Industry Department
-
ఎఫ్ఎంసీజీ ఆదాయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మధ్య పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అధిక అమ్మకాల పరిమాణానికి తోడు గ్రామీణ మార్కెట్లు కోలుకోవడాన్ని ప్రస్తావించింది. పట్టణాల్లోనూ అమ్మకాలు 7–8 శాతం మేర పెరుగుతాయని, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధికితోడు, ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ అధిక విక్రయాలకు తోడ్పడొచ్చని అంచనా వేసింది. ప్రీమియం ఉత్పత్తుల వినియోగ ధోరణి, అమ్మకాల్లో వృద్ధి ఎఫ్ఎంసీజీ పరిశ్రమల నిర్వహణ మార్జిన్ల విస్తరణకు తోడ్పడతాయని.. మొత్తం మీద నిర్వహణ మార్జిన్లు 50–75 బేసిస్ పాయింట్లు పెరిగి 20–21 శాతానికి చేరుకోవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ‘‘మార్జిన్ల విస్తరణ అధికంగానే ఉంటుంది. కానీ మార్కెటింగ్ వ్యయాలు పెరగడం, సంఘటిత, అసంఘటిత రంగంలోని సంస్థల మధ్య అధిక పోటీ నెలకొనడం దీన్ని పరిమితం చేస్తుంది’’అని వివరించింది. ఫుడ్, బెవరేజెస్ విభాగంలో(ఎఫ్అండ్బీ) ముడి సరుకుల ధరలు పెరగడం మార్జిన్ల విస్తరణను పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. అదే సమయంలో వ్యక్తిగత, గృహ సంరక్షణ విభాగంలో కీలక ముడి సరుకుల ధరలు స్థిరంగానే ఉన్నాయని పేర్కొంది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో సగం ఫుడ్, బెవరేజెస్ నుంచే వస్తుండగా, వ్యక్తిగత సంరక్షణ, గృహ సంరక్షణ చెరో పావు శాతం వాటా కలిగి ఉన్నట్టు క్రిసిల్ గుర్తు చేసింది. ప్రీమియం ఉత్పత్తులను ఎక్కువగా ఆవిష్కరించడం, ముఖ్యంగా ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో తీసుకురావడం కంపెనీల మార్జిన్లకు మద్దతునిచ్చే అంశంగా పేర్కొంది. ఆహారం, పానీయాల్లో ఎక్కువ వృద్ధి ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో వృద్ధి అన్నది విభాగాల వారీగా భిన్నంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రవీంద్ర వర్మ తెలిపారు. ‘‘ఫుడ్, బెవరేజెస్ (ఎఫ్అండ్బీ) విభాగంలో ఆదాయాలు 8–9 శాతం మేర పెరగొచ్చు. వ్యక్తిగత సంరక్షణ విభాగంలో ఇది 6–7 శాతం మధ్య ఉంటుంది. గృహ సంరక్షణ ఉత్పత్తుల నుంచి ఆదాయం 8–9 శాతం మేర పెరగొచ్చు’’అని వర్మ తెలిపారు. -
ఎఫ్‌డీఐల రాకలో 62 శాతం వృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకలో 62 శాతం వృద్ధి నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో 16.92 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు రాగా, ఈ ఏడాది 27.37 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాక 112 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి 9.61 బిలియన్ డాలర్లు రాగా, ఈ ఏడాది 20.42 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాకలో ఆటోమొబైల్ పరిశ్రమ 23 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమ 18 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సేవారంగం 10 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. ఆటోమొబైల్ పరిశ్రమలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీలో 87 శాతం కర్ణాటక నుంచే నమోదైంది. తొలి నాలుగు నెలల్లో మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో కర్ణాటకకు 45 శాతం, మహారాష్ట్రకు 23 శాతం, ఢిల్లీకి 12 శాతం వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాకలో టాప్–10 రాష్ట్రాలు.. మహారాష్ట్ర (27 శాతం), గుజరాత్ (25), కర్ణాటక (20), ఢిల్లీ (11), తమిళనాడు (4), హరియాణా (3), జార్ఖండ్ (3), తెలంగాణ (2), పంజాబ్ (1), పశ్చిమ బెంగాల్ (1శాతం)తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. 8వ స్థానంలో నిలిచిన తెలంగాణకు తొలి మూడు నెలల్లో రూ. 4,226 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ మధ్య మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, యూపీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ ఎఫ్‌డీఐల రాకలో తొలి 15 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఈ కాలంలో రూ. 2,577 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. తెలంగాణకు రూ. 17,709 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. చదవండి: చలో ఆఫీస్..! .. డెలాయిట్ సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి -
పోచంపల్లి పట్టులో మెరిసిన బెంగాల్ ఎంపీ
హైదరాబాద్ : పార్లమెంటులో పదునైన ప్రసంగాలతో అధికార పక్షంపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మెయిత్రా పోచంపల్లి పట్టులో మెరిసిపోయారు. భారతీయ హస్తకళలను ఆమె మెచ్చుకుంటూ మోస్ట్ బ్యూటిఫుల్ పోచంపల్లి కాటన్ శారీ అంటూ ప్రశంసలు అందించారు. తెలంగాణ బహుమతిగా మంత్రి కేటీఆర్ ఈ చీరను అందించారని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు. Indian handlooms rock - wearing the most beautiful Pochampalli cotton saree from Telengana gifted to me on recent IT committe tour by @KTRTRS pic.twitter.com/jB30pxFeZN — Mahua Moitra (@MahuaMoitra) September 14, 2021 ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు నిర్వహిస్తోన్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బ్రాండ్ ప్రమోషన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించిన హస్త కళలను ఆయన ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మోయిత్రా హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మెయిత్రాకి పోచంపల్లి పట్టు చీరను బహుకరించారు మంత్రి కేటీఆర్. ఆ చీరను మరింత ఆధునిక పద్దతిలో ధరించారు ఎంపీ మహువా మెయిత్రా. చదవండి : ‘వండర్ఫుల్ కేటీఆర్’.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు -
డీపీఐఐటీ కార్యదర్శి.. గురుప్రసాద్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర పరిశ్రమలు, ఇంటర్నల్ ట్రేడ్ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్ మొహపాత్ర (59) కన్నుమూశారు. కరోనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం మరణించారని ఎయిమ్స్ ప్రకటించింది. అనారోగ్య కారణాలతో ఏప్రిల్ మధ్యలో ఆయన ఆస్పత్రిలో చేరారు. పదవిలో ఉండగా కరోనా కారణంగా మరణించిన మొదటి కార్యదర్శి ఆయనే కావడం గమనార్హం. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకెంతో బాధను కలిగించిందని పేర్కొన్నారు. గుజరాత్‌లోనూ, కేంద్రంలోనూ ఆయనతో కలసి పని చేసినట్లు వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. గురుప్రసాద్ ఎంతో నిర్మాణాత్మకంగా పని చేసేవారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పియూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్ కార్యదర్శి రాజివ్ గౌబా కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. గుజరాత్ కేడర్‌కు చెందిన గురుప్రసాద్ 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. చదవండి: (ఫోన్ మాట్లాడుతూ.. రెండు డోసులు?) -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
-
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిందిగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. వివిధ విష వాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.(కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు) జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా మరో ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ.. సంబంధిత పరిశ్రమల్లో ఏవైనా లోపాలు ఉంటే 30 రోజుల లోపే వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రతీ పరిశ్రమను పరిశీలించడమే ప్రధాన ఉద్దేశమని ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కారు.. 90 రోజుల్లో ఈ స్పెషల్ డ్రైవ్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. (నకిలీ ఔషధాలపై కొరడా) -
56వేల పరిశ్రమలు.. 16 లక్షల కార్మికులు!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ పారిశ్రామిక రంగ ముఖచిత్రం ఆవిష్కృతమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏయే పరిశ్రమలు అభివృద్ధి చెందాయనే లెక్క తేలింది. గత నెల 22 నుంచి దాదాపు 40 రోజులుగా రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు మూతపడ్డ నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున కార్మికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమలు తెరవాలా? వద్దా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అసలు రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఎన్ని పరిశ్రమలున్నాయనే సమాచారం సేకరించింది. ఈ వివరాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 56,546 పరిశ్రమలుండగా అందులో 16.34 లక్షల మంది పనిచేస్తున్నట్లు లెక్క తేల్చింది. వస్త్ర పరిశ్రమల్లోనే అధికం! గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులపై వస్త్ర పరిశ్రమ తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణవ్యాప్తంగా అధికంగా ఉపాధి కల్పిస్తున్నది టెక్స్టైల్ పరిశ్రమలే కావడం గమనార్హం. రాష్ట్రంలో 2,815 టెక్స్టైల్ కంపెనీలుండగా.. ఇందులో 2.85 లక్షల మంది పనిచేస్తున్నారు. ఆ తర్వాతి స్థానం ఖనిజాభివృద్ధి పరిశ్రమలది కాగా.. మూడో స్థానంలో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే సంస్థలున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా 1.16 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,413 ఔషధ, రసాయన పరిశ్రమల్లో 10.86 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇవేగాకుండా పరిశోధన, అభివృద్ధి సంస్థల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, గ్రామీణ ప్రాంత పారిశ్రామికాభివృద్ధిలో భారీ లఘు పరిశ్రమల కంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) లదే కీలక పాత్ర. ► రాష్ట్రవ్యాప్తంగా 18 నిర్దేశించిన రంగాలతో పాటు ప్రాధాన్యత కేటగిరీల్లో 56,546 పరిశ్రమలున్నాయి. వీటిలో 16.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ►18 రంగాలైన బొగ్గు, సౌర విద్యుత్ సంస్థలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, సిమెంటు, ఇతర నిర్మాణ పరిశ్రమలు, గ్రానైట్ అండ్ స్టోన్ క్రషింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫార్మా అండ్ కెమికల్స్, పేపర్ అండ్ ప్రింటింగ్, ప్లాస్టిక్ అండ్ రబ్బర్, బేవరేజెస్, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లెదర్, తేయాకు అనుబంధ పరిశ్రమలు తదితర కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,546 పరిశ్రమలున్నాయి. వీటిల్లో 16.34 లక్షల మంది ఉద్యోగులున్నారు. ►థర్మల్, సోలార్ పవర్ ప్రాజెక్టులన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ►ఎయిరోస్పేస్ డిఫెన్ అండ్ ఇంజనీరింగ్ పరిశ్రమలు 70 శాతం ఆదిబట్ల, బాలానగర్, కూకట్పల్లి, జీడిమెట్ల, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఉండగా.. మిగతా 30 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ►సిమెంటు, కాంక్రీటు ఉత్పత్తుల పరిశ్రమలు, ఫ్లైయాష్ ఇటుక ఫ్యాక్టరీలు పూర్తిగా గ్రామీణ జిల్లాల్లో ఉన్నాయి. ►గ్రానైట్, స్టోన్ క్రషింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలు ఎక్కువగా పట్టణ ప్రాంతాలు, యూడీఏ(పట్టణాభివృద్ధి సంస్థలు)పరిధిలో ఉండగా... 30 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ►ఫార్మాసూటికల్ అండ్ కెమికల్ పరిశ్రమల కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. ►నిర్దేశించిన కేటగిరీలు కానీ 27,441 పరిశ్రమల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమంగా ఉన్నాయి. వీటి పరిధిలో 3.36 లక్షల మంది ఉద్యోగులున్నారు. తాళం తీద్దామా! కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మే ఏడో తేదీ తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చే అంశాలను పరిశీలిస్తోంది. లాక్‌డౌన్‌ను కొనసాగించినా, ఆంక్షలు పాక్షికంగా సడలించినా గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలను ప్రారంభించుకునేందుకు అనుమతినివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసులు నమోదైన చోట్ల, పట్టణ ప్రాంతాల్లో యథావిధిగా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు ఓకే చెప్పనుంది. ఇప్పటికే ఫార్మా, ఆహార, నిత్యావసర సరుకుల తయారీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా.. తాజాగా స్టోన్ క్రషింగ్ , ఇటుక తయారీ తదితర సంస్థల పునరుద్ధరణకు అంగీకరించింది. కాగా, కంపెనీల్లో పనిచేసే కార్మికులు మాత్రం విధిగా పరిశ్రమల ఆవరణలోనే వసతి సౌకర్యం కల్పించాలనే షరతు విధించే అవకాశమున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కార్మికులు రాకపోకలు సాగించడం వల్ల వైరస్ సంక్రమించే ప్రమాదమున్నందున.. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే నివాస ఏర్పాట్లు చేయాలని ఆదేశించనున్నట్లు ఆయన చెప్పారు. మే 7 తర్వాత జనసమ్మర్థం ఎక్కువగా ఉండే థియేటర్లు, పార్కులు, హోటళ్లు, ప్రజా రవాణాపై నిషేధం కొనసాగిస్తూ.. భౌతిక దూరం నిబంధన పాటిస్తూ జరిగే కార్యకలాపాలకు అనుమతిచ్చే అవకాశం కనిపిస్తోంది. -
జీఎస్టీ మండలి నిర్ణయాలపై పరిశ్రమ వర్గాల హర్షం
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ 23 రకాల వస్తు, సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 32 అంగుళాల టీవీలు, కంప్యూటర్ మానిటర్లు, వీడియోగేమ్స్, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, రీట్రేడెడ్ టైర్లు, వీల్ చైర్లు, సినిమా టికెట్లు సహా 17 రకాల వస్తువులు, ఆరు సేవలపై పన్ను శ్లాబులను కౌన్సిల్ మార్చింది. 28 శాతం నుంచి 18 శాతానికి, కొన్ని 18 శాతం నుంచి 12, 5 శాతానికి మార్చిన విషయం గమనార్హం. ‘‘రేట్లను గణనీయంగా తగ్గించడం ద్వారా జీఎస్టీ కౌన్సిల్ ఆచరణాత్మక విధానాన్ని అనుసరించింది. ఈ నిర్ణయాలు జీఎస్టీ విధానాన్ని మరింత బలోపేతం, స్థిరపడేలా చేస్తాయి’’అని ఫిక్కీ తన ప్రకటనలో పేర్కొంది. ‘‘బలమైన వినియోగం వృద్ధిని వేగవంతం చేస్తుంది. వివిధ తరగతి ప్రజలు వినియోగించే వస్తువులపై పన్ను రేట్ల తగ్గింపుతో ఆ ర్థిక రంగానికి అవసరమైన ఊతం లభిస్తుంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పరోక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన వృద్ధికి తోడు అధిక జీఎస్టీ రేట్లను తగ్గించడం అనేవి... పన్ను చెల్లించే పరిధి పెరిగిందని, ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని తెలుస్తోందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. -
‘రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రమై నా అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమల, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాల మల్లు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం పరిశ్రమల భవన్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు. భవిష్యత్‌లో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనలో మరిన్ని మైలు రాళ్లను చేరుకోవడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ సీఈవో వి.మధుసూదన్‌రావు, సీఈ శ్యామ్ సుందర్, సీజీఎం గీతాంజలి, జీఎం కళావతి తదితరులు పాల్గొన్నారు. -
ఇండస్ట్రీస్ మేనేజర్ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, మహబూబ్‌నగర్ : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు మేనేజర్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు రూ. 3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి జిల్లాలోని మియాపూర్, బాలాజీనగర్‌తో సహా ఐదు చోట్ల సోదాలు నిర్వహించగా భారీగా అక్రమ ఆస్తులను గురించారు. అధికారులు పల్లుచోట్ల ఇంకా సోదాలు జరుపుతున్నారు. -
మెదక్‌లో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్
- పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు ఏర్పాటు - డిప్ కార్యదర్శితో భేటీలో సీఎస్ రాజీవ్‌శర్మ వెల్లడి - నిమ్జ్, ఫార్మాసిటీకి సాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం - డీపీఆర్ తయారు చేయాలని డిప్ అధికారుల సూచన సాక్షి, హైదరాబాద్: పెట్టుబడిదారుల నడుమ పోటీతత్వం పెంచడంతో పాటు ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి మరింత మంది పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వెల్లడించారు. కేంద్ర పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాల విభాగం(డిప్) కార్యదర్శి రమేశ్‌అభిషేక్, సంయుక్త కార్యదర్శి శైలేంద్రసింగ్‌తో బుధవారం సచివాలయంలో రాజీవ్‌శర్మ సమావేశమయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రం తరఫున డిప్‌కు పలు ప్రతిపాదనలు సమర్పించారు. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్)తో పాటు ఫార్మా సిటీ మాస్టర్‌ప్లాన్, మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం సాయం చేయాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణానికి మరింత ఊతమిచ్చేందుకు మెదక్ జిల్లాలో నిమ్జ్, హైదరాబాద్ ఫార్మా సిటీ, వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు, డ్రైపోర్టులు, పారిశ్రామిక కారిడార్లు తదితరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్‌శర్మ వెల్లడించారు. సమీకృత మెషీన్ టూల్ పార్కు, పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి కేంద్రం, టెక్స్టైల్ మెషినరీ తయారీకి అవసరమైన ఇంజనీరింగ్ సౌకర్యాలు తదితరాలను నిమ్జ్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా నిమ్జ్‌లో మరిన్ని పెట్టుబడులు రాబట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఫార్మా సిటీలో ఫార్మా యూనివర్సిటీతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో సులభ వాణిజ్యం దిశగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్ వివరించారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే వారు గతంలో 114 రకాలైన అనుమతులు తీసుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతం 12 రకాలైన అనుమతులకు పరిమితం చేస్తూ జీవో 84 జారీ చేశామన్నారు. వరంగల్ సమీకృత టెక్స్టైల్ పార్కు, డ్రై పోర్టులు, హైదరాబాద్-వరంగల్ ఆర్థిక కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేయాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులకు డిప్ కార్యదర్శి రమేశ్‌అభిషేక్ సూచించారు. దేశంలో ఏర్పాటయ్యే పారిశ్రామిక అభివృద్ధి కారిడార్లలో తెలంగాణను భాగస్వామిగా చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. -
పరిశ్రమలకు ప్రోత్సాహమేదీ?
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖకు జరిగిన కేటాయింపులను గత ఏడాదితో పోలిస్తే 2016-17 ఆర్థిక బడ్జెట్లో రూ.6.64 కోట్ల మేర కోతలు విధిస్తూ ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సమర్పించారు. గత ఏడాది పరిశ్రమల శాఖకు రూ.973.73 కోట్లను ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల క్రింద ప్రతిపాదించగా.. ఈ ఏడాది రూ.967.09 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో రూ.859.63 కోట్లను ప్రణాళికా వ్యయం కింద ప్రతిపాదించారు. గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్లో ఇప్పటి వరకు రూ.689.26 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు సవరణ ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్లో పరిశ్రమల విభాగానికి మినహా.. ఇతర అనుబంధ శాఖల కోటాలో భారీగా కోత విధించారు. విదేశీ వాణిజ్యం, ఎగుమతులు, చక్కెర పరిశ్రమ శాఖ కు నయాపైసా విదల్చలేదు. చక్కెర శాఖను వ్యవసాయ శాఖలో.. విదేశీ వాణిజ్య విభాగాన్ని టీఎస్ఐఐసీలో విలీనం చేస్తారనే వార్తల నేపథ్యంలో నయాపైసా కేటాయించక పోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజాం దక్కన్ షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం చొరవ చూపుతుందని ఆశించినా.. బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. ఆహార నిల్వ, గిడ్డంగులకు గత ఏడాది రూ.101.56 కోట్లు ప్రతిపాదించి, రూ.60.26 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఏడాది ప్రతిపాదన ల్లో కేవలం రూ.10 కోట్లకు పరిమి తం చేశారు. చేనేత, జౌళి శాఖకు సంబంధించి కేటాయింపుల్లోనూ భారీగా కోతలు విధించారు. గనులు, భూగర్భ వనరుల శాఖకు గత ఏడాది మాదిరిగానే ప్రణాళికా వ్యయం కింద రూ.కోటి కేటాయించారు. గ్రామీణ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలకు గతంలో రూ.562.88 కోట్లు ప్రతిపాదించగా.. ప్రస్తుత బడ్జెట్లో రూ.778.63 కోట్లు ప్రతిపాదించారు.