మాంద్యంలో దేశీ సంస్కరణలే రక్ష
♦ 90 శాతం ఎఫ్‌డీఐలకు ద్వారాలు తెరిచిన దేశం మనదే
♦ ప్రభుత్వ చర్యల వల్లే భారత్ స్థానం మెరుగు
♦ ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ...
ముంబై: అంతర్జాతీయ ఆర్థిక మందగమనం వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను దేశీయంగా చేపట్టే సంస్కరణలు తేలిక పరుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక రంగానికి, పెట్టుబడులకు ఊతమిచ్చే విధానపరమైన చర్యలు కొనసాగుతాయని చెప్పారు. గోవాలో ఈ నెల 15, 16వ తేదీల్లో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సదస్సు జరగనుండగా... దానికి ముందు గురువారం ముంబైలో బ్రిక్స్ పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జైట్లీ హాజరై మాట్లాడారు.
‘90 శాతం రంగాల్లోకి ఆటోమేటిక్ మార్గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రపంచంలో అత్యధికంగా ఎఫ్‌డీఐకి ద్వారాలు తెరిచిన దేశం మనదే. 90 శాతం ఎఫ్‌డీఐ ఆటోమేటిక్ మార్గంలో వస్తోంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్న ఎఫ్‌డీఐ కేసు ఒక్కటీ లేదు. మోదీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో వ్యాపార నిర్వహణచాలా వరకు సులభంగా మారింది’ అని జైట్లీ వివరించారు.
ప్రభుత్వ చర్యల ఫలితమే...
వ్యాపార సులభతర నిర్వహణ, అంతర్జాతీయంగా పోటీతత్వ సూచీల్లో భారత్ స్థానం గత కొన్నేళ్లలో గణనీయంగా మెరుగుపడిందని జైట్లీ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన చర్యల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. విధానపరమైన సంస్కరణలు, నిర్ణయాలు ఏవైనా గానీ ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతోపాటు దేశాన్ని పెట్టుబడులకు అనుకూలంగా మార్చేందుకేనన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా మలచుకునే విషయంలో రాష్ట్రాల మధ్య పోటీని జైట్లీ ప్రశంసించారు.
బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం
బ్రిక్స్ దేశాల మధ్య సహకారం గతంలో కంటే మెరుగైందని జైట్లీ చెప్పారు. మరిన్ని రంగాల్లో సహకార విస్తరణకు వీలుగా బ్రిక్స్ దేశాల మధ్య క్రమం తప్పకుండా సమావేశాలు జరగాలని సూచించారు. బ్రిక్స్ దేశాలు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతం ఈ ఐదు దేశాల్లోనే ఉందని, ప్రపంచ జీడీపీలో గణనీయమైన భాగం ఈ దేశాలదేనన్నారు. ఎఫ్‌డీఐలు సైతం ఈ దేశాల మధ్య గణనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.