2024–25పై క్రిసిల్ అంచనా
ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మధ్య పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అధిక అమ్మకాల పరిమాణానికి తోడు గ్రామీణ మార్కెట్లు కోలుకోవడాన్ని ప్రస్తావించింది. పట్టణాల్లోనూ అమ్మకాలు 7–8 శాతం మేర పెరుగుతాయని, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధికితోడు, ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ అధిక విక్రయాలకు తోడ్పడొచ్చని అంచనా వేసింది.
ప్రీమియం ఉత్పత్తుల వినియోగ ధోరణి, అమ్మకాల్లో వృద్ధి ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమల నిర్వహణ మార్జిన్ల విస్తరణకు తోడ్పడతాయని.. మొత్తం మీద నిర్వహణ మార్జిన్లు 50–75 బేసిస్ పాయింట్లు పెరిగి 20–21 శాతానికి చేరుకోవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ‘‘మార్జిన్ల విస్తరణ అధికంగానే ఉంటుంది. కానీ మార్కెటింగ్ వ్యయాలు పెరగడం, సంఘటిత, అసంఘటిత రంగంలోని సంస్థల మధ్య అధిక పోటీ నెలకొనడం దీన్ని పరిమితం చేస్తుంది’’అని వివరించింది.
ఫుడ్, బెవరేజెస్ విభాగంలో(ఎఫ్‌అండ్‌బీ) ముడి సరుకుల ధరలు పెరగడం మార్జిన్ల విస్తరణను పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. అదే సమయంలో వ్యక్తిగత, గృహ సంరక్షణ విభాగంలో కీలక ముడి సరుకుల ధరలు స్థిరంగానే ఉన్నాయని పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో సగం ఫుడ్, బెవరేజెస్ నుంచే వస్తుండగా, వ్యక్తిగత సంరక్షణ, గృహ సంరక్షణ చెరో పావు శాతం వాటా కలిగి ఉన్నట్టు క్రిసిల్ గుర్తు చేసింది. ప్రీమియం ఉత్పత్తులను ఎక్కువగా ఆవిష్కరించడం, ముఖ్యంగా ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో తీసుకురావడం కంపెనీల మార్జిన్లకు మద్దతునిచ్చే అంశంగా పేర్కొంది.
ఆహారం, పానీయాల్లో ఎక్కువ వృద్ధి
ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో వృద్ధి అన్నది విభాగాల వారీగా భిన్నంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రవీంద్ర వర్మ తెలిపారు. ‘‘ఫుడ్, బెవరేజెస్ (ఎఫ్‌అండ్‌బీ) విభాగంలో ఆదాయాలు 8–9 శాతం మేర పెరగొచ్చు. వ్యక్తిగత సంరక్షణ విభాగంలో ఇది 6–7 శాతం మధ్య ఉంటుంది. గృహ సంరక్షణ ఉత్పత్తుల నుంచి ఆదాయం 8–9 శాతం మేర పెరగొచ్చు’’అని వర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment