జూన్‌లో పెట్టుబడులు రూ. 26,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. జూన్ నెలలో ఇప్పటివరకూ రూ. 26,165 కోట్లను(4.42 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏకు పూర్తి మెజారిటీ లభించడంతోపాటు, నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణాత్మక చర్యలు ఎఫ్‌ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఎఫ్‌ఐఐలు ఈక్విటీలలో నికరంగా రూ. 10,359 కోట్లు, రుణ(డెట్) మార్కెట్లో రూ. 15,806 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 4% పుంజుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఎఫ్‌ఐఐలు ఓవైపు ఈక్విటీలలో నికరంగా రూ. 56,163 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, మరోపక్క రూ. 61,925 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. ఇవి దాదాపు 20 బిలియన్ డాలర్లకు(రూ. 1.18 లక్షల కోట్లు) సమానం.