రూపాయి... 6 రోజుల్లో 161 పైసలు రన్‌! | Banks Have Traded Over $33 million On Interbank Forex Market | Sakshi
Sakshi News home page

రూపాయి... 6 రోజుల్లో 161 పైసలు రన్‌!

Published Tue, Mar 19 2019 12:00 AM | Last Updated on Tue, Mar 19 2019 12:00 AM

Banks Have Traded Over $33 million On Interbank Forex Market - Sakshi

న్యూఢిల్లీ: రూపాయి అప్రతిహత పురోగమనం కొనసాగుతోంది. సోమవారం వరుసగా ఆరవ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాల బాటన పయనించింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో 57 పైసలు లాభపడింది. 68.53 వద్ద ముగిసింది.  ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి 161 పైసలు లాభపడింది.  2018 ఆగస్టు 1వ తేదీన రూపాయి ముగింపు 68.43. అప్పటి తర్వాత రూపాయి మళ్లీ తాజా స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి.  శుక్రవారం రూపాయి ముగింపు 69.10. సోమవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్సే్చంజ్‌లో 68.92 వద్ద పటిష్టంగా రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒక దశలో 68.45న కూడా చూసింది. 

కారణాలను విశ్లేషిస్తే...
►ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేం ద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు
►డెట్, ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం.
► క్రూడ్‌ ఆయిల్‌ ధరలు అంతర్జాతీయంగా స్థిరంగా ఉండడం.
►దీనితో ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందన్న విశ్లేషణలు.
►వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు.
►డాలర్‌ ఇండెక్స్‌ కదలికలపై అనిశ్చితి.
►అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం. బుధవారం సమీక్ష సందర్భంగా రేటు పెంపు ఉండదన్న విశ్లేషణలు. 
►  మూడేళ్ల ఫారిన్‌ ఎక్సే్చంజ్‌ స్వాప్‌ ఆక్షన్‌ ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఐదు బిలియన్‌ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్‌ చేస్తోందన్న వార్త.

74.39 కనిష్టం నుంచి...
అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా  గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 14 డాలర్లకుపైగా పెరగడంతో మళ్లీ రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్‌ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఇలా అయితే కష్టమే...
రూపాయి వేగవంతమైన రికవరీ, ఈ పరిస్థితుల్లో వచ్చే ఒడిదుడుకులు ఆందోళన కలిగించే అంశమే. ఒడిదుడుకుల నిరోధానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. మారకపు విలువ అనిశ్చితి దేశీయ కరెన్సీ తీవ్ర ఒడిదుడుకులకూ కారణమవుతుంది. ఇది ఎగుమతిదారులకేకాదు. దిగుమతిదారులకూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది. రూపాయి మరింత పెరిగితే ఎగుమతులు పెరగాలన్న కేంద్ర విధానానికీ విఘాతం కలిగిస్తుంది. ఇప్పటికే సతమతమవుతున్న ఎగుమతుల రంగానికి ఇది ఒక పెద్ద సవాలే. ఇతర పోటీ కరెన్సీలతో భారత్‌ ఎగుమతులు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటాయి. 
– గణేశ్‌ గుప్తా, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌ 

ఆసియా కరెన్సీల్లోనే ఉత్తమ పనితీరు..
ఆసియా దేశాల కరెన్సీలన్నింటిలోనూ ఉత్తమ పనితీరు కనబరిచింది. వాణిజ్యలోటు సానుకూల స్థితి, విదేశీ నిధుల ప్రవాహం దీనికి కారణం. ఈ నెలల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 2.4 బిలియన్‌ డాలర్లు ఈక్విటీల్లో పెట్టుబడులుగా పెట్టారు. దీనితో భారత్‌ మార్కెట్లో వారి నికర కొనుగోళ్లు 4.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ నెల్లో రూపాయి డినామినేటెడ్‌ బాండ్లలో వారి హోల్డింగ్స్‌ 833 మిలియన్‌ డాలర్లు పెరిగాయి. 
– వీకే శర్మ, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement