మోడీ ఎఫెక్ట్.. లక్ష కోట్ల ఎఫ్‌ఐఐ నిధులు
మోడీని గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నాటినుంచి చూస్తే.. దేశంలోకి విదేశీ నిధుల ప్రవాహం పోటెత్తింది. అప్పటినుంచి ఏకంగా రూ. లక్ష కోట్లకుపైగా ఎఫ్‌ఐఐ పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. సెబీ తాజా గణాంకాల ప్రకారం... మోడీ ప్రధాని అభ్యర్థి ప్రకటన తర్వాత... ఈక్విటీల్లోకి రూ.88,772 కోట్లు, డెట్ మార్కెట్లలోకి రూ.13,399 కోట్లు చొప్పున మొత్తం రూ.1,02,171 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. దేశంలో సుస్థిర ప్రభుత్వం రానుండటంతో... సంస్కరణలకు ఢోకా ఉండదన్న విశ్వాసమే ఎఫ్‌ఐఐల జోరుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎన్‌డీఏకి పూర్తి స్థాయిలో పటిష్ట మెజారిటీ రావడంతో విదేశీ నిధులు మరింత పుంజుకోనున్నాయని పేర్కొన్నారు. కాగా, 2014 ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎఫ్‌ఐఐలు దేశీ మార్కెట్లోకి రూ.74,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.