దేశంలోకి వచ్చే– దేశం నుంచి వెళ్లే విదేశీ మారకద్రవ్యం ( ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ మినహా) మధ్య నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను జపాన్ బ్రోకరేజ్ సంస్థ–నొమురా పెంచింది. దీనిప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇంతక్రితం 0.4 శాతం అంచనా 1.4 శాతానికి ఎగసింది. కాగా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో అంచనాలను భారీగా 0.9 శాతం నుంచి 2.5 శాతానికిపెంచింది.
కరెంట్ అకౌంట్ పరిమాణాన్ని ఆ నిర్దిష్ట కాలానికి (ఏడాది లేదా త్రైమాసికం) సంబంధించి జీడీపీతో పోల్చి చెబుతారు. నవంబర్‌లో ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు రెండేళ్ల గరిష్టస్థాయి 13 బిలియన్ డాలర్లకు పెరిగిన నేపథ్యంలో నొమురా తాజా అంచనాలు వెలువడ్డాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జీడీపీ వృద్ధిరేటు పడిపోయే అవకాశాలు ఉండడం తాజాగా క్యాడ్ రేటు పెంచడానికి కారణంగా సంబంధిత వర్గాలు వివరించాయి. దీనికితోడు మరికొంత కాలం దేశ ఎగుమతులు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని నొమురా తన తాజా నివేదికలో పేర్కొంది.