సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకలో 62 శాతం వృద్ధి నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో 16.92 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు రాగా, ఈ ఏడాది 27.37 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాక 112 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి 9.61 బిలియన్ డాలర్లు రాగా, ఈ ఏడాది 20.42 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి.
ఎఫ్‌డీఐ ఈక్విటీల రాకలో ఆటోమొబైల్ పరిశ్రమ 23 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమ 18 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సేవారంగం 10 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. ఆటోమొబైల్ పరిశ్రమలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీలో 87 శాతం కర్ణాటక నుంచే నమోదైంది. తొలి నాలుగు నెలల్లో మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో కర్ణాటకకు 45 శాతం, మహారాష్ట్రకు 23 శాతం, ఢిల్లీకి 12 శాతం వచ్చాయి.
ఎఫ్‌డీఐ ఈక్విటీల రాకలో టాప్–10 రాష్ట్రాలు..
మహారాష్ట్ర (27 శాతం), గుజరాత్ (25), కర్ణాటక (20), ఢిల్లీ (11), తమిళనాడు (4), హరియాణా (3), జార్ఖండ్ (3), తెలంగాణ (2), పంజాబ్ (1), పశ్చిమ బెంగాల్ (1శాతం)తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. 8వ స్థానంలో నిలిచిన తెలంగాణకు తొలి మూడు నెలల్లో రూ. 4,226 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి.
2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ మధ్య
మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, యూపీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ ఎఫ్‌డీఐల రాకలో తొలి 15 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఈ కాలంలో రూ. 2,577 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. తెలంగాణకు రూ. 17,709 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి.
చదవండి: చలో ఆఫీస్..! .. డెలాయిట్ సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment